మహిళల కోసం... మహిళల చేత!
ఆ హాస్పిటల్లో మహిళలే డాక్టర్లు. వార్డ్ బాయ్ అనే పదం వినిపించదు. అన్ని సర్వీస్‌లూ మహిళలే అందిస్తారు. నైట్ షిఫ్ట్ అని వెనుకడుగు వేయడం ఉండదు. ఇరవై నాలుగ్గంటలూ మహిళలే పని చేస్తారు.
ఎమ్ఎమ్సీహెచ్... అంటే ముస్లిమ్ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇది హైదరాబాద్, చాదర్‌ఘాట్, ఉస్మాన్ పురాలో ఉంది. ఈ హాస్పిటల్ గురించి చెప్పుకోవలసింది చాలానే ఉంది. మహిళల కోసం యాభై మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో సీఈవో నుంచి సెక్యూరిటీ స్టాఫ్ వరకూ అందరూ మహిళలే. నో ప్రాఫిట్ నో లాస్ విధానంలో పని చేస్తున్న ఈ హాస్పిటల్ గురించి సీఈవో డాక్టర్ నీలోఫర్ ఇలా వివరించారు.
► మూడు వందలకు పైగా...
‘‘మహిళా సాధికారతకు చిహ్నం మా హాస్పిటల్. ఇది 200 పడకల హాస్పిటల్. కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా మహిళలందరికీ వైద్యసేవలందిస్తాం. విశేషం ఏమిటంటే... మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో మూడు వందల మందికి పైగా మహిళలం సేవలందిస్తున్నాం. ప్రధాన ద్వారం సెక్యూరిటీ నుంచి రిసెప్షన్, ఫార్మసీ, ఫార్మసీ స్టోర్స్ నిర్వహణ, ల్యాబ్ టెక్నీషియన్ లు అందరూ మహిళలే. అంబులెన్స్ డ్రైవర్లు, వెనుక ద్వారం దగ్గర సెక్యూరిటీ దగ్గర మాత్రం మగవాళ్లు డ్యూటీ చేస్తారు. ‘ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ’ నగరంలో స్థాపించిన మూడు స్కూళ్లు, మూడు హాస్పిటళ్లలో ఇది ఒకటి. మహిళల హాస్పిటల్‌గా పేరు వచ్చినప్పటికీ నిజానికి ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇందులో చిన్నపిల్లల విభాగం, డర్మటాలజీ, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ విభాగాలు కూడా పని చేస్తున్నాయి. రోజుకు ఓపీ రెండు వందల వరకు ఉంటుంది. అందులో నూట పాతిక వరకు మహిళలే ఉంటారు. నెలకు సరాసరిన రెండు వందల డెలివరీలుంటాయి.
► ట్వంటీ ఫోర్ బై సెవెన్ !
సెక్యూరిటీ, ఫార్మసీ, రిసెప్షన్ ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తుంటాయి. వారంలో ఏడు రోజులూ, రోజులో ఇరవై నాలుగ్గంటలూ డ్యూటీలో ఉంటారు మహిళలు. మీకో సంగతి తెలుసా? మా హాస్పిటల్లో డే కేర్ సెంటర్ ఉంది. మహిళకు తగిన సౌకర్యాలు కల్పిస్తే ఏ షిఫ్ట్‌లోనైనా డ్యూటీ చేయగలరని నిరూపిస్తోంది మా హాస్పిటల్. ఇది టీచింగ్ హాస్పిటల్. వరంగల్, కెఎన్ ఆర్ యూనివర్సిటీలతో అనుసంధానమై ఉంది. బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ నుంచి ఏటా ముపై ్పమందికి మహిళలకు అవకాశం ఉంటుంది. హాస్టల్ కూడా ఇదే ప్రాంగణం లో ఉంది. మా హాస్పిటల్లో కెఫెటేరియాతోపాటు లైబ్రరీ కూడా ఉంది చూడండి. వైద్యరంగంలో అమూల్యమైన పుస్తకాల కలెక్షన్ ఉంది. బయటకు ఇవ్వం, ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు.
► వైద్యపరీక్షలిక్కడే!
మా దగ్గర పూర్తి స్థాయి ల్యాబ్ ఉంది. 98శాతం టెస్ట్‌లు ఇక్కడే చేస్తాం. కొన్ని ప్రత్యేకమైన కేసులకు మాత్రం శాంపుల్స్ ముంబయికి పంపిస్తాం. ఈసీజీ, అల్ట్రా సౌండ్ స్కానింగ్, సోనాలజిస్ట్లతోపాటు రేడియాలజిస్ట్ కూడా మహిళే. రేడియాలజీ లో మహిళలు తక్కువగా ఉంటారు. ట్రీట్మెంట్ సమయంలో రేడియాలజిస్ట్ కూడా కొంత రేడియేషన్ ప్రభావానికి గురవుతుంటారు. కాబట్టి మహిళలు తాము గర్భిణులుగా ఉన్నప్పుడు డ్యూటీ చేయడం కష్టం. అందుకే ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కొంచెం సంశయిస్తారు. అలాంటిది మా దగ్గర రేడియాలజిస్ట్‌గా కూడా మహిళే డ్యూటీ చేస్తున్నారు.
► నార్మల్ డెలివరీల రికార్డ్!
ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన మా హాస్పిటల్ లో మొత్తం డాక్టర్లు పాతిక మంది, మెటర్నిటీ విభాగంలో ఇద్దరు హెచ్వోడీలతోపాటు పన్నెండు మంది డాక్టర్లు, దాదాపు వందమంది నర్సింగ్ స్టాఫ్, ఎనభైకి పైగా హౌస్ కీపింగ్ ఎంప్లాయీస్ విధులు నిర్వర్తిస్తున్నారు. పేట్ల బురుజులో ఉన్న గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తర్వాత అత్యధికంగా ప్రసవాలు జరిగేది మా హాస్పిటల్లోనే. గత ఏడాదికి గాను అత్యధికంగా నార్మల్ డెలివరీలు చేసిన హాస్పిటల్‌గా మా హాస్పిటల్‌కి ప్రశంసలు కూడా వచ్చాయి. మగడాక్టర్లు నియోనేటల్ విభాగంలో మాత్రం ఉన్నారు.
ప్రధాన ద్వారం నుంచి కారిడార్‌తోపాటు ముఖ్యమైన ప్రదేశాలన్నీ సీసీటీవీ నిఘాలో ఉంటాయి. ఐసీయూ బెడ్ పట్టే స్థాయి లిఫ్ట్ కూడా ఉంది. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ ఇది చారిటీ హాస్పిటల్ కావడంతో మా దగ్గర ఫీజులు చాలా చాలా తక్కువ. ఓ యాభై ఐదేళ్ల కిందట ఒక మహిళ మగ డాక్టర్ దగ్గర ప్రసవం చేయించుకోవడానికి ఇష్టపడక, ఆ సమయానికి లేడీ డాక్టర్ అందుబాటులో లేక చివరికి ఆ గర్భిణి మరణించిందట. ఆ సంఘటన తర్వాత మహిళల కోసం మహిళలే పని చేసే ఒక హాస్పిటల్ ఉండాలని భావించిన అబ్దుల్ రజాక్ లతీఫ్ ఈ హాస్పిటల్‌ను ప్రతిపాదించారు. యాభై మూడేళ్లుగా మహిళల కోసం మహిళలే ఇరవై నాలుగ్గంటలూ సేవలందిస్తున్నారు’’ అంటూ వివరించారు డాక్టర్ నీలోఫర్.
40 ఇంక్యుబేటర్లు, వార్మర్, ఫొటో థెరపీ సర్వీస్, పుట్టిన బిడ్డ వినికిడి పరీక్ష కోసం ఆడిటరీ టెస్ట్ సౌకర్యం కూడా ఉంది. మా హాస్పిటల్ నిర్మాణం ఎంత ముందు చూపుతో జరిగిందంటే... డెలివరీ రూమ్ నుంచే నియోనేటల్కు, పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు కనెక్షన్ ఉంది. అవసరమైతే బిడ్డను ఆ విభాగానికి పంపించి తల్లిని ఈ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. ఇద్దరూ క్షేమంగా ఉంటే మామూలు వార్డుకి లేదా రూమ్‌కి షిఫ్ట్ చేస్తాం.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి