సీపీఎస్ రద్దే లక్ష్యంగా ఉద్యమం
విజయనగరంఅర్బన్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయించడమే లక్ష్యంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (జెఏసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరావు పిలుపునిచ్చారు. యూటీఎఫ్ జిల్లా కమిటీ స్థానిక ఎన్జీవో భవనం సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గి 2004లో కాంగ్రెస్ పాలకులు ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారని, దాన్ని రద్దు చేయకుండా బీజేపీ కొనసాగించడం అన్యాయమన్నారు.
ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత బతుకు భరోసా లేకుండా సీపీఎస్ విధానం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేపథ్యంలో వచ్చినది కాబట్టి అదే రాజకీయ విధానంతోనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు ఎస్.మురళీమోహన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో రాష్ట్ర సహాధ్యక్షురాలు కె.విజయగౌరి, కార్యదర్శి డి.రాము, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.కృష్ణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శేషగిరి, జిల్లా నాయకుడు ఎ.సత్యశ్రీనివాస్, జి.నిర్మల, పి.శ్రీనివాసరావు, ఈశ్వరరావు, వెంకటరావు, నాగరాజు, వివిధ మండలాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.