Uttarakhand issue
-
బీజేపీకి భంగపాటు!
దుస్సాహసానికి దిగితే భంగపాటు తప్పదని ఉత్తరాఖండ్ అనుభవంతో బీజేపీ నేతలకు అర్ధమై ఉండాలి. ఆ రాష్ట్రంలో పాలకపక్షంగా ఉన్న కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని ఆసరా చేసుకుని రాష్ట్రపతి పాలన విధించడం తప్పేనని వారు ఆలస్యంగానైనా గ్రహించి ఉండాలి. మరో ఏడెనిమిది నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతుండగా...కేంద్రంలో తమ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తుండగా... పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా ఇలాంటి పనికి తెగబడటం రాజ కీయంగా ఆత్మహత్యా సదృశమని వారు తెలుసుకోలేకపోయారు. రాష్ట్రపతి పాలనను తాత్కాలికంగా నిలిపి ఉంచి 10న బలపరీక్ష నిర్వహించాలన్న తమ ఆదేశాలకు అనుగుణంగా జరిగిన ఓటింగ్‌లో చివరకు ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌దే విజయమని బుధవారం సర్వోన్నత న్యాయస్థానం లాంఛనంగా ప్రకటిం చింది. రాష్ట్రపతి పాలనను తొలగిస్తున్నట్టు కేంద్రం తెలియజేయడంతో రావత్ తిరిగి అధికారపగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించడంలో విజయం సాధించిన బీజేపీ... ఉత్తరా ఖండ్‌లోనూ ఆ మాదిరి ప్రయత్నం చేయబోయి బోర్లాపడింది. విపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలను చికాకు పరచడం, వీలైతే వాటిని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడంమన దేశంలో కొత్తగాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దాదాపు వందసార్లు అలాంటి పనికి పాల్పడ్డాయి. అందులో సగానికిపైగా పాపాలు కాంగ్రెస్‌వే. రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని ప్రయోగించి తమకు ఇష్టంలేని ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం సర్వసాధారణ మైంది. విపక్షంలో ఉండగా ప్రజాస్వామిక విలువల గురించి, ఫెడరలిజం గురించి మాట్లాడటం...అధికారం చేపట్టగానే అంతా మరిచి అప్రజాస్వామిక పోకడలకు పోవడం అందరికీ అలవాటుగా మారింది. ఒక ప్రభుత్వానికి బలం ఉన్నదో లేదో తేలవలసింది చట్టసభల్లో తప్ప రాజ్భవన్లలో కాదని ఎస్ ఆర్ బొమ్మైకేసులో 22 ఏళ్లక్రితం సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చాక ఈ ధోరణికి కాస్త అడ్డుకట్ట పడిన మాట వాస్తవమే అయినా అది పూర్తిగా ఆగిపోలేదు. కేంద్రంలో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ‘సహకార ఫెడరలిజం’ గురించి మాట్లాడారు గనుక అరుణా చల్, ఉత్తరాఖండ్ ఉదంతాలు సంభవిస్తాయని ఎవరూ ఊహించలేదు. పదహారేళ్లక్రితం ఉనికిలోకి వచ్చిన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆదినుంచీ సమస్యలతో సతమతమవుతున్నది. ఉత్తరప్రదేశ్‌నుంచి విడివడి రాష్ట్రం ఏర్పడినప్పుడు స్థాని కులు ఎంతో సంబరపడ్డారు. ఇక తమ ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఏర్పడిందను కున్నారు. భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడ వ్యవసాయం అంతంతమాత్రం. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన కారణంగా పరిశ్రమలు అభివృద్ధి చెందిన మాట వాస్తవమే అయినా నిరుద్యోగం పూర్తిగా రూపుమాసి పోలేదు. రాష్ట్రంలో మద్య పానం, మాదకద్రవ్యాల వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని అంటారు. పర్యావరణపరంగా ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నా ముడుపులు తీసుకుని మైనింగ్ లెసైన్స్లివ్వడం ఉత్తరాఖండ్‌లో రివాజు. రాష్ట్రాన్ని ఇన్ని సమస్యలు చుట్టుముట్టి ఉండగా అక్కడ అధికార కుమ్ములాటల్లో మునిగితేలడం ప్రజల పట్ల అపచారం చేయడమేనని ఇరు పార్టీలూ తెలుసుకోలేకపోయాయి. నిజానికి ఇది ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ పరిస్థితి కాదు. పుట్టినప్పటినుంచీ ఆ రాష్ట్రం ఈ మాదిరి అధికార జూదంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. రాజకీయ అస్థిరతకు చిరునామాగా మారింది.ఏ ముఖ్యమంత్రీ అక్కడ అయిదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉండలేకపోయారు. ఈ పదహారేళ్ల కాలంలో అక్కడ 8మంది సీఎంలు మారారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో సుల భంగానే అర్ధమవుతుంది. తమది విలక్షణమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ...అందుకు తగినట్టుగా ప్రవర్తించి ఉంటే వేరుగా ఉండేది. వచ్చే ఏడాది జనవరిలో ఆ రాష్ట్రంలో ఎలాగూ ఎన్నికలు జరుగుతాయి. బహుశా ప్రస్తుత పరిణామాలవల్ల జనంలో కలిగిన సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి రావత్ సర్కారు అంతకన్నా ముందుగానే ఎన్నికలకు వెళ్లొచ్చు. సమస్యాత్మక రాష్ట్రంలో కాస్తంత పరిణతితో వ్యవహరిద్దామని బీజేపీ అనుకుని ఉంటే...రాష్ట్రాన్ని చక్కదిద్దడం, రాజకీయ సుస్థిరత నెలకొల్పడం తమవల్లనే సాధ్యమని ప్రజలను ఒప్పించగలిగితే అది ఆ పార్టీకి లాభించేది. అందుకు బదులుగా అచ్చం కాంగ్రెస్ చేసినట్టుగానే ప్రభుత్వానికి ఎసరు పెట్టాలని చూడటం, అందులో అనుభవం లేక చేతులు కాల్చుకోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీలో బలపరీక్ష సజావుగా సాగినా రెండు నెలలుగా అక్కడ చోటుచేసుకున్న పరిణామాలు అందరికీ కలవరం కలిగిస్తాయి. అవినీతిపరుల, నేరగాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికి ఉపయోగపడుతున్న ‘స్టింగ్ ఆపరేషన్’ ఉత్తరాఖండ్‌లో రాజకీయపుటెత్తుల్లో పావుగా మారింది. ఏ విధంగానైనా హరీశ్ రావత్‌ను భ్రష్టుపట్టించి, తమ చర్య సరైనదేనని నిరూపించు కోవాలన్న తపన బీజేపీ నేతల్లో పెరిగిపోయింది. అందులో వెల్లడైన ఉదంతాలపై ఆగమేఘాలపై సీబీఐ దర్యాప్తు కూడా మొదలైంది. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ఇలాంటి ప్రయత్నమే చేసి అడ్డంగా దొరికిపోవడంతోపాటు... ఆంధ్రప్రదేశ్‌లో కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో అధికారం పంచుకోవడం బీజేపీ అగ్రనేతలకు తప్పుగా అనిపించడం లేదు. కానీ అదే తరహా కేసులో చిక్కుకున్న రావత్‌పై మాత్రం సీబీఐ దర్యాప్తునకు ఉత్సాహం చూపడం ద్వంద్వ ప్రమాణాలు పాటించడమేనని వారికి తట్టకపోవడం ఆశ్చర్యకరం. ఏదేమైనా ఉత్తరాఖండ్ అనుభవం బీజేపీకి మాత్రమే కాదు...భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి రాదల్చుకున్న పార్టీలన్నిటికీ హెచ్చరికే. -
ప్రధానిపై విమర్శలు.. సుష్మపై ప్రశంసలు!
కొద్ది నిమిషాల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఆ తర్వాత కొద్ది సేపటికే ఆయన మంత్రివర్గంలోని సభ్యురాలు సుష్మా స్వరాజ్‌పై మాత్రం ప్రశంసలు కురిపించారు. ఈ రెండూ కూడా ట్వీట్ల రూపంలో కొద్ది నిమిషాల తేడాలో రావడం గమనార్హం. సుష్మాస్వరాజ్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఉత్తరాఖండ్ విషయంలో ప్రధానిపై మండిపడిన కాసేపటికే ఆయనీ మాట చెప్పారు. నైజీరియాలో సముద్రపు దొంగల చెరలో ఉన్న భారతీయ ఇంజనీర్ సంతోష్ భరద్వాజ్‌ను విడిపించే విషయంలోను, ఆ సంగతిని ఆయన భార్యకు చెప్పడంలోను విదేశీ వ్యవహారాల మంత్రిగా సుష్మ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారన్నారు. సుష్మా స్వరాజ్‌కు తాను ధన్యవాదాలు చెబుతున్నానని, విదేశాల్లో ఉన్న భారతీయులను కాపాడేందుకు ఆమె చాలా బాగా పనిచేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ కూడా అన్నారు. ఒక మంత్రిగా ఆమె స్పందన అద్భుతంగా ఉందని బిజూ జనతాదళ్ సభ్యుడు బైజయంత్ పాండా చెప్పారు. Modi Govt shud apologise to the nation for acting in unconstitutional and undemocratic manner in Uttarakhand — Arvind Kejriwal (@ArvindKejriwal) 11 May 2016 Sushma ji is doing excellent work https://t.co/7SE43oboBe — Arvind Kejriwal (@ArvindKejriwal) 11 May 2016 -
'కాంగ్రెస్ డిమాండ్ తప్పుకాదు.. కరెక్టే'
న్యూఢిల్లీ: అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీపై విమర్శలకు దిగే శివసేన పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని వెనుకేసుకొచ్చింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధింపు అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ సరైనదేనని శివసేన నేత సంజయ్ రావత్ అన్నారు. ఈ విషయం నుంచి కేంద్రం పక్కకు జరిగితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు. 'పార్లమెంటులో ఒక అంశాన్ని చర్చకు అంగీకరించకుండా పార్లమెంటు సమావేశాలను ముందుకు నడిపించాలని చూస్తే ప్రజలు మీకు మద్దతు ఇవ్వరు. మీరు చెప్పే కారణాన్ని మెచ్చుకోరు. శివసేన కావచ్చు.. కాంగ్రెస్ కావచ్చు. ఒక ముఖ్యమంత్రికి తన మెజార్టీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. కానీ, ఉత్తరాఖండ్‌లో అలా జరగలేదు. అందుకే ఈ విషయంపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇది సరైనదే' అని ఆయన సోమవారం ఓ మీడియాతో అన్నారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయవ్యవస్థ పరిధికి వెళ్లిందికదా అని ప్రశ్నించగా.. అది కోర్టు విచారణలో ఉందేమోకానీ.. అంతకంటే ముందుకు రాజకీయ పరంగా ఎంతో ముఖ్యమైన అంశం అని ఆయన బదులిచ్చారు. -
ఉత్తరాఖండ్ సంక్షోభంపై రాజ్యసభలో రగడ
ఢిల్లీ: ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం వ్యవహారంపై రాజ్యసభ దద్దరిల్లింది. సోమవారం మలివిడత పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాక ఉత్తరాఖండ్ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టగా, ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లో సభకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ చైర్మన్ పోడియంను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ కాంగ్రెస్ సభ్యులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు శాంతించలేదు. దీంతో గందరగోళ పరిస్థితుల మధ్య సభను రెండుసార్లు వాయిదా వేశారు. -
ఇటు కత్తులు, అటు కసరత్తులు, పైన ఎండ!
న్యూఢిల్లీ: భానుడి భగభగలకు రాజకీయ సెగలు తోడైతే దేశం ఉక్కపోతతో అల్లాడిపోదూ! సోమవారం నుంచి సరిగ్గా అలాంటి పరిస్థితే నెలకొనబోతోంది... పార్లమెంట్ ఉభయ సభల్లో సమావేశాల పునఃప్రారంభంతో! బడ్జెట్ సెషన్స్ లో భాగంగా రెండో దశ సమావేశాలు సోమవారం(ఏప్రిల్ 25) నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఎక్కుపెట్టేందుకు ప్రతిపక్షాలు సమస్యలనే కత్తులను నూరుతుంటే, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు అమితమైన కసరత్తుచేస్తోంది పాలకపక్షం. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుపుమేరకు ఆదివారం అఖిలపక్షం భేటీకానుంది. మరోవైపు కీలక సమస్యలపై చర్చ చేపట్టాలంటూ పలువురు విపక్ష సభ్యులు ఇప్పటికే స్పీకర్, చైర్మన్ లకు నోటీసులు అందచేశారు. వాటిలో అధిక శాతం ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నెలకొన్న కరువుకు సంబంధించినవే కావటం.. ఈ దఫా సమావేశాలు ఎలా జరగబోతున్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న ఉత్తరాఖండ్ పరిణామాలపై చర్చను చేపట్టాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులామ్ నబీ ఆజాద్, ఉపనేత ఆనంద్ శర్మలు చైర్మన్ కు శుక్రవారమే నోటీసులు ఇచ్చారు. 267వ నిబంధన ప్రకారం చర్చకు అనుమతించాలని కోరినట్లు వారు తెలిపారు. మహారాష్ట్ర సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనావేయడంలో, ఉపశమన చర్యలు తీసుకోవడంలో ఎన్డీఏ సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ మరికొందరు విపక్ష ఎంపీలు కరువుపై చర్చను కోరుతున్నారు. అయితే బడ్జెట్ సంబంధిత బిల్లుపై చర్చకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటనతో ప్రభుత్వ తీరు ఎలా ఉండబోతోందో తెలుస్తోంది. రెండు రోజుల కిందట హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన కీలకమైన బిల్లులకు అడ్డుపడుతోందని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాగా, ఆదివారంనాటి అఖిలపక్ష భేటీ, సోమవారం ఉదయం జరిగే బీఏసీ సమావేశాల్లో సభ జరగబోయే తీరుతెన్నులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.