ఇటు కత్తులు, అటు కసరత్తులు, పైన ఎండ! | From 25th April parliament sessions will begin, Uttarakhand, drought are key issues | Sakshi
Sakshi News home page

ఇటు కత్తులు, అటు కసరత్తులు, పైన ఎండ!

Published Sat, Apr 23 2016 11:36 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

ఇటు కత్తులు, అటు కసరత్తులు, పైన ఎండ!

ఇటు కత్తులు, అటు కసరత్తులు, పైన ఎండ!

న్యూఢిల్లీ: భానుడి భగభగలకు రాజకీయ సెగలు తోడైతే దేశం ఉక్కపోతతో అల్లాడిపోదూ! సోమవారం నుంచి సరిగ్గా అలాంటి  పరిస్థితే నెలకొనబోతోంది... పార్లమెంట్ ఉభయ సభల్లో సమావేశాల పునఃప్రారంభంతో! బడ్జెట్ సెషన్స్ లో భాగంగా రెండో దశ సమావేశాలు సోమవారం(ఏప్రిల్ 25) నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఎక్కుపెట్టేందుకు ప్రతిపక్షాలు సమస్యలనే కత్తులను నూరుతుంటే, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు అమితమైన కసరత్తుచేస్తోంది పాలకపక్షం.

లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పిలుపుమేరకు ఆదివారం అఖిలపక్షం భేటీకానుంది. మరోవైపు కీలక సమస్యలపై చర్చ చేపట్టాలంటూ పలువురు విపక్ష సభ్యులు ఇప్పటికే స్పీకర్, చైర్మన్ లకు నోటీసులు అందచేశారు. వాటిలో అధిక శాతం ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం, మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నెలకొన్న కరువుకు సంబంధించినవే కావటం.. ఈ దఫా సమావేశాలు ఎలా జరగబోతున్నాయనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.

రోజుకో మలుపు తిరుగుతున్న ఉత్తరాఖండ్ పరిణామాలపై చర్చను చేపట్టాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులామ్ నబీ ఆజాద్, ఉపనేత ఆనంద్ శర్మలు చైర్మన్ కు శుక్రవారమే నోటీసులు ఇచ్చారు. 267వ నిబంధన ప్రకారం చర్చకు అనుమతించాలని కోరినట్లు వారు తెలిపారు. మహారాష్ట్ర సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను అంచనావేయడంలో, ఉపశమన చర్యలు తీసుకోవడంలో ఎన్డీఏ సర్కారు విఫలమైందని ఆరోపిస్తూ మరికొందరు విపక్ష ఎంపీలు కరువుపై చర్చను కోరుతున్నారు.

అయితే బడ్జెట్ సంబంధిత బిల్లుపై చర్చకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తామన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటనతో ప్రభుత్వ తీరు ఎలా ఉండబోతోందో తెలుస్తోంది. రెండు రోజుల కిందట హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన కీలకమైన బిల్లులకు అడ్డుపడుతోందని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాగా, ఆదివారంనాటి అఖిలపక్ష భేటీ, సోమవారం ఉదయం జరిగే బీఏసీ సమావేశాల్లో సభ జరగబోయే తీరుతెన్నులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement