బీజేపీకి భంగపాటు!
దుస్సాహసానికి దిగితే భంగపాటు తప్పదని ఉత్తరాఖండ్ అనుభవంతో బీజేపీ నేతలకు అర్ధమై ఉండాలి. ఆ రాష్ట్రంలో పాలకపక్షంగా ఉన్న కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత సంక్షోభాన్ని ఆసరా చేసుకుని రాష్ట్రపతి పాలన విధించడం తప్పేనని వారు ఆలస్యంగానైనా గ్రహించి ఉండాలి. మరో ఏడెనిమిది నెలల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతుండగా...కేంద్రంలో తమ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారు అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తుండగా... పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా ఇలాంటి పనికి తెగబడటం రాజ కీయంగా ఆత్మహత్యా సదృశమని వారు తెలుసుకోలేకపోయారు.
రాష్ట్రపతి పాలనను తాత్కాలికంగా నిలిపి ఉంచి 10న బలపరీక్ష నిర్వహించాలన్న తమ ఆదేశాలకు అనుగుణంగా జరిగిన ఓటింగ్‌లో చివరకు ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌దే విజయమని బుధవారం సర్వోన్నత న్యాయస్థానం లాంఛనంగా ప్రకటిం చింది. రాష్ట్రపతి పాలనను తొలగిస్తున్నట్టు కేంద్రం తెలియజేయడంతో రావత్ తిరిగి అధికారపగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పించడంలో విజయం సాధించిన బీజేపీ... ఉత్తరా ఖండ్‌లోనూ ఆ మాదిరి ప్రయత్నం చేయబోయి బోర్లాపడింది.
విపక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలను చికాకు పరచడం, వీలైతే వాటిని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడంమన దేశంలో కొత్తగాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దాదాపు వందసార్లు అలాంటి పనికి పాల్పడ్డాయి. అందులో సగానికిపైగా పాపాలు కాంగ్రెస్‌వే. రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని ప్రయోగించి తమకు ఇష్టంలేని ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం సర్వసాధారణ మైంది. విపక్షంలో ఉండగా ప్రజాస్వామిక విలువల గురించి, ఫెడరలిజం గురించి మాట్లాడటం...అధికారం చేపట్టగానే అంతా మరిచి అప్రజాస్వామిక పోకడలకు పోవడం అందరికీ అలవాటుగా మారింది.
ఒక ప్రభుత్వానికి బలం ఉన్నదో లేదో తేలవలసింది చట్టసభల్లో తప్ప రాజ్‌భవన్‌లలో కాదని ఎస్ ఆర్ బొమ్మైకేసులో 22 ఏళ్లక్రితం సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చాక ఈ ధోరణికి కాస్త అడ్డుకట్ట పడిన మాట వాస్తవమే అయినా అది పూర్తిగా ఆగిపోలేదు. కేంద్రంలో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ‘సహకార ఫెడరలిజం’ గురించి మాట్లాడారు గనుక అరుణా చల్, ఉత్తరాఖండ్ ఉదంతాలు సంభవిస్తాయని ఎవరూ ఊహించలేదు.
పదహారేళ్లక్రితం ఉనికిలోకి వచ్చిన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆదినుంచీ సమస్యలతో సతమతమవుతున్నది. ఉత్తరప్రదేశ్‌నుంచి విడివడి రాష్ట్రం ఏర్పడినప్పుడు స్థాని కులు ఎంతో సంబరపడ్డారు. ఇక తమ ప్రాంతం అభివృద్ధికి అవకాశం ఏర్పడిందను కున్నారు. భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడ వ్యవసాయం అంతంతమాత్రం. ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన కారణంగా పరిశ్రమలు అభివృద్ధి చెందిన మాట వాస్తవమే అయినా నిరుద్యోగం పూర్తిగా రూపుమాసి పోలేదు. రాష్ట్రంలో మద్య పానం, మాదకద్రవ్యాల వినియోగం ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని అంటారు. పర్యావరణపరంగా ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నా ముడుపులు తీసుకుని మైనింగ్ లెసైన్స్‌లివ్వడం ఉత్తరాఖండ్‌లో రివాజు. రాష్ట్రాన్ని ఇన్ని సమస్యలు చుట్టుముట్టి ఉండగా అక్కడ అధికార కుమ్ములాటల్లో మునిగితేలడం ప్రజల పట్ల అపచారం చేయడమేనని ఇరు పార్టీలూ తెలుసుకోలేకపోయాయి.
నిజానికి ఇది ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ పరిస్థితి కాదు. పుట్టినప్పటినుంచీ ఆ రాష్ట్రం ఈ మాదిరి అధికార జూదంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. రాజకీయ అస్థిరతకు చిరునామాగా మారింది.ఏ ముఖ్యమంత్రీ అక్కడ అయిదేళ్ల పూర్తి కాలం అధికారంలో ఉండలేకపోయారు. ఈ పదహారేళ్ల కాలంలో అక్కడ 8మంది సీఎంలు మారారంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో సుల భంగానే అర్ధమవుతుంది.
తమది విలక్షణమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ...అందుకు తగినట్టుగా ప్రవర్తించి ఉంటే వేరుగా ఉండేది. వచ్చే ఏడాది జనవరిలో ఆ రాష్ట్రంలో ఎలాగూ ఎన్నికలు జరుగుతాయి. బహుశా ప్రస్తుత పరిణామాలవల్ల జనంలో కలిగిన సానుభూతిని సొమ్ము చేసుకోవడానికి రావత్ సర్కారు అంతకన్నా ముందుగానే ఎన్నికలకు వెళ్లొచ్చు. సమస్యాత్మక రాష్ట్రంలో కాస్తంత పరిణతితో వ్యవహరిద్దామని బీజేపీ అనుకుని ఉంటే...రాష్ట్రాన్ని చక్కదిద్దడం, రాజకీయ సుస్థిరత నెలకొల్పడం తమవల్లనే సాధ్యమని ప్రజలను ఒప్పించగలిగితే అది ఆ పార్టీకి లాభించేది. అందుకు బదులుగా అచ్చం కాంగ్రెస్ చేసినట్టుగానే ప్రభుత్వానికి ఎసరు పెట్టాలని చూడటం, అందులో అనుభవం లేక చేతులు కాల్చుకోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ.
సుప్రీంకోర్టు ఆదేశాలతో అసెంబ్లీలో బలపరీక్ష సజావుగా సాగినా రెండు నెలలుగా అక్కడ చోటుచేసుకున్న పరిణామాలు అందరికీ కలవరం కలిగిస్తాయి. అవినీతిపరుల, నేరగాళ్ల నిజ స్వరూపాన్ని బయటపెట్టడానికి ఉపయోగపడుతున్న ‘స్టింగ్ ఆపరేషన్’ ఉత్తరాఖండ్‌లో రాజకీయపుటెత్తుల్లో పావుగా మారింది. ఏ విధంగానైనా హరీశ్ రావత్‌ను భ్రష్టుపట్టించి, తమ చర్య సరైనదేనని నిరూపించు కోవాలన్న తపన బీజేపీ నేతల్లో పెరిగిపోయింది. అందులో వెల్లడైన ఉదంతాలపై ఆగమేఘాలపై సీబీఐ దర్యాప్తు కూడా మొదలైంది.
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ఇలాంటి ప్రయత్నమే చేసి అడ్డంగా దొరికిపోవడంతోపాటు... ఆంధ్రప్రదేశ్‌లో కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో అధికారం పంచుకోవడం బీజేపీ అగ్రనేతలకు తప్పుగా అనిపించడం లేదు. కానీ అదే తరహా కేసులో చిక్కుకున్న రావత్‌పై మాత్రం సీబీఐ దర్యాప్తునకు ఉత్సాహం చూపడం ద్వంద్వ ప్రమాణాలు పాటించడమేనని వారికి తట్టకపోవడం ఆశ్చర్యకరం. ఏదేమైనా ఉత్తరాఖండ్ అనుభవం బీజేపీకి మాత్రమే కాదు...భవిష్యత్తులో కేంద్రంలో అధికారంలోకి రాదల్చుకున్న పార్టీలన్నిటికీ హెచ్చరికే.