Uttarakhand Rain
-
ఉత్తరాఖండ్లో చిక్కుకున్న యాత్రికులు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొడియాల వద్ద 1500 వాహనాలు నిలిచిపోగా సుమారు 20 వేల మంది రోడ్ల మీద చిక్కుకుపోయారు. సుమారు 40 కి.మీ మేర యాత్రికులు, స్థానికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు దారిపొడవునా ఆవస్థలు పడుతున్నారు. కొడియాల్ వద్ద 40 కి.మీ. మేర సుమారు 1500 వాహనాలు నిలిచిపోయాయి. అందులో కనీసం 20 వేల మంది జనం ఎటూ మరలలేక అక్కడే నిలిచిపోయారు. రిషికేష్ యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. వీరిలో ఏపీ, బెంగుళూరుకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా అక్కడ చిక్కుకున్నట్లు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈరోజు కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావారణ శాఖ వెల్లడిస్తూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మమ్మల్ని ఎలాగైనా బయట పడేయమని విపత్తులో చిక్కుకున్న యాత్రికులంతా ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులని అభ్యర్థిస్తున్నారు. ఇది కూడా చదవండి: చెన్నైలో నిత్య పెళ్లికొడుకు కల్యాణసుందరం అరెస్ట్ -
మూసుకుపోయిన 135 రోడ్లు!
డెహ్రాడూన్: విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. దాదాపు 135 రోడ్లు బ్లాక్ అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ముఖ్యంగా పలు యాత్రా మార్గాలు మూసుకుపోయిన పరిస్థితి తలెత్తింది. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఉత్తరకాశీలో 34 రోడ్లు, తెహ్రీలో 23, పౌడీలో 21, డెహ్రాడూన్ లో 17, చమోలీ 15, బాగేషేర్లో 8, చంపావత్, అల్మోరాలో ఆరు, హరిద్వార్ లో నాలుగు, నైనిటాల్ 1 రహదారి దాదాపు ధ్వంసమయ్యాయి. పిందర్, కాళీ, మందాకిని, భగీరథీ, అలకనంద, గంగా నదులు ఉధృతంగా ప్రవాహిస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. యుమునోత్రి, గంగోత్రి, భద్రీనాథ్, కేదర్ నాథ్ వంటి చార్ ధామ్ యాత్రలకు దాదాపు మార్గాలు మూసుకుపోయినట్లయింది.