V. Laxman reddy
-
నేడు సీమాంధ్ర బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరికి నిరసనగా ఈ నెల 14వతేదీన సీమాంధ్రలో బంద్ పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. గురువారం లోక్సభలో సీమాంధ్ర ఎంపీలపై తెలంగాణవాదులు దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించింది. సీమాంధ్ర ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విభజన అంశంపై బహిరంగ ప్రకటన చేయకుండా ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్న సోనియాగాంధీ, రాహుల్గాంధీ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీలను సస్పెండ్ చేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే బిల్లును ఆమోదింపజేసేందుకు చేస్తున్న కుటిల యత్నాలను సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. బిల్లును ఓడించేందుకు ఇతర పార్టీల మద్దతు తీసుకోవాలని సూచించారు. 15 రోజుల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతున్న తరుణంలో రాజ్యాంగ నిబంధనల కు విరుద్ధంగా సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టామని చెప్పడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్, రైల్వే బడ్జెట్ల ఆమోదం కోసమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే సీమాంధ్రులంతా కలిసి కాంగ్రెస్ను భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. -
అడ్డగోలు విభజనను ప్రతిఘటించండి: లక్ష్మణ్ రెడ్డి
జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పిలుపు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న రాష్ట్ర అడ్డగోలు విభజనను తెలుగు జాతి ఏకమై ప్రతిఘటించాలని జస్టిస్ వి.లక్ష్మణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా సచివాలయం సమీపంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ క్లిష్టసమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఏకం కావాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థశక్తులు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. శ్రీకృష్ణ కమిటీ ఆరవ అప్షన్లో చాలా మంచి విషయాలు ఉన్నాయని, అయితే ఆ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోవటంలేదని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి నిర్వహించే కమిటీ సమావేశాలను రాజకీయ నాయకులు బహిష్కరించాలని సూచించారు. వేదిక కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యతకు కృషి చేస్తామని అన్ని పార్టీలు ప్రతిజ్ఞ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఎన్.తులసి రెడ్డి, ఏపీ ఎన్జీవో మాజీ కార్యదర్శి టి.సత్యనారాయణ, వైఎస్సార్సీపీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధు, పుత్తా శివశంకర్ రెడ్డి, మహా సభ నేతలు ఎన్.చక్రవర్తి, కె.శ్రీనివాస్ రెడ్డి, సి.రామజోగయ్య తదితరులు పాల్గొన్నారు.