జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పిలుపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం చేయాలనుకుంటున్న రాష్ట్ర అడ్డగోలు విభజనను తెలుగు జాతి ఏకమై ప్రతిఘటించాలని జస్టిస్ వి.లక్ష్మణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా సచివాలయం సమీపంలోని తెలుగు తల్లి విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ క్లిష్టసమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఏకం కావాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థశక్తులు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు.
శ్రీకృష్ణ కమిటీ ఆరవ అప్షన్‌లో చాలా మంచి విషయాలు ఉన్నాయని, అయితే ఆ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోవటంలేదని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి నిర్వహించే కమిటీ సమావేశాలను రాజకీయ నాయకులు బహిష్కరించాలని సూచించారు. వేదిక కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యతకు కృషి చేస్తామని అన్ని పార్టీలు ప్రతిజ్ఞ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత ఎన్.తులసి రెడ్డి, ఏపీ ఎన్‌జీవో మాజీ కార్యదర్శి టి.సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధు, పుత్తా శివశంకర్ రెడ్డి, మహా సభ నేతలు ఎన్.చక్రవర్తి, కె.శ్రీనివాస్ రెడ్డి, సి.రామజోగయ్య తదితరులు పాల్గొన్నారు.
అడ్డగోలు విభజనను ప్రతిఘటించండి: లక్ష్మణ్ రెడ్డి
Published Sat, Nov 2 2013 3:02 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement