
నేడు సీమాంధ్ర బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరికి నిరసనగా ఈ నెల 14వతేదీన సీమాంధ్రలో బంద్ పాటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. గురువారం లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీలపై తెలంగాణవాదులు దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించింది. సీమాంధ్ర ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
విభజన అంశంపై బహిరంగ ప్రకటన చేయకుండా ద్వంద్వ వైఖరి అనుసరిస్తున్న సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీలను సస్పెండ్ చేసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే బిల్లును ఆమోదింపజేసేందుకు చేస్తున్న కుటిల యత్నాలను సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. బిల్లును ఓడించేందుకు ఇతర పార్టీల మద్దతు తీసుకోవాలని సూచించారు. 15 రోజుల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతున్న తరుణంలో రాజ్యాంగ నిబంధనల కు విరుద్ధంగా సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టామని చెప్పడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్, రైల్వే బడ్జెట్‌ల ఆమోదం కోసమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే సీమాంధ్రులంతా కలిసి కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు.