12.15 లక్షల మందికి ఎంఆర్ వ్యాక్సిన్లు
–కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ): జిల్లాలో 12.15 లక్షల మందికి రుబెల్లా, మీజిల్స్ (ఎంఆర్) వ్యాక్సిన్స్ వేసేందుకు రంగం సిద్ధం చేశామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. రాజమహేంద్రవరంలోని హోటల్ లాహాస్పిన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుక్రవారం మాట్లాడుతూ జిల్లాలో తొమ్మిది నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు 12 లక్షల 15 వేల మంది ఉన్నారన్నారు. రాజమహేంద్రవరం, కాకినాడతో పాటు ఏడు మున్సిపాల్టీల్లో ఆగస్టు ఒకటి నుంచి ఐదో తేదీ వరకు వ్యాక్సిన్లు వేస్తారని, సెప్టెంబర్ ఎనిమిదో తేదీ వరకు జిల్లా అంతటా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 8 లక్షల 15 వేల 327 మంది, నగర పట్టణ ప్రాంతాల్లో 3 లక్షల తొమ్మిదివేల 543 మంది, ఏజన్సీల్లో లక్షా మంది పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. దీన్ని వేసేందుకు జిల్లావ్యాప్తంగా 5 వేల 500 మంది అంగన్వాడీ సిబ్బంది, 4 వేల 600 మంది ఆశావర్కర్లు, 3 వేల 500 మంది సూపర్వైజర్స్ను నియమించామన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జ్వరం వచ్చినా కంగారు పడనవసరంలేదని, దీనిపై వీఆర్వోలు, వీఆర్ఏలు, గ్రామ కార్యదర్శులు, కమ్యూనిటీ హెల్త్వర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాక్సిన్ను అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు, జిల్లా ఆరోగ్యశాఖాధికారి కె.చంద్రయ్య, ఎం.మల్లిక, డాక్టర్ పి.కోమల పాల్గొన్నారు.
ప్రణాళికా బద్ధంగా లబ్ధిదారుల ఎంపిక
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల సమీక్షలో కలెక్టర్
కాకినాడ సిటీ : వివిధ కార్పొరేషన్లకు సంబంధించి 2017–18 సంవత్సారానికి ఉపాధి యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఆగస్టు ఒకటి నుంచి 11వ తేదీ వరకు బ్యాంకుల బ్రాంచీల వారీగా ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కోర్టు హాలులో బ్యాంకర్లు, సంక్షేమ కార్పోరేషన్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2016–17 లక్ష్యాల ప్రగతి, 2017–18 సంవత్సర లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూల నిర్వహణ, ప్రణాళిక అంశాలపై సమీక్షించారు. సంక్షేమ కార్పొరేషన్ రుణాల పంపిణీలో ప్రస్తుతం జిల్లా 6వ స్థానంలో ఉందని, ఈ నెలాఖరులోపు మరిన్ని యూనిట్లకు రుణాలు జారీ చేసి జిల్లాను 2వ స్ధానంలో నిలపాలని సూచించారు. ఈ ఎంపికలకు బ్రాంచి మేనేజర్లు గైరుహాజరైనా, సహకరించకపోయినా చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డేవిడ్రాజు, బీసీ కార్పోరేషన్ ఈడీ జ్యోతి, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.