చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పడు: జగన్
చిత్తూరు: కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్రానే కావాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. సమైక్యాంధ్ర అనే మాట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు మాత్రం వినపడటం లేదని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడూ నిజం చెప్పరని జగన్ వ్యాఖ్యానించారు. సమైక్య శంఖారావం - ఓదార్పు యాత్రను సోమవారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో చేపట్టారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో డ్రామాలాడుతున్నారని, 9 ఏళ్ల పాలనలో ఆయన తన హామీల్ని నిలబెట్టుకోలేదని విమర్శించారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని జగన్ పిలుపునిచ్చారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత పెరగాలన్నారు. ఉద్యమం బలంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగులను భయపెట్టి సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చారని చెప్పారు.
రాష్ట్రాన్నివిడగొట్టడానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కిరణ్ కుమ్మక్కయ్యారని జగన్ విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరూ చేయలేదన్నారు. 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దామని అన్నారు. సోనియా గాంధీ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ సోనియా గీసిన గీత దాటకుండా విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు.