వైఎస్సార్ వర్ధంతిని వాడవాడలా నిర్వహించాలి
హుజూర్నగర్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతిని సెప్టెంబర్ 2న వాడవాడలా ఘనంగా నిర్వహించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డి కోరారు. బుధవారం స్థానికంగా జరిగిన ఆ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతాలకతీతంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిం చి ప్రజల హృదయాల్లో దైవంలా నిలిచారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఫీజు రియింబర్స్‌మెంట్, పావలా వడ్డీ రుణాలు, గృహనిర్మాణాలు, ఆరోగ్యశ్రీ, 104 వంటి పథకాల ద్వారా అనేక మంది ప్రజలు లబ్ధిపొందుతున్నారని అన్నారు. ఆయన మరణాన్ని నేటికీ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో వైఎస్సార్ వర్ధంతిని నిర్వహించి, పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కస్తాల ముత్తయ్య, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి సుతారి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు జడ రామకృష్ణయాదవ్, మండల మహిళ అధ్యక్షురాలు పశ్య మల్లేశ్వరి, పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుంభం శివ పాల్గొన్నారు.