మహాప్రస్థానం స్ఫూర్తిగా..
♦ వైకుంఠధామ నిర్మాణం అనిర్వచనీయం
♦ అభివృద్ధి పనుల కంటే ఎంతో సంతృప్తి మిగిలింది
♦ హైదరాబాద్‌లోని మహా ప్రస్థానం
♦ స్ఫూర్తిగా ఏర్పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్ : తన రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టానని, నియోజకవర్గ పురోగతికి వందలాది కోట్లతో పలు అభివృద్ధి పనులను నిర్వహించానని, కానీ సిద్దిపేటలో అత్యాధునిక హంగులతో నిర్మించిన వైకుంఠథామ నిర్మాణం మాత్రం అనిర్వచనీయమైన తృప్తిని ఇచ్చిందని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సాయంత్రం సిద్దిపేటలో రూ. 2 కోట్లతో నిర్మించిన వైకుంఠధామాన్ని ఆయన సిద్దిపేట ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు హైదరాబాద్‌లోని మహాప్రస్థానాన్ని రాష్ట్ర కేబినేట్, జిల్లా కలెక్టర్లతో కలిసి సందర్శించడం జరిగిందన్నారు.
శ్మశాన వాటికల అర్థాన్ని మార్చి ఆహ్లదకర వాతావరణంలో నిర్మించిన మహాప్రస్థానం స్ఫూర్తిగా అనాడే సిద్దిపేటలో వైకుంఠధామం ఏర్పాటుకు ఆలోచన చేశానన్నారు. ఫినిక్స్ సంస్థ సహకారంతో రూ. 2 కోట్లతో సిద్దిపేటలో సేవభావంతో అధునాతన వసతులతో వైకుంఠధామాన్ని నిర్మించామన్నారు. ఈ నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో శ్మశాన వాటికల స్థితిగతులను మార్చే కొత్త ఒరవడికి సిద్దిపేట నాందిగా నిలిచిందన్నారు. ఫినిక్స్ సంస్థ పనుల నిర్వహణలో రాజీపడకుండా అత్యాధునికంగా నిర్మించారని వారికి భగవంతుని అశీస్సులు ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో మరో రెండు వైకుంఠధామాలను సిద్దిపేటలో నిర్మించడమే కాకుండా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో నిర్మాణానికి ఫినిక్స్ సంస్థతో కృషి చేస్తామన్నారు.
స్మృతి వనం..
హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కనిపించని కొత్త ఒరవడిని సిద్దిపేట వైకుంఠధామంలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సిద్దిపేట పరిసరా ప్రాంతాలకు చెందిన ప్రజల్లోని తమ ఆత్మీయులు మృతి చెందినప్పుడు వారి సంస్మరణార్థం వైకుంఠధామంలోని స్మృతివనంలో మొక్క నాటే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. చనిపోయిన ఆత్మీయుల జ్ఞాపకార్థ ఒక మొక్కను వారి పేరిట నాటి సంరక్షణ బాధ్యతను చేపడతామన్నారు. అదే విధంగా బర్డ్గార్డెన్ను, పార్కును ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. అంతకు ముందు దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్, ఫినిక్స్ సంస్థ చైర్మన్ సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని హైదరాబాద్ మహప్రస్థానం తర్వాత అదే స్థాయిలో సిద్దిపేటలో వైకుంఠధామ నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు. ఇందుకు మంత్రి హరీశ్‌రావు కృషిని అభినందించారు. కార్యక్రమంలో జేసీ వెంకట్రాంరెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, జెడ్పీవైస్ చైర్మన్ సారయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు చిన్నా, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, పాలసాయిరాం, బర్లమల్లికార్జున్, మారెడ్డి రవీందర్‌రెడ్డి, శర్మ, మాణిక్యారెడ్డి, జాపశ్రీకాంత్రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.
సిద్దిపేట ఏరియా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సర్కార్ వైద్యంపై హరీశ్‌రావు ఆరా..
సిద్దిపేట జోన్ : పేద ప్రజలకు అందుతున్న సర్కార్ వైద్యం, ప్రభుత్వ వసతుల గూర్చి రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. మంగళవారం రాత్రి సిద్దిపేటలోని ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవల కోసం వచ్చిన బాధితులను, వారి కుటుంబ సభ్యులను వైద్య సేవల గూర్చి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యం సరిగా అందుతోందా.. వైద్యం కోసం సిబ్బంది డబ్బులు అడుగుతున్నారా.. వసతులు సరిగా ఉన్నాయా.. అంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం త్వరలో ప్రారంభించనున్న ఐసీయూ యూనిట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఐసీయూ యూనిట్ సిబ్బంది శిక్షణ విషయం, సిద్దిపేట ప్రాంత వాసుల కోసం డయాలసిస్ యూనిట్ ఏర్పాటు, సీటీ స్కాన్, డెంగీ బాధితులకు రక్త కణాలను అందించే ప్లేట్లెట్స్ సెంటర్ ఏర్పాటు తదితర విషయాలను వైద్యశాఖా మంత్రి లకా్ష్మరెడ్డితో ఫోన్లో మాట్లాడి పరిష్కారించారు.
సిద్దిపేట ముంగిట్లో కార్పొరేట్ వైద్యం
సిద్దిపేట ప్రాంత పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో రూ. 1.25 కోట్లతో ఐసీయూ యూ నిట్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నా రు. ఈ నెల 17న మంత్రి లకా్ష్మరెడ్డితో కలిసి ఐసీయూ యూనిట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు అదే విధంగా డెంగీ బాధితులకు రక్షణగా నిలిచే ప్లేట్లెట్స్ సపరేటర్ కేంద్రాన్ని, కిడ్నీ వ్యాధి గ్రస్తుల కోసం డయలసిస్ యూనిట్, సీటీ స్కాన్ సెంటర్‌ను, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల కోసం ఏఆర్టీ కేంద్రాన్ని, సిద్దిపేట ఆసుపత్రికి వచ్చే వారికి, పట్టణంలోని అభాగ్యుల కోసం ఏరియా ఆసుపత్రిలో రూ. 1.25 కోట్లతో నైట్ షెల్టర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. అంతకు ముందు మంత్రి కోమటి చెరువు అధునీకరణ పనులను పరిశీలించారు.