జిల్లా కార్యాలయాల పనులు ముమ్మరం
తాత్కాలిక భవనాల్లో కలెక్టర్ చాంబర్, గోడల నిర్మాణం
మహబూబాబాద్ : మానుకోట జిల్లా కార్యాలయాల పనులు తాత్కాలిక భవనాల్లో ముమ్మరంగా సాగుతున్నాయి. జేసీ, ఇతర అధికారులు తాత్కాలిక భవనాలను ఇప్పటికే ఎంపిక చేశారు. ఈమేరకు వాటిలో అవసరమైన పనులు చేపట్టారు. పట్టణ శివారు ఇందిరానగర్ కాలనీలోని వైటీసీ భవనాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కేటాయించారు. తొర్రూరురోడ్లోని ఐటీఐ భవనాన్ని ఎస్పీ కార్యాలయానికి, వెంకటేశ్వర్లబజార్‌లోని అద్దె భవనాన్ని ఎస్పీ క్యాంపు కార్యాలయానికి అప్పటించారు. ఏడీ సర్వే ల్యాండ్ రికార్డ్స్, జిల్లా కోశాధికారి కార్యాలయంగా సమీకృత సంక్షేమ వసతి సముదాయ భవనాన్ని, ఎంఈఓ కార్యాలయాన్ని డీఈఓ కార్యాలయంగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంగా, మానుకోటలో నిర్మాణంలో ఉన్న ఏపీడీ కార్యాలయాన్ని డ్వామా డీఆర్డీఏ పీడీ కార్యాలయంగా, సబ్ డీఎఫ్ఓ కార్యాలయాన్ని డీఎఫ్ఓ కార్యాలయంగా, ఎంపీడీఓ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ కార్యాలయంగా ఎంపిక చేశారు. ఇరిగేషన్ కార్యాలయంలో ఉన్నతాధికారి కార్యాలయం, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ కార్యాలయాల్లో ఉన్నతాధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఏరియా ఆస్పత్రిలో ఒక క్వార్టర్‌ను ఖాళీ చేయించి డీసీహెచ్ఎస్కు కేటాయించారు.
కలెక్టర్ చాంబర్ పనులు
కలెక్టరేట్ కోసం కేటాయించిన వైటీసీ భవనంలో 24 గదులు ఉన్నాయి. ఈ భవనంలో పనులు వేగంగా సాగుతున్నాయి. కింద ఉన్న రెండు గదులను కలెక్టర్ చాంబర్, దాని పక్కనున్న రెండు గదులను జేసీ చాంబర్‌గా నిర్ణయించి అవసరమైన గోడలు నిర్మిస్తున్నారు. దాని వెనుకనున్న రెండు గదుల్లో డీఆర్ఓ కార్యాలయం, మరో గదిని ఏఓ కార్యాలయానికి కేటాయించి పనులను వేగంగా చేస్తున్నారు. ఆ కార్యాలయానికి రోడ్డు పనులను కూడా చేపట్టారు. సోమవారం ఆ పనులను జేసీ పరిశీలించి ఏర్పాట్లపై ఆర్డీఓ జి.భాస్కర్‌రావుకు, ఆర్అండ్బీ ఈఈ పుల్లాదాస్కు పలు సూచనలు ఇచ్చారు.
ఇతర భవనాల్లో...
ఏరియా ఆస్పత్రిలో ఒక క్వార్టర్స్‌ను ఖాళీ చేయించి శుభ్రం చేశారు. ఫర్నీచర్ సమకూర్చుతున్నారు. మానుకోటలో ఏపీడీ కార్యాలయం భవన నిర్మాణంలో ఉండగా అదే భవనాన్ని డ్వామా, డీఆర్డీఏ పీడీ కార్యాలయంగా కేటాయించి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఎంఈఓ కార్యాలయానికి ఏకంగా డీఈఓ కార్యాలయంగా మానుకోట జిల్లాగా బోర్డు కూడా రాయించారు. ప్రస్తుతం ఉన్న ఫర్నీచర్తోనే డీఈఓ కార్యాలయం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. కార్యాలయం పక్కనే గదులను నిర్మించేందుకు ఆ విభాగం ఇంజీనీర్ పరిశీలించినప్పటికీ ఆలస్యమవుతున్నందున ఆ భవనంలోనే ఎలాంటి నిర్మాణాలు లేకుండా కార్యాలయాన్ని నిర్వహించేందుకు సిద్ధం చేశారు. ఆ తర్వాత ఎంఈఓ కార్యాలయాన్ని మరో చోటికి మార్చే ఆలోచన చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో గానీ ఇతర శాఖ కార్యాలయాల్లో పెద్దగా పనులు జరుగడం లేదు. ప్రస్తుతం ఐటీఐ భవనంలో నేటికి కళాశాల తరగతులు జరుగుతున్నాయి. ఎలాంటి పనులు చేపట్టలేదు.