ప్రజాస్వామ్యం అపహాస్యం
ఉపాధి పనుల కల్పనలో నిర్లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధ్వజం
వజ్రకరూరు : ప్రజలచేత ఎన్నిౖకెన సర్పంచులను డమ్మీలను చేస్తూ గ్రామసభల నిర్వహణను జన్మభూమి కమిటీలకు అప్పగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఉరవకొండ మండలం వ్యాసాపురంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటన్నింటినీ పక్కనపెట్టి కలెక్టర్ల సమావేశంలో ఊకదంపుడు ఉపన్యాసాలకు ప్రాధాన్యమిచ్చారని మండిపడ్డారు. రాజ్యాంగం ద్వారా సర్పంచులకు కల్పించిన అధికారాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా కాలరాస్తోందని విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకం నిధులు పుష్కలంగా ఉన్నా కూలీలకు పనులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. మరుగుదొడ్ల నిర్మాణ బిల్లులు, ఇ¯ŒSపుట్ సబ్సిడీ మంజూరులో తాత్సారం చేస్తోందన్నారు. టీడీపీ పాలనలో మహిళా సంఘాలు నిర్వీర్యమైపోయాయన్నారు. కరువు ఉపశమన చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమైందన్నారు. ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉరవకొండ మండల అధ్యక్షుడు వెలిగొండ నరసింహులు, జెడ్పీటీసీ తిప్పయ్య, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్రకార్యదర్శి బసవరాజు తదితరులు పాల్గొన్నారు.