Value buying
-
బ్యాంక్.. బాజా!
బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల జోరుతో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. ప్రపంచ మార్కెట్లు లాభపడటం, మే నెల డెరివేటివ్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరగడం సానుకూల ప్రభావం చూపించాయి. మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 31,000 పాయింట్లపైకి, నిఫ్టీ 9,300 పాయింట్లపైకి ఎగిశాయి. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో వేల్యూ బయింగ్ చోటు చేసుకోవడంతో మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 996 పాయింట్ల లాభంతో 31,605 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 286 పాయింట్లు పెరిగి 9,315 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 3 శాతం మేర పెరిగాయి. స్టాక్ సూచీలకు ఈ నెలలో ఇదే అత్యధిక లాభం. 1,135 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలయ్యాయి. అరగంటకే నష్టాల్లోకి జారిపోయాయి. మళ్లీ అరగంటలోనే లాభాల్లోకి వచ్చాయి. ఆ తర్వాత అంతకంతకూ లాభాలు పెరుగుతూనే పోయాయి. ఒక దశలో 83 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 1,052 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 1,135 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ బ్యాంక్‌సూచీ 1,270 పాయింట్లు (7 శాతం)ఎగసి 18,711 పాయింట్లకు చేరింది. వాహన, ఐటీ, లోహ షేర్లు లాభపడ్డాయి. లాక్డౌన్ ఆంక్షల సడలింపు, వ్యాపార కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడంతో రికవరీపై ఆశలతో మార్కెట్ దూసుకుపోయిందని నిపుణులంటున్నారు. మరిన్ని విశేషాలు... ► యాక్సిస్ బ్యాంక్ 13 శాతం లాభంతో రూ.387 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఈ బ్యాంక్‌లో అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, కార్లైల్ 8 శాతం మేర వాటా కోసం వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదన్న వార్తలతో ఈ షేర్ జోరుగా పెరిగింది. ► పలు బ్యాంక్ షేర్లు మంచి లాభాలు సాధించాయి. ఈ షేర్లు ఒక్క రోజులో ఈ రేంజ్లో లాభపడటం గత రెండు నెలల్లో ఇదే మొదటిసారి. ► దాదాపు వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు ఎగిశాయి. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఏబీబీ ఇండియా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పీఎఫ్సీ, కర్నాటక బ్యాంక్ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► క్యూఐపీ ద్వారా రూ.7,500 కోట్లు సమీకరించనుండటంతో కోటక్ బ్యాంక్ షేర్ 5% లాభంతో రూ.1,216 వద్ద ముగిసింది. లక్షల కోట్లు పెరిగిన సంపద సెన్సెక్స్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ. 2 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 2.01 లక్షల కోట్ల మేర పెరిగి రూ.124 లక్షల కోట్లకు ఎగసింది. లాభాలు ఎందుకంటే... ► లాక్డౌన్ సడలింపులు! వివిధ దేశాల్లో లాక్డౌన్ సడలింపులు, వ్యాపార కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థాయికి వస్తుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. త్వరలోనే ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతుందనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఈ ఏడాది జూన్ తర్వాత భారత్ పటిష్టమైన రికవరీని సాధించగలదన్న జేపీ మోర్గాన్ సంస్థ వ్యాఖ్యానం సానుకూల ప్రభావం చూపించింది. ► వేల్యూ బయింగ్... మొండి బకాయిలు పెరుగుతాయనే భయాలతో ఇటీవల పలు బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు బాగా నష్టపోయాయి. ఇవి ఆకర్షణీయ ధరల్లో ఉండటంతో సంస్థాగత ఇన్వెస్టర్లు బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లను జోరుగా కొనుగోలు చేశారు. ► షార్ట్ కవరింగ్.... మే నెల డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో ట్రేడర్లు జోరుగా షార్ట్‌కవరింగ్ కొనుగోళ్లు జరిపారు. బ్యాంక్, ఎన్బీఎఫ్సీల్లో ఈ కొనుగోళ్లు అధికంగా కనిపించాయి. ► లాభాల్లో ప్రపంచ మార్కెట్లు... వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ను సడలించడం, పలు దేశాల్లో మెల్లమెల్లగా సాధారణ స్థితి నెలకొనడం, యూరప్ కేంద్ర బ్యాంక్ ఉద్దీపన చర్యలను ప్రకటించనుండటంతో ప్రపంచ మార్కెట్లు మంచి లాభాలు సాధించాయి. షాంఘై, హాంగ్‌కాంగ్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభపడగా, యూరప్ మార్కెట్లు 1–2 శాతం మేర లాభపడ్డాయి. ► విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు.. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో మన మార్కెట్లో ఇప్పటివరకూ అయినకాడికి అమ్మకాలు సాగిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం రూ.4,716 కోట్ల మేర నికర కొనుగోళ్లు జరిపారు. -
ప్యాకేజీ ఆశలతో కొనుగోళ్లు
గత రెండు రోజుల్లో నష్టపోయిన బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లలో వేల్యూ బయింగ్ చోటు చేసుకోవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. కేంద్రం ఉద్దీపన చర్యలను ప్రకటించగలదన్న ఆశలు సానుకూల ప్రభావం చూపించాయి. అయితే సేవల రంగం గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం, కరోనా కేసులు పెరుగుతుండటం, భవిష్యత్తు ఆర్థిక పరిస్థితులు అంచనాలు ఏమంత ఆశావహంగా లేకపోవడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసల మేర తగ్గడం.. లాభాలకు కళ్లెం వేశాయి. రోజంతా 812 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 232 పాయింట్ల లాభంతో 31,686 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి 9,271 పాయింట్ల వద్దకు చేరింది. ఒడిదుడుకులు కొనసాగుతాయ్... లాక్డౌన్ కారణంగా గత నెలలో సేవల రంగం కార్యకలాపాలు భారీగా తగ్గాయి. మార్చిలో 49.3గా ఉన్న ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ గత నెలలో 5.4కు తగ్గింది. ఈ ఇండెక్స్‌కు సంబధించి గణాంకాలు మొదలైనప్పటినుంచి (డిసెంబర్, 2005)చూస్తే, గత నెలలో సేవల రంగంలో ఇదే అత్యంత భారీ పతనం. కాగా కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని నిపుణులంటున్నారు. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5 శాతం లాభంతో రూ.387 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► కేంద్రం లీటర్ పెట్రోల్‌పై రూ.10, లీటర్ డీజిల్‌పై రూ.13 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అంతే కాకుండా ఈ పెంచిన సుంకాన్ని కంపెనీలే భరించాలంటూ పేర్కొంది. దీంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా పతనమయ్యాయి. హెచ్‌పీసీఎల్6 శాతం, ఐఓసీ 3 శాతం, బీపీసీఎల్ 1 శాతం మేర నష్టాల్లో ముగిశాయి. ఈ షేర్లు ఇంట్రాడేలో 7–13% మేర పతనమయ్యాయి. ► స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆప్ యూటీఐ(ఎస్‌యూయూటీఐ) ద్వారా ఐటీసీలో ఉన్న వాటాను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోందన్న వార్తలతో ఐటీసీ షేర్ 6 శాతం నష్టంతో రూ.164కు చేరింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే కావడం గమనార్హం. ► మార్కెట్ లాభాల్లో ఉన్నా వందకు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఎస్బీఐ, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీవీఆర్, ఓల్టాస్, గోద్రేజ్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
ప్యాకేజీ లాభాలు
కరోనా వైరస్ కల్లోలానికి తట్టుకోవడానికి 21 రోజుల లాక్‌డౌన్‌ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్డౌన్ ప్రభావం నుంచి ప్రజలను ఆదుకోవడానికి కేంద్రం ప్యాకేజీని ప్రకటించింది. దీంతో మన స్టాక్ మార్కెట్ గురువారం జోరుగా పెరిగింది. ప్రపంచ మార్కెట్లు పతనబాటలో ఉన్నా మన స్టాక్ సూచీలు దూసుకుపోయాయి. 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీకి అమెరికా సెనేట్ ఆమోదం తెలపడం, ఇటీవల బాగా నష్టపోయిన షేర్లలో వేల్యూ బయింగ్ చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. మరోవైపు మార్చి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు భారీగా జరగడం కూడా కలసివచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,411 పాయింట్ల లాభంతో 29,947 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 324 పాయింట్లు పెరిగి 8,641 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 4.94%, నిఫ్టీ 3.89% చొప్పున పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. మార్చిలో అధ్వాన పతనం... గత 3 రోజుల్లో సెన్సెక్స్ 3,966 పాయింట్లు, నిఫ్టీ 1,032 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. అయితే ఈ మార్చి సిరీస్‌లో సెన్సెక్స్ 25%, నిఫ్టీ 26% చొప్పున నష్టపోయాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక్క నెలలో సూచీలు ఇంత అధ్వానంగా పతనం కావడం ఇదే తొలిసారి. కాగా గురువారం ఆసియా మార్కెట్లు 1–4%, యూరప్ 1–2% లాభాల్లో ముగిశాయి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరిన్ని విశేషాలు... ► ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 45 శాతం ఎగసి రూ.437 వద్ద ముగిసింది. భారీ షార్ట్ కవరింగ్ దీనికి తోడ్పడిందని నిపుణులంటున్నారు. ఒక్క రోజులో ఈ షేర్ ఈ స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. గత పది వారాల్లో 80% మేర నష్టపోయింది. ► బంధన్ బ్యాంక్ షేర్ 39 శాతం లాభంతో రూ.216కు పెరిగింది. ► మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు– మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన అన్ని షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ‘కమోడిటీ’ ట్రేడింగ్ వేళలు కుదింపు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ ట్రేడింగ్ వేళలను కుదించాయి. గతంలో ఈ సెగ్మెంట్లో ఉదయం 9 గంటలకు మొదలై, అర్థరాత్రి వరకూ ట్రేడింగ్ జరిగేది. దీనిని ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకూ తగ్గించాయి. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 14 వరకూ ఈ వేళలు అమల్లో ఉంటాయి. ఎమ్‌సీఎక్స్, ఐపీఈఎక్స్లు కూడా ఇదే వేళలను పాటించనున్నాయి. 3 రోజుల్లో రూ.11 లక్షల కోట్లు పెరిగిన సంపద మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.48 లక్షల కోట్లు పెరిగింది. మూడు రోజుల వరుస లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.11.12 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.11,12,089 కోట్లు పెరిగి రూ.112.99 లక్షల కోట్లకు ఎగసింది. లాభాలు ఎందుకంటే... ► గ్రామీణ ఆర్థికానికి ఊరట 21 రోజుల లాక్డౌన్ కారణంగా కష్టాలు పడే ప్రజల కోసం కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కారణంగా గ్రామీణ ఆర్థిక రంగానికి ఊరట లభించనున్నది. దీంతో ఎఫ్ఎమ్సీజీ షేర్లు జోరుగా పెరిగాయి. మ్యారికో, హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్సూమర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, గ్లాక్సో స్మిత్‌లైన్ కన్సూమర్ హెల్త్‌కేర్, డాబర్ ఇండియా, కోల్గేట్–పామోలివ్, నెస్లే ఇండియా షేర్లు 4–8 శాతం రేంజ్లో పెరిగాయి. ► తదుపరి ప్యాకేజీపై ఆశలు మరోవైపు త్వరలోనే పారిశ్రామిక రంగాలకు కూడా ప్యాకేజీ ప్రకటించే అవకాశాలున్నాయన్న ఆశలు కూడా నెలకొన్నాయి. త్వరలోనే ఆర్బీఐ కూడా రుణాల చెల్లింపుల విషయంలో(ఈఎమ్ఐల వాయిదా, తదితర నిర్ణయాలు) వెసులుబాటునివ్వగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా ఆర్థిక రంగ, బ్యాంక్, ఎన్బీఎఫ్సీ, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, బీమా కంపెనీల షేర్లు 40 శాతం మేర లాభపడ్డాయి. ► షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు... మార్చి సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో భారీగా ఉన్న షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకోవడానికి కొనుగోళ్లు జోరుగా జరిగాయి. ► వేల్యూ బయింగ్: భారీ పతనంతో ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న.. ముఖ్యంగా బ్యాంక్ షేర్లలో వేల్యూ బయింగ్ జోరుగా జరిగింది. ► తగ్గుతున్న చమురు ధరలు... ఇక వివిధ దేశాల్లో లాక్డౌన్ కారణంగా వినియోగం భారీగా తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నాయి. బ్యారెల్ చమురు ధర 30 డాలర్లలోపే ట్రేడవుతోంది. ముడిచమురుపై అధికంగా ఆధారపడ్డ మన దేశానికి చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్య స్థితిగతులు భేషుగ్గా ఉండనున్నాయి. -
బుల్.. ధనాధన్!
ఆరు రోజుల పతనం కారణంగా భారీగా నష్టపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జరగడం(వేల్యూ బయింగ్)తో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి నేటి(గురువారం) నుంచి ఆరంభం కానున్నది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల నికర లాభాలు పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఈ క్యూ2 ఫలితాలు బాగానే ఉండగలవన్న ఆశావహంతో కొనుగోళ్ల సునామీ చోటు చేసుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 11,300 పాయింట్లపైకి ఎగబాకాయి. కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచడం పండుగ డిమాండ్‌కు మరింత జోష్నివ్వగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ నష్టాల నుంచి రికవరీ కావడం, నేడు(గురువారం) నిప్టీ వీక్లీ ఆప్షన్లు ఎక్స్పైరీ కానుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. బ్యాంక్, ఆర్థిక, టెలికం షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 646 పాయిం ట్లు లాభపడి 38,178 పాయింట్ల వద్ద, నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 11,313 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. క్యూ2 ఫలితాలే దిక్సూచి.... ఆరు రోజుల నష్టాల నుంచి మార్కెట్ రికవరీ అయిందని జియోజిత్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఆర్బీఐ మరోసారి రేట్లు తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో బాండ్ల రాబడులు తగ్గాయని, దీంతో బ్యాంక్ షేర్లు పెరిగాయని వివరించారు. రేట్ల తగ్గింపు కారణంగా మరిన్ని నిధులు వ్యవస్థలోకి వస్తాయని, దీంతో డిమాండ్ పుంజుకోగలదన్న ఆశావహంతో కొనుగోళ్లు జోరుగా సాగాయని విశ్లేషించారు. రానున్న క్యూ2 ఫలితాలు మార్కెట్ గతిని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. మధ్యాహ్నం తర్వాత లాభాలు..... దసరా సందర్భంగా మంగళవారం సెలవు. ఒక రోజు విరామం తర్వాత సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణి లాభాల్లో కదలాడింది. ఆ తర్వాత కొనుగోళ్లు జోరందుకోవడంతో భారీ లాభాల దిశగా కదిలింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 678 పాయింట్లు, నిఫ్టీ 196 పాయింట్ల మేర లాభపడ్డాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై అనిశ్చితి చోటు చేసుకోవడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు, చైనా అమెరికాతో పరిమిత వాణిజ్య ఒప్పందానికి ఒప్పుకోగలదన్న వార్తల (ఆసియా మార్కెట్లు ముగిశాక ఈ వార్తలు వచ్చాయి)కారణంగా యూరప్ మార్కెట్లు లాభాలతో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి. బ్యాంక్ షేర్ల జోరు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్(పీఎమ్‌సీ), లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో గత 6 ట్రేడింగ్ సెషన్లలో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు నష్టపోయాయి. ఈ నష్టాల కారణంగా పలు బ్యాంక్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్నాయి. మరోవైపు నేడు(గురువారం) వెల్లడి కానున్న ఇండస్ఇండ్ బ్యాంక్ క్యూ2 ఫలితాలపై పలు బ్రోకరేజ్ సంస్థలు ఆశావహ అంచనాలను వెలువరించాయి. దీంతో బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 1,018 పాయింట్లు (3.6%) మేర ఎగసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ 5.4% లాభంతో రూ.1,310 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడిన షేర్ ఇదే. మరిన్ని విశేషాలు... ► యస్ బ్యాంక్ షేర్ 5.2% నష్టంతో రూ.43 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► ప్రమోటార్ల షేర్ల వాటాను డిపాజిటరీ సంస్థ, సీడీఎస్ఎల్ స్తంభింపజేయడంతో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్) షేర్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌తో పదేళ్ల కనిష్ట స్థాయి, రూ.26కు పడిపోయింది. ► షేర్ల బైబ్యాక్ వార్తలతో ఇండియాబుల్స్ వెంచర్స్ 9 శాతం లాభంతో రూ.109కు, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 5 శాతం లాభంతో రూ.43కు పెరిగాయి. ► ఇండియామార్ట్ ఇంటర్మెష్ మెరుపులు కొనసాగుతున్నాయి. 20% లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, 2,304ను తాకి.. చివరకు 18% లాభంతో రూ.2,264 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద 1.66 లక్షల కోట్లు అప్ స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.66 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.66 లక్షల కోట్లు పెరిగి రూ.1,43,92,456 కోట్లకు చేరింది. లాభాలు ఎందుకంటే... ► వేల్యూ బయింగ్: గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 4 శాతం మేర నష్టపోయాయి. ఈ ఆరు రోజుల నష్టాల కారణంగా బ్యాంక్, ఆర్థిక, లోహ, వాహన, రియల్టీ రంగ షేర్ల ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉండటంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. ► కరువు భత్యం(డీఏ) పెంపు: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏను 12 శాతం నుంచి 17 శాతానికి,.. 5 శాతం మేర పెంచింది. ఫలితంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనున్నది. డీఏ పెంపు కారణంగా కేంద్రంపై రూ.16,000 కోట్ల భారం పడనున్నప్పటికీ, ఆ మేరకు ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెరిగి, కొనుగోళ్లు చోటు చేసుకుంటాయని, వినియోగం పుంజుకుంటుందన్న అంచనాలున్నాయి. దీంతో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్ రాగలదన్న ఆశాభావంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ► చల్లబడ్డ చమురు ధరలు: అమెరికా... ఇతర దేశాలపై సుంకాలు విధిస్తున్న కారణంగా అంతర్జాతీయంగా వృద్ధి కుంటుపడుతుందన్న ఆందోళనతో ముడి చమురు ధరలు పతనమయ్యాయి. గత మూడు రోజులుగా చమురు ధరలు తగ్గుతున్నాయి. 80 శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకుంటున్న మన దేశానికి చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపుతుంది. అయితే మన మార్కెట్ ముగిసిన తర్వాత చమురు ధరలు పెరిగాయి. ► రూపాయి రికవరీ: ఫారెక్స్ మార్కెట్లో రోజులో ఎక్కువ భాగం నష్టాల్లో ట్రేడైన డాలర్‌తో రూపాయి మారకం విలువ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి 8 పైసలు పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: మంగళవారం నాటి స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. నాలుగురోజులు వరుస నష్టాలకు బ్రేక వేస్తూ దాదాపు 100 పాయింట్లకు పైగా లాభంతో పాజిటివ్ నోట్ తో మొదలయ్యాయి. సెన్సెక్స్ 101 పాయింట్ల లాభంతో 26,660 దగ్గర, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 8,078దగ్గర ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ఆసియన్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మార్కెట్లు జోరుమీదున్నాయి. అయితే ఈ నెలలో తేలనున్న బిహార్ ఎన్నికల ఫలితాలు మార్కెట్ పై ప్రభావం చూపొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో రూపాయి కొంచెం మెరుగుపడింది. 19 పైసలు లాభపడి 65.40 దగ్గర ట్రేడవుతోంది. అటు చైనా మార్కెట్లు లాభాలతో మొదలవ్వగా, డాలర్ తో పోలిస్తే యాన్ బలహీనంగా ట్రేడవుతోంది.