ప్యాకేజీ లాభాలు | Sensex soars over 1400 points And Nifty above 8600 Points | Sakshi
Sakshi News home page

ప్యాకేజీ లాభాలు

Published Fri, Mar 27 2020 4:31 AM | Last Updated on Fri, Mar 27 2020 4:36 AM

Sensex soars over 1400 points And Nifty above 8600 Points - Sakshi

కరోనా వైరస్‌ కల్లోలానికి తట్టుకోవడానికి  21 రోజుల లాక్‌డౌన్‌ను కేంద్రం విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌  ప్రభావం నుంచి ప్రజలను ఆదుకోవడానికి  కేంద్రం ప్యాకేజీని ప్రకటించింది. దీంతో మన స్టాక్‌ మార్కెట్‌ గురువారం జోరుగా పెరిగింది. ప్రపంచ మార్కెట్లు పతనబాటలో ఉన్నా మన స్టాక్‌ సూచీలు దూసుకుపోయాయి. 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీకి అమెరికా సెనేట్‌ ఆమోదం తెలపడం, ఇటీవల బాగా నష్టపోయిన షేర్లలో వేల్యూ బయింగ్‌ చోటు చేసుకోవడం సానుకూల  ప్రభావం చూపించాయి. మరోవైపు మార్చి డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు భారీగా జరగడం కూడా కలసివచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,411 పాయింట్ల లాభంతో 29,947 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 324 పాయింట్లు పెరిగి 8,641 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 4.94%, నిఫ్టీ 3.89% చొప్పున పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి.

మార్చిలో అధ్వాన పతనం...
గత 3 రోజుల్లో సెన్సెక్స్‌ 3,966 పాయింట్లు, నిఫ్టీ 1,032 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.  అయితే ఈ మార్చి సిరీస్‌లో సెన్సెక్స్‌ 25%, నిఫ్టీ 26% చొప్పున నష్టపోయాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒక్క నెలలో  సూచీలు ఇంత అధ్వానంగా పతనం కావడం ఇదే తొలిసారి. కాగా గురువారం ఆసియా మార్కెట్లు 1–4%, యూరప్‌ 1–2% లాభాల్లో ముగిశాయి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.   

మరిన్ని విశేషాలు...
► ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ 45 శాతం ఎగసి రూ.437 వద్ద ముగిసింది. భారీ షార్ట్‌ కవరింగ్‌ దీనికి తోడ్పడిందని నిపుణులంటున్నారు. ఒక్క రోజులో ఈ షేర్‌ ఈ స్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. గత పది వారాల్లో 80% మేర నష్టపోయింది.  
► బంధన్‌ బ్యాంక్‌ షేర్‌ 39 శాతం లాభంతో రూ.216కు పెరిగింది.  
► మొత్తం 30 సెన్సెక్స్‌ షేర్లలో నాలుగు షేర్లు– మారుతీ సుజుకీ, టెక్‌ మహీంద్రా, సన్‌ ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన అన్ని షేర్లు లాభాల్లోనే ముగిశాయి.  


‘కమోడిటీ’ ట్రేడింగ్‌ వేళలు కుదింపు
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు కమోడిటీ డెరివేటివ్స్‌ సెగ్మెంట్‌ ట్రేడింగ్‌ వేళలను కుదించాయి. గతంలో ఈ సెగ్మెంట్లో ఉదయం 9 గంటలకు మొదలై, అర్థరాత్రి వరకూ ట్రేడింగ్‌ జరిగేది. దీనిని ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకూ తగ్గించాయి. ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 14 వరకూ ఈ వేళలు అమల్లో ఉంటాయి.  ఎమ్‌సీఎక్స్, ఐపీఈఎక్స్‌లు కూడా ఇదే వేళలను పాటించనున్నాయి.

3 రోజుల్లో రూ.11 లక్షల కోట్లు పెరిగిన సంపద
మార్కెట్‌ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.48 లక్షల కోట్లు పెరిగింది. మూడు రోజుల వరుస లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.11.12 లక్షల కోట్లు పెరిగింది.  బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.11,12,089 కోట్లు పెరిగి రూ.112.99 లక్షల కోట్లకు ఎగసింది.

లాభాలు ఎందుకంటే...
► గ్రామీణ ఆర్థికానికి ఊరట
21 రోజుల లాక్‌డౌన్‌ కారణంగా కష్టాలు పడే ప్రజల కోసం కేంద్రం రూ.1.70 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ కారణంగా గ్రామీణ ఆర్థిక రంగానికి ఊరట లభించనున్నది. దీంతో ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు జోరుగా పెరిగాయి. మ్యారికో, హెచ్‌యూఎల్, గోద్రెజ్‌ కన్సూమర్, బ్రిటానియా ఇండస్ట్రీస్, గ్లాక్సో స్మిత్‌లైన్‌ కన్సూమర్‌ హెల్త్‌కేర్, డాబర్‌ ఇండియా, కోల్గేట్‌–పామోలివ్, నెస్లే ఇండియా షేర్లు 4–8 శాతం రేంజ్‌లో పెరిగాయి.  

► తదుపరి ప్యాకేజీపై ఆశలు
మరోవైపు త్వరలోనే పారిశ్రామిక రంగాలకు కూడా ప్యాకేజీ ప్రకటించే అవకాశాలున్నాయన్న ఆశలు కూడా నెలకొన్నాయి. త్వరలోనే ఆర్‌బీఐ కూడా రుణాల చెల్లింపుల విషయంలో(ఈఎమ్‌ఐల వాయిదా, తదితర నిర్ణయాలు) వెసులుబాటునివ్వగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ఫలితంగా ఆర్థిక రంగ, బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, బీమా కంపెనీల షేర్లు 40 శాతం మేర లాభపడ్డాయి.

► షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు...
మార్చి సిరీస్‌ ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో భారీగా ఉన్న షార్ట్‌ పొజిషన్లను కవర్‌ చేసుకోవడానికి కొనుగోళ్లు జోరుగా జరిగాయి.  

► వేల్యూ బయింగ్‌:  భారీ పతనంతో ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న.. ముఖ్యంగా బ్యాంక్‌ షేర్లలో వేల్యూ బయింగ్‌ జోరుగా జరిగింది.  

► తగ్గుతున్న చమురు ధరలు...
ఇక వివిధ దేశాల్లో లాక్‌డౌన్‌ కారణంగా వినియోగం భారీగా తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నాయి. బ్యారెల్‌  చమురు ధర 30 డాలర్లలోపే ట్రేడవుతోంది. ముడిచమురుపై అధికంగా ఆధారపడ్డ మన దేశానికి చమురు ధరలు తగ్గడం వల్ల ద్రవ్య స్థితిగతులు భేషుగ్గా ఉండనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement