ఆరు రోజుల పతనం కారణంగా భారీగా నష్టపోయి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో కొనుగోళ్లు జరగడం(వేల్యూ బయింగ్)తో బుధవారం స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి నేటి(గురువారం) నుంచి ఆరంభం కానున్నది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీల నికర లాభాలు పెరిగే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఈ క్యూ2 ఫలితాలు బాగానే ఉండగలవన్న ఆశావహంతో కొనుగోళ్ల సునామీ చోటు చేసుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,300 పాయింట్లపైకి ఎగబాకాయి.
కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచడం పండుగ డిమాండ్‌కు మరింత జోష్‌నివ్వగలదన్న అంచనాలు నెలకొన్నాయి. ముడి చమురు ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ నష్టాల నుంచి రికవరీ కావడం, నేడు(గురువారం) నిప్టీ వీక్లీ ఆప్షన్లు ఎక్స్‌పైరీ కానుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపించాయి. బ్యాంక్, ఆర్థిక, టెలికం షేర్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 646 పాయిం ట్లు లాభపడి 38,178 పాయింట్ల వద్ద, నిఫ్టీ 187 పాయింట్లు లాభపడి 11,313 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, కన్సూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు లాభపడ్డాయి. ఇక ఎన్‌ఎస్‌ఈ ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి.
క్యూ2 ఫలితాలే దిక్సూచి....
ఆరు రోజుల నష్టాల నుంచి మార్కెట్ రికవరీ అయిందని జియోజిత్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ మరోసారి రేట్లు తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలతో బాండ్ల రాబడులు తగ్గాయని, దీంతో బ్యాంక్ షేర్లు పెరిగాయని వివరించారు. రేట్ల తగ్గింపు కారణంగా మరిన్ని నిధులు వ్యవస్థలోకి వస్తాయని, దీంతో డిమాండ్ పుంజుకోగలదన్న ఆశావహంతో కొనుగోళ్లు జోరుగా సాగాయని విశ్లేషించారు. రానున్న క్యూ2 ఫలితాలు మార్కెట్ గతిని నిర్దేశిస్తాయని పేర్కొన్నారు.
మధ్యాహ్నం తర్వాత లాభాలు.....
దసరా సందర్భంగా మంగళవారం సెలవు. ఒక రోజు విరామం తర్వాత సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణి లాభాల్లో కదలాడింది. ఆ తర్వాత కొనుగోళ్లు జోరందుకోవడంతో భారీ లాభాల దిశగా కదిలింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 678 పాయింట్లు, నిఫ్టీ 196 పాయింట్ల మేర లాభపడ్డాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై అనిశ్చితి చోటు చేసుకోవడంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలపై ఆశావహ అంచనాలు, చైనా అమెరికాతో పరిమిత వాణిజ్య ఒప్పందానికి ఒప్పుకోగలదన్న వార్తల (ఆసియా మార్కెట్లు ముగిశాక ఈ వార్తలు వచ్చాయి)కారణంగా యూరప్ మార్కెట్లు లాభాలతో ఆరంభమై, లాభాల్లోనే ముగిశాయి.
బ్యాంక్ షేర్ల జోరు
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్(పీఎమ్‌సీ), లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల్లో అవకతవకలు వెలుగులోకి రావడంతో గత 6 ట్రేడింగ్ సెషన్లలో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు నష్టపోయాయి. ఈ నష్టాల కారణంగా పలు బ్యాంక్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తున్నాయి. మరోవైపు నేడు(గురువారం) వెల్లడి కానున్న ఇండస్‌ఇండ్ బ్యాంక్ క్యూ2 ఫలితాలపై పలు బ్రోకరేజ్ సంస్థలు ఆశావహ అంచనాలను వెలువరించాయి. దీంతో బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ 1,018 పాయింట్లు (3.6%) మేర ఎగసింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ 5.4% లాభంతో రూ.1,310 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడిన షేర్ ఇదే.
మరిన్ని విశేషాలు...
► యస్ బ్యాంక్ షేర్ 5.2% నష్టంతో రూ.43 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
► ప్రమోటార్ల షేర్ల వాటాను డిపాజిటరీ సంస్థ, సీడీఎస్‌ఎల్ స్తంభింపజేయడంతో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(డీహెచ్‌ఎఫ్‌ఎల్) షేర్ 10 శాతం లోయర్ సర్క్యూట్‌తో పదేళ్ల కనిష్ట స్థాయి, రూ.26కు పడిపోయింది.
► షేర్ల బైబ్యాక్ వార్తలతో ఇండియాబుల్స్ వెంచర్స్ 9 శాతం లాభంతో రూ.109కు, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ 5 శాతం లాభంతో రూ.43కు పెరిగాయి.
► ఇండియామార్ట్ ఇంటర్‌మెష్ మెరుపులు కొనసాగుతున్నాయి. 20% లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, 2,304ను తాకి.. చివరకు 18% లాభంతో రూ.2,264 వద్ద ముగిసింది.
ఇన్వెస్టర్ల సంపద 1.66 లక్షల కోట్లు అప్
స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.66 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.66 లక్షల కోట్లు పెరిగి రూ.1,43,92,456 కోట్లకు చేరింది.
లాభాలు ఎందుకంటే...
► వేల్యూ బయింగ్: గత ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 4 శాతం మేర నష్టపోయాయి. ఈ ఆరు రోజుల నష్టాల కారణంగా బ్యాంక్, ఆర్థిక, లోహ, వాహన, రియల్టీ రంగ షేర్ల ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉండటంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి.
► కరువు భత్యం(డీఏ) పెంపు: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏను 12 శాతం నుంచి 17 శాతానికి,.. 5 శాతం మేర పెంచింది. ఫలితంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనున్నది. డీఏ పెంపు కారణంగా కేంద్రంపై రూ.16,000 కోట్ల భారం పడనున్నప్పటికీ, ఆ మేరకు ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెరిగి, కొనుగోళ్లు చోటు చేసుకుంటాయని, వినియోగం పుంజుకుంటుందన్న అంచనాలున్నాయి. దీంతో మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్ రాగలదన్న ఆశాభావంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.
► చల్లబడ్డ చమురు ధరలు: అమెరికా... ఇతర దేశాలపై సుంకాలు విధిస్తున్న కారణంగా అంతర్జాతీయంగా వృద్ధి కుంటుపడుతుందన్న ఆందోళనతో ముడి చమురు ధరలు పతనమయ్యాయి. గత మూడు రోజులుగా చమురు ధరలు తగ్గుతున్నాయి. 80 శాతానికి పైగా చమురును దిగుమతి చేసుకుంటున్న మన దేశానికి చమురు ధరలు తగ్గడం సానుకూల ప్రభావం చూపుతుంది. అయితే మన మార్కెట్ ముగిసిన తర్వాత చమురు ధరలు పెరిగాయి.
► రూపాయి రికవరీ: ఫారెక్స్ మార్కెట్లో రోజులో ఎక్కువ భాగం నష్టాల్లో ట్రేడైన డాలర్‌తో రూపాయి మారకం విలువ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి 8 పైసలు పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపించింది.
Comments
Please login to add a commentAdd a comment