షార్ట్ సర్క్యూట్తో వ్యాన్ దగ్ధం
భూపాలపల్లి : షార్ట్ సర్క్యూట్తో ఒమ్నీ వ్యాన్ దగ్ధమైన సంఘటన భూపాలపల్లి పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. మండలంలోని గొల్లబుద్ధారం గ్రామానికి చెందిన బట్టల వ్యాపారి బండారి సదానందం పట్టణంలోని శ్రీషిర్డీ సాయిబాబా ఆలయంలో మంగళవారం జరిగే గురుపౌర్ణమి వేడుకలకు తన మారుతి ఒమినీ వ్యాన్(ఏపీ10 క్యూ 5982)లో కుటుంబ సభ్యులను తీసుకొచ్చాడు.
అనంతరం వాహనాన్ని పక్కనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట పార్కింగ్ చేసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో వ్యాన్ ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు లేచాయి. దీంతో సదానందం హుటాహుటిన వ్యాన్ దిగి దూరంగా వెళ్లాడు. ఆలయం వద్ద ఉన్న సింగరేణి ఎస్ అండ్ పీసీ సిబ్బంది వ్యాన్లో చెలరేగుతున్న మంటలను గమనించి రెస్క్యూ టీంకు సమాచారమిచ్చారు. వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఫోం, నీటిని పంపింగ్ చేసి మంటలను చల్లార్చారు.
కాగా వ్యాన్ వెనుక భాగంలో గ్యాస్ సిలిండర్ ఉండటంతో స్థానికులు, ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. సంఘటన స్థలానికి అర కిలోమీటరు దూరాన్నే ఉండిపోయారు. సకాలంలో స్పందించి ధైర్యంతో మంటలను చల్లార్పిన రెస్క్యూ టీం సిబ్బందిని స్థానికులు అభినందించారు.