vanadurga
-
‘దుర్గామాత’గా దర్శనమిచ్చిన వనదుర్గ
అన్నవరం : రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శ్రావణమాసం సందర్భంగా నిర్వహిస్తున్న పూజలు, చండీహోమం ఐదో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. అమ్మవారిని ‘దుర్గామాత ’గా అలంకరించి పూజించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో పూజాదికాలు మెుదలయ్యాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, సూర్యనమస్కారాలు నిర్వహించారు. సాయంత్రం 3 నుంచి 7 గంటల వరకూ చండీహోమం, కుంకుమార్చన నిర్వహించి, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ తదితరులు పూజాదికాలు నిర్వహించారు. వనదుర్గ అమ్మవారికి శ్రావణమాస పూజలు, చండీయాగం గురువారం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనున్నాయి. కాగా, శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యంగిర హోమం కూడా ఉదయంమే నిర్వహించనున్నారు. -
బాలత్రిపురసుందరిగా వనదుర్గ అమ్మవారు
అన్నవరం : రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి వరుసగా మూడో రోజైన సోమవారం కూడా శ్రావణమాస పూజలు, చండీహోమం నిర్వహించారు. అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 9 గంటలకు రుత్విక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవగ్రహ మండపారాధన, కలశస్థాపన, చండీపారాయణలు, 33 కోట్ల అధిపతులకు ఆహ్వానాలు, సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, లక్ష్మీగణపతి హోమాలు, శివపంచాక్షరి జపాలు, శ్రీసూక్త, పురుషసూక్త పారాయణలు, బాల, కుమారి, సువాసిని తదితర పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమాలను దేవస్థానం వేద పండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, గాడేపల్లి వేంకట్రావు, అర్చకులు గంగాధరభట్ల శ్రీను, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. -
వనదుర్గకు ఘనంగా పూజలు
తొలిరోజు లక్ష్మీదేవిగా అలంకరణ రత్నగిరిపై 18 వరకూ శ్రావణ సందడి చండీహోమానికి అంకురార్పణ అన్నవరం : రత్నగిరిపై వనదుర్గ అమ్మవారి శ్రావణమాస పూజలు శ్రావణ శుద్ధ దశమి శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం తొమ్మిది గంటలకు మంగళవాయిద్యాల నడుమ విఘ్నేశ్వరపూజతో పండితులు కార్యక్రమాలు ప్రారంభించారు. తొలిరోజున నవగ్రహ మండపారాధన, కలశస్థాపన, చండీపారాయణలు, 33 కోట్ల అధిపతులకు ఆహ్వానాలు, సూర్యనమస్కారాలు, మహాలింగార్చన, లక్ష్మీగణపతి హోమాలు, శివపంచాక్షరి జపాలు, శ్రీసూక్త, పురుషసూక్త పారాయణలు, లింగార్చన, బాల, కుమారీ, సువాసినీ పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు దంపతులు కార్యక్రమానికి విచ్చేసి రుత్విక్కులకు వరుణలు ఇచ్చి పూజాసామగ్రి సమర్పించారు. 44 మంది రుత్విక్కులు, అర్చకస్వాములు, పండితులకు వారు దీక్షా వస్త్రాలను అందచేశారు. వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, గొల్లపల్లి ఘనాపాఠీ, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకులు కొండవీటి సత్యనారాయణ, వనదుర్గ ఆలయ అర్చకులు కృష్ణమోహన్, వ్రత పురోహితులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలిరోజున లక్ష్మీదేవిగా.. తొలిరోజు అమ్మవారిని లక్ష్మీదేవి అవతారంలో అలంకరించి పూజించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించిన రుత్విక్కులు పూజలనంతరం వేదస్వస్తి పలికారు. మధ్యాహ్నం అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. చండీహోమం ప్రారంభించారు. అర్చన, హోమాలనంతరం నీరాజన మంత్రపుష్పాలు, వేదాశీస్సులు నిర్వహించారు. ఏఈఓ వైఎస్ఆర్ మూర్తి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈనెల 18న జరిగే పూర్ణాహుతితో పూజలు ముగుస్తాయి. రుత్విక్కులకు చిరిగిన దీక్షావస్త్రాలు : సరఫరాదారునిపై ఈఓ ఆగ్రహం ఈఓ పంపిణీ చేసిన దీక్షావస్త్రాలలో కొన్ని చిరిగిపోయి ఉండడంతో వాటిని ధరించిన రుత్విక్కులు అసంతృప్తి వ్య క్తం చేశారు. ఈ పంచెలను తునిలోని ఒక వస్త్రదుకాణం నుంచి కొనుగోలు చేశారు. చిరిగిన పంచెలను ఈఓ పరిశీలించి కొత్తవి ఇవ్వాలని వస్త్రదుకాణానికి కబురు చేయమని ఆదేశించారు.