‘దుర్గామాత’గా దర్శనమిచ్చిన వనదుర్గ
అన్నవరం : రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శ్రావణమాసం సందర్భంగా నిర్వహిస్తున్న పూజలు, చండీహోమం ఐదో రోజైన బుధవారం కూడా కొనసాగాయి. అమ్మవారిని ‘దుర్గామాత ’గా అలంకరించి పూజించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో పూజాదికాలు మెుదలయ్యాయి. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు, సూర్యనమస్కారాలు నిర్వహించారు. సాయంత్రం 3 నుంచి 7 గంటల వరకూ చండీహోమం, కుంకుమార్చన నిర్వహించి, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. దేవస్థానం వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, ముష్టి కామశాస్త్రి, వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ తదితరులు పూజాదికాలు నిర్వహించారు. వనదుర్గ అమ్మవారికి శ్రావణమాస పూజలు, చండీయాగం గురువారం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనున్నాయి. కాగా, శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యంగిర హోమం కూడా ఉదయంమే నిర్వహించనున్నారు.