vanama venkateswarrao
-
నేనే గెలుస్తా: వనమా
సాక్షి, కొత్తగూడెంరూరల్: కొత్తగూడెం నియోజకవర్గంలో తనకు ప్రజల ఆదరణ ఉందని.. తప్పకుండా గెలుస్తానని ప్రజాకూటమి అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర ఆర్ట్స్ కళాశాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో తనకు ప్రజలందరూ ఓటు రూపంలో సహకరిస్తున్నారన్నారు. తనను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తారన్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారయణ, (చిన్ని), లాయర్ లక్కినేని సత్యనారయణ తదితరులు ఉన్నారు. -
ఎన్నికల ఏటికి ఎదురీతే!
, కాకినాడ : జిల్లా కేంద్రమైన కాకినాడలో ఒకప్పుడు బలమైన శక్తిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి.. వచ్చే ఎన్నికల్లో ఎదురీత సాగించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటోంది. నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఒంటెత్తు పోకడలతో ఇక్కడ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయి పదేళ్లు దాటిపోవడం, వనమాడి వ్యవహార శైలితో పార్టీ శ్రేణులు విసిగి వేసారిపోవడం ఇందుకు ప్రధాన కారణాలని చెప్పవచ్చు. దాదాపు ముఖ్య నేతలంతా ొంతకాలంగా వనమాడికి దూరమైపోయారు. ఆయన సొంత అజెండాతో ముందుకు పోవడమే ఈ పరిణామానికి మూలమని పార్టీ వర్గాలే అంటున్నాయి. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, కష్టపడి పని చేసేవారిని దూరం పెట్టడమే వనమాడి పట్ల విముఖతకు దారి తీశాయంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పార్టీ మనుగడ ఏమి కానుందోనని పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడలో నెలకొన్న దుస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పూనుకుంటున్నారని సమాచారం. ఎన్నికలు తరుముకు వస్తున్న నేపథ్యంలో వనమాడిని నమ్ముకుంటే పార్టీ పరిస్థితి అగమ్య గోచరమేనని నాయకత్వం భావిస్తోంది. గత ఏడాది ‘వస్తున్నా మీకోసం’ కార్యక్రమానికి జిల్లాకు వచ్చినప్పుడే వనమాడి తీరుపై పార్టీ శ్రేణులు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. పార్టీ శ్రేణుల్లో నిస్పృహ మత్స్యకార ప్రతినిధిగా ఉంటూ సొంత సామాజికవర్గంలోని వాడబలిజ, అగ్నికుల క్షత్రియ వర్గాలను సమన్వయం చేయలేక చేతులెత్తేసిన వనమాడి.. ఇక ఇతర వర్గాలను ఏ రకంగా ఆకట్టుకోగలుగుతారని పార్టీ నాయకత్వం భావిస్తోంది. గత ఎన్నికల్లో సొంత సామాజికవర్గం ఆగ్రహాన్ని చవి చూసిన వనమాడి ఇప్పుడు కూడా ఆ వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయకపోగా, కొందరిని దూరం పెట్టారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో వారు ఆయన మీద గుర్రుగా ఉన్నారు. దాదాపు ఇదే పరిస్థితిఇతర సామాజికవర్గ నేతల్లో కూడా నెలకొంది. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన బోళ్ల కృష్ణమోహన్, పార్టీ నగర అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు, నగర తెలుగుయువత అధ్యక్షుడు కత్తిపూడి శ్రీను, వైద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ చైర్మన్‌గా పని చేసిన యనమదల రవితో పాటు కాకినాడలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లందరూ వనమాడికి దాదాపుగా దూరమయ్యారు. ఒకరిద్దరు మాజీ కార్పొరేటర్లు మాత్రమే ఆయన వెంట మిగిలారు. చివరకు ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా వనమాడి పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహార శైలి వల్లే వనమాడి గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూశారని, పలు డివిజన్లలో కనీసం పార్టీ జెండా కూడా కట్టే నాథుడే లేకుండా పోయాడని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పటికీ ప్రజా సమస్యలపై స్పందించకపోవడంతో ప్రజలు గత ఎన్నికల్లో కాకినాడలో టీడీపీని మూడో స్థానానికే పరిమితం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే నాయకత్వంతో ఎన్నికలను ఎదుర్కొంటే గెలుపు కష్టమన్న నిస్పృహ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. బరి కొట్టనున్న ‘ముత్తా’? ఈ పరిస్థితుల్లో కాకినాడలో వనమాడికి ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం అటు అధిష్టానం, ఇటు నాయకులు, కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ వయసు రీత్యా రాజకీయాల్లో అంత చురుకైన పాత్ర పోషించలేకపోతున్నారు. ఫలితంగా తన కుమారుడు శశిధర్‌కు టిక్కెట్టు ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అది వీలు కాకపోతే తానే రంగంలోకి దిగేందుకు సైతం సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వనమాడి రాజకీయ భవితవ్యం, జిల్లా కేంద్రంలో టీడీపీ పరిస్థితి ఏమి కానున్నాయో కొద్ది రోజుల్లో తేలనుంది. -
కాంగ్రెస్‌లో పదవుల చిచ్చు
భద్రాచలం, న్యూస్‌లైన్: జిల్లా కాంగ్రెస్‌లో పార్టీ పదవుల పందేరం చిచ్చు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకం విషయంలో చెలరేగిన వివాదం.. చివరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికే అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసేంత వరకు వచ్చింది. ఇది ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వనమాకు ఆయన వర్గమంతా వెన్నుదన్నుగా నిలిచింది. అవసరమైతే పీసీసీ పెద్దలను కలిసి, జరిగిన పరిణామాలను వివరించేందుకు వనమా వర్గీయులు సన్నద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకంపై తలెత్తిన వివాదం రాజధానికి చేరింది. పార్టీకి ఎంతోకాలంగా నిస్వార్థంగా సేవ చేస్తున్న తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఏకంగా షోకాజ్ నోటీస్ జారీ చేయడాన్ని డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నోటీసును ఆయన ‘పరాభవం’గా భావిస్తున్నారని, ఇదే విషయాన్ని ఆయన పార్టీ పెద్దల వద్ద చెప్పుకుని వాపోయారని తెలిసింది. తెలంగాణపై మంత్రుల బృందాన్ని కలిసేందుకని సోమవారం ఢిల్లీకి బయలుదేరుతున్న జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు.. అక్కడ పార్టీ పెద్దలతో భద్రాద్రి పంచాయితీపై కూడా చర్చించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ‘ఎమ్మెల్యే సత్యవతి రాద్ధాంతం సరికాదు..’ కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే సత్యవతి (కాంగ్రెస్) రాద్ధాంతం చేయడం సరికాదని ఆ పార్టీ డివిజన్ నాయకులు కొందరు అన్నారు. వారు ఆదివారం భద్రాచలంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆమె (సత్యవతి) ఏకపక్ష ధోరణి కారణంగానే సమస్య ఇంతవరకూ వచ్చిందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్టీ డివిజన్ కన్వీనర్ మైథిలిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన నక్కా ప్రసాద్ వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేశారని చెప్పారు. ఆ స్థానంలో తాండ్ర నర్సింహారావును వనమా నియమించారని చెప్పారు. ‘ఈ నియామకంపై డివిజన్లోని పార్టీ నాయకులతో కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ చర్చించారు. ఆ తరువాతనే, తాండ్ర నర్సింహారావును నియమించాలంటూ డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావుకు సిఫారసు లేఖ ఇచ్చారు. దాని ఆధారంగానే, పార్టీ పట్టణ అధ్యక్షుడిగా తాండ్ర నర్సింహారావును వనమా నియమించారు. అది కూడా.. పార్టీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పేర్కొంటూ ఉత్తర్వు ఇచ్చారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సత్యవతి ఇంత రాద్ధాంతం చేయటం సరికాదు’ అన్నారు. ‘పార్టీ పట్టణ అధ్యక్షుడిగా బొలిశెట్టి రంగారావును నియమించేప్పుడు డీసీసీ అధ్యక్షుడు వనమాతోగానీ, పార్టీ డివిజన్ బాధ్యతలు చూస్తున్న మాతోగానీ ఆమె చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన విషయం వాస్తవం కాదా..?’ అని వారు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, ఎమ్మెల్యే కుంజా సత్యవతి మధ్యనున్న ఆధిపత్య పోరులో వనమాను ఇరికించటం సరికాదని మైథిలిరెడ్డి అన్నారు. ‘వనమాకు ఇచ్చిన షోకాజ్ నోటీసును పార్టీ పెద్దలు వెంటనే ఉపసంహరించుకోకపోతే డివిజన్వ్యాప్తంగా ఉన్న పార్టీ కేడరంతా రాజీనామా చేస్తుంది’ అని ఆయన హెచ్చరించారు.