భద్రాచలం, న్యూస్లైన్: జిల్లా కాంగ్రెస్లో పార్టీ పదవుల పందేరం చిచ్చు మొదలైంది. కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకం విషయంలో చెలరేగిన వివాదం.. చివరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికే అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసేంత వరకు వచ్చింది. ఇది ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. వనమాకు ఆయన వర్గమంతా వెన్నుదన్నుగా నిలిచింది. అవసరమైతే పీసీసీ పెద్దలను కలిసి, జరిగిన పరిణామాలను వివరించేందుకు వనమా వర్గీయులు సన్నద్ధమవుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకంపై తలెత్తిన వివాదం రాజధానికి చేరింది. పార్టీకి ఎంతోకాలంగా నిస్వార్థంగా సేవ చేస్తున్న తనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా ఏకంగా షోకాజ్ నోటీస్ జారీ చేయడాన్ని డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నోటీసును ఆయన ‘పరాభవం’గా భావిస్తున్నారని, ఇదే విషయాన్ని ఆయన పార్టీ పెద్దల వద్ద చెప్పుకుని వాపోయారని తెలిసింది. తెలంగాణపై మంత్రుల బృందాన్ని కలిసేందుకని సోమవారం ఢిల్లీకి బయలుదేరుతున్న జిల్లాకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు.. అక్కడ పార్టీ పెద్దలతో భద్రాద్రి పంచాయితీపై కూడా చర్చించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
‘ఎమ్మెల్యే సత్యవతి రాద్ధాంతం సరికాదు..’
కాంగ్రెస్ పార్టీ భద్రాచలం పట్టణ అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే సత్యవతి (కాంగ్రెస్) రాద్ధాంతం చేయడం సరికాదని ఆ పార్టీ డివిజన్ నాయకులు కొందరు అన్నారు. వారు ఆదివారం భద్రాచలంలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఆమె (సత్యవతి) ఏకపక్ష ధోరణి కారణంగానే సమస్య ఇంతవరకూ వచ్చిందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్టీ డివిజన్ కన్వీనర్ మైథిలిరెడ్డి మాట్లాడుతూ.. గతంలో పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన నక్కా ప్రసాద్ వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేశారని చెప్పారు. ఆ స్థానంలో తాండ్ర నర్సింహారావును వనమా నియమించారని చెప్పారు. ‘ఈ నియామకంపై డివిజన్లోని పార్టీ నాయకులతో కేంద్ర మంత్రి బలరామ్ నాయక్ చర్చించారు. ఆ తరువాతనే, తాండ్ర నర్సింహారావును నియమించాలంటూ డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావుకు సిఫారసు లేఖ ఇచ్చారు. దాని ఆధారంగానే, పార్టీ పట్టణ అధ్యక్షుడిగా తాండ్ర నర్సింహారావును వనమా నియమించారు. అది కూడా.. పార్టీ గ్రామ పంచాయతీ అధ్యక్షుడిగా పేర్కొంటూ ఉత్తర్వు ఇచ్చారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సత్యవతి ఇంత రాద్ధాంతం చేయటం సరికాదు’ అన్నారు.
‘పార్టీ పట్టణ అధ్యక్షుడిగా బొలిశెట్టి రంగారావును నియమించేప్పుడు డీసీసీ అధ్యక్షుడు వనమాతోగానీ, పార్టీ డివిజన్ బాధ్యతలు చూస్తున్న మాతోగానీ ఆమె చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన విషయం వాస్తవం కాదా..?’ అని వారు ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బలరామ్ నాయక్, ఎమ్మెల్యే కుంజా సత్యవతి మధ్యనున్న ఆధిపత్య పోరులో వనమాను ఇరికించటం సరికాదని మైథిలిరెడ్డి అన్నారు. ‘వనమాకు ఇచ్చిన షోకాజ్ నోటీసును పార్టీ పెద్దలు వెంటనే ఉపసంహరించుకోకపోతే డివిజన్వ్యాప్తంగా ఉన్న పార్టీ కేడరంతా రాజీనామా చేస్తుంది’ అని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్లో పదవుల చిచ్చు
Published Mon, Nov 4 2013 2:41 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement