Vandana Shiva
-
ప్రకృతి రక్షకు స్త్రీ శక్తి..
వ్యవసాయ రంగంలో స్త్రీ శక్తి పెరిగిందా?! మనం ఎలా ఉండాలో.. ఏం తినాలో.. ఎలా జీవించాలో.. మార్కెట్ శక్తులు మనపైన పనిచేస్తున్నాయా?! పర్యావరణవేత్త, రచయిత, వక్త, సామాజిక కార్యకర్త అయిన డాక్టర్ వందనశివ డెహ్రాడూన్ నుంచి ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, పరిణామాలపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ మన దేశంలో సేంద్రీయ వ్యవసాయానికి ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. సేంద్రీయ ఆహార ఉద్యమంలో మార్గదర్శకులుగా ఉన్న మీరు ఈ విషయాన్ని ఎలా చూస్తారు? ఇది మంచి పరిణామం. అయితే, మన మూలాలను మర్చిపోయి చాలా ముందుకు వచ్చేశాం. ఇప్పుడు మళ్లీ మూలాలను వెతుక్కుంటూ వెళుతున్నాం. ఎవరు ఎంత సంపాదించినా ఆరోగ్యకరమైన జీవనం కోసమే కదా. మంచి ఆహారం వల్లే ఇది సాధ్యమని మనందరికీ తెలుసు. హరిత విప్లవంలో భాగంగా 1984లో వ్యవసాయ రంగంపై దృష్టిసారించినప్పుడు రసాయనాల వాడకం అంతగా లేదన్నది నిజం, కానీ, ఆ తర్వాత సంభవించిన పరిణామాలతో వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల జీవ వైవిధ్యం, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటూ వచ్చాయి. ఇటీవల కాలంలో దేశంలో క్యాన్సర్ వ్యాప్తి ఎంత వేగంగా పెరుగుతోందో మనకు తెలిసిందే. దీనితోపాటు పరిశ్రమల్లో తయారయ్యే ఇన్స్టంట్ ఫుడ్ ప్రజలపై మరీ హానికరమైన ప్రభావం చూపుతోంది. వేగంగా విజృంభించిన వ్యాధుల్లో డయాబెటిస్ కూడా ఒకటి. ఒక దేశ స్థితి అక్కడి వాతావరణం, ప్రజల ఆదాయం, ఆరోగ్యం.. ఈ మూడింటిపైన ఆధారపడి ఉంటుంది. నేటి సేంద్రియ వ్యవసాయ పద్ధతులన్నీ మన దగ్గర 10 వేల ఏళ్ల క్రితమే ఉన్నాయి. నీటి సదుపాయాలు తక్కువగా ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా దక్కన్ ఏరియా వ్యవసాయం నుంచి మిగతా రంగాలకు వలసపోయింది. ఇప్పుడిప్పుడు ఇతర రంగాల్లో ఉన్నవారూ వ్యవసాయరంగం వైపు చూస్తున్నారు. మనిషికి కావల్సింది ఆరోగ్యకరమై ఆహారం. దానిని తనే స్వయంగా పండించుకోవాలనే ఆలోచన పెరగడం శుభపరిమాణం. ప్రస్తుతం మార్కెట్‌ను సేంద్రీయ ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పులు చేసిన ఆహార ఉత్పత్తులు ముంచెత్తుతున్నాయి కదా... ఇవి మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి? నేను అర్థం చేసుకున్నదేంటంటే.. క్వాంటమ్ థియరీ ప్రకారం ప్రతీదానికి ఒక జెనోమ్ ఉంటుంది. ఉదాహరణకు మన శరీరంలోని ప్రతి భాగానికి ఒక సంపూర్ణత్వం ఉంటుంది. ఏ ఒక్క భాగానికి విఘాతం కలిగినా మిగతా వ్యవస్థ అంతా దెబ్బతింటుంది. అలాగే, జీవరాశి కూడా. ప్రపంచ మార్కెట్‌ను చూస్తే కార్న్, కనోలా, కాటన్, సోయా.. ఈ ఉత్పత్తులే. ఆహారం పైనే కాదు జీవనశైలిపైనా విపరీతమైన ప్రభావం చూపాయి. మన దేశంలో బీటీ పత్తి అతి పెద్ద డిజాస్టర్ అని చెప్పవచ్చు. సుమారు ఇరవై ఏళ్ల క్రితం తెలంగాణలో పత్తి పంట కారణంగా రైతుల ఆత్మహత్యలు చూశాం. ఆ సమయంలో రైతు ఆత్మహత్యలకు గల కారణాలేంటో తెలుసుకోవడానికి వరంగల్‌తో పాటు మిగతా ప్రాంతాలకూ వెళ్లాను. మొత్తం రసాయనాలే. అమెరికాలో అక్కడి వ్యవసాయం దాదాపు రైతుల చేతుల్లోనే ఉంటుంది. కానీ, మన దగ్గర అలా లేదు. జన్యుపరమైన మార్పుల వల్ల జంతుజాలంపై తీవ్ర ప్రభావం పడింది. పంట దిగుబడి పెరగడానికి అవలంబించే విధానాల వల్ల నిరంతర హాని జరుగుతూనే ఉంది. ఈ ప్రభావం నుంచి జీవవైవిధ్యాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? దేశీ విత్తనాలు. ఇప్పుడు రైతులు వేసే విత్తనాలన్నీ బహుళజాతి కంపెనీల చేతుల్లో ఉన్నాయి. అవన్నీ కెమికల్ సీడ్స్. ముందు దేశీ విత్తనాలు రావాలి. కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ పెరగాలి. విత్తనం గురించి ముందు మనం అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రియల్ సీడ్స్‌లో ఎలాంటి పోషకాలు ఉండవు అని గుర్తించాలి. మన ప్రాంత వాతావరణానికి అవి ఏ మాత్రం అనువైనవి కావు. దేశీ విత్తనాల అభివృద్ధిలో భాగంలో దేశవ్యాప్తంగా 150 కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేశాం. నాలుగు వేల వరివంగడాలు, 300 రకాల గోధుమ, మిల్లెట్స్.. దేశీ విత్తనాలలో పెద్ద మార్పు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే, ఆహారమే అతి పెద్ద ఆయుధం. దానిని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలిసుండాలి.. మనం తినే తిండి, విత్తనాన్ని మనకు మనంగా సాధించుకోవాలి. గ్రీన్ రెవల్యూషన్ రావాలి. ఇండస్ట్రియల్ ఫార్మింగ్ తగ్గాలి. ప్రభుత్వాలు స్థానికంగా రైతుల మార్కెట్లు ఏర్పాటు చేయాలి. ఎవరు పండిస్తున్నారో వారే అమ్ముకోగలగాలి. అంతేకాదు, వాటిని ఆ కుటుంబం కూడా తినగలగాలి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో అనారోగ్యకరమైన వంటనూనెలకు గాంధీజీ సూచించిన కట్టెగానుగ నూనె సరైన పరిష్కారమా? కచ్చితంగా! గానుగ నూనెలు, మిల్లు నూనెలను చూస్తే మనకే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది వేటిలో పోషకాలు ఉన్నాయి అనేది. సత్యాగ్రహకాలంలోనే గానుగ నూనె ల ప్రాధాన్యం గురించి గాంధీజీ సూచించారు. దీనిని కూడా మార్కెట్ శక్తులు మనపై పనిచేశాయి. విదేశీ కంపెనీలు మన గానుగ నూనెలు మంచివి కావని, ఫిల్టర్, పోషకాలు కలిసిన నూనెలు మంచివని నూరిపోశారు. తమ ఆదాయాలు పెంచుకోవడానికి పరిశ్రమలు వేసిన ఎత్తుగడలకు మనం బలయ్యాం. దానిని మనం గుర్తించాలి. మీ ‘నవధాన్య’ కేంద్రం ఏర్పాటు గురించి.. ప్రాంతాలవారీగా ఉన్న జీవరాశి అక్కడి వాతావరణ స్థితిగతులపైన ఆధారపడి మనుగడ సాగిస్తుంది. దేశంలోనే ప్రాంతాలవారీగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంట దిగుబడులను చూస్తుంటాం. వాటి మీద ఒక మనిషి మాత్రమే కాదు, అక్కడ ఉన్న సమస్త జీవరాశి మనుగడసాగిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ శక్తుల కారణంగా మన దేశీయ జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం నెలకొంది. మనవైన వేప, బాస్మతి, వరి, గోధుమలపై విదేశీ కంపెనీలు పెత్తనం చెలాయించాలని చూశాయి. వాటి హక్కులు పొందే ప్రయత్నాలను న్యాయపోరాటాల ద్వారా విజయవంతంగా తిప్పికొట్టాం. ఇవన్నీ గమనించే ‘నవధాన్య’ కేంద్రం ద్వారా దేశీ విత్తనాల పెంపునకు కృషి జరుగుతోంది. మీకు ఇష్టమైన ‘ఎకోఫెమినిజం’ గురించి. ప్రపంచంలో ఈ భావన ఎలా ఉంది? వ్యవసాయంలో ఏ ఇజం ఉండదనేదే నా అభిప్రాయం. అయితే, మనం భూమిని తల్లిగా భావిస్తాం. వందల ఏళ్ల క్రితం నుంచి మహిళ ఇలాంటి పనులను చేయలేరు అనే ఒక విధానం మన వ్యవస్థలో ఉండేది. ప్రకృతి శక్తి, స్త్రీ శక్తి స్వరూపిణి. ఈ రెండింటినీ విడదీయలేం. శక్తి చూపడంలో స్త్రీ అన్నింటా ముందుంటుంది. పైగా పిల్లల్ని, కుటుంబాన్ని కాపాడుకోవడంలో ఎప్పుడూ రక్షగా ఉండే స్త్రీ, ప్రకృతిలోని జీవరాశిని కాపాడటంలోనూ ముందుంటుంది. అందుకే సేంద్రీయ వ్యవసాయంలో మహిళ చాలా బాగా వర్క్ చేస్తోంది. ప్రకృతిలో జీవించే హక్కు, తనకు, కావల్సినవి సాధించుకునే శక్తి అన్ని జీవులకు ఉంటుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసినా ఆహారం, వ్యవసాయం రంగాల్లో మహిళల శాతం అధికంగా ఉంది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది. – నిర్మలారెడ్డి ఫొటో: మోహనాచారి -
పెట్టుబడిలేని సాగు పెద్ద దగా : వందనా శివ
సాక్షి, అమరావతి: పెట్టుబడి లేని వ్యవసాయం (జెడ్బీఎన్ఎఫ్) వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, రాష్ట్రంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిషేధించాలని ప్రముఖ పర్యావరణ వేత్త, రచయిత, సామాజిక కార్యకర్త డాక్టర్ వందనా శివ విజ్ఞప్తి చేశారు. పెట్టుబడి లేని వ్యవ సాయమనేది భారతదేశానికి కొత్తదేమీ కాదని, కొన్ని వేల ఏళ్ల కిందటి నుంచి ఉన్నదేనని వివరించారు. విత్తనంపైన, సాగుపైన గుత్తాధిపత్యాన్ని సాధిం చేందుకు కార్పొరేట్లు పన్నిన వలలో ఉద్దేశ పూర్వకంగానే చిక్కుకున్న కొందరు పెద్దలు ఈ విధానాన్ని తామేదో కొత్తగా కనిపెట్టినట్టు ప్రచారంచేయడాన్ని ఆమె ఖండించారు. పెట్టుబడి లేని వ్యవసాయానికి ప్రపంచ బ్యాంకు నుంచి పిఎన్ ఫరబాస్ అనే కార్పొరేట్ సంస్థ నుంచి వందల కోట్ల రూపాయలు నిధులు ఎందుకు తెచ్చి విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరులో ఏర్పాటు చేసిన మూడు రోజుల రైతు సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. 2022 నాటికి రాష్ట్రంలో ప్రకృతి సాగు పేరిట అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడంలో ఏ మాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు. 2022 నాటికి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయానికి కొత్త ఒరవడిని సృష్టించి దేశానికి దిక్చూచిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం జగన్ విధానాల వైపు దేశం వేచి చూస్తోందని చెబుతూ నవరత్నాలలో భాగంగా ప్రకటించిన వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రశంసించారు. రాష్ట్రంపై బహుళజాతి సంస్థల పంజా... నక్కలాంటి బహుళజాతి విత్తన కంపెనీలు ఇప్పుడు ఆంధ్రాను ఆక్రమింపిజూస్తున్నాయని, వారి ఆటలు సాగకుండా చూసి రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత జగన్‌పై ఉందని వందనా శివ అన్నారు. మోన్శాంటో లాంటి సంస్థలపై పోరాడిన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకించి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉందని గుర్తు చేశారు. సందర్భంగా ఆమె రైతు రక్షణ వేదిక ప్రచురించిన ’రైతుల విత్తన హక్కుపై కంపెనీల దాడి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. -
ఆ క్షేత్రమే సేంద్రియ విశ్వవిద్యాలయం!
‘నవధాన్య’.. ఈ పేరు మన దేశంలో జీవవైవిధ్యంతో కూడిన సేంద్రియ సేద్యం గురించి తెలిసిన వారికెవరికైనా చటుక్కున స్ఫురణకు వస్తుంది.. ‘నవధాన్య’ అనగానే వెంటనే మదిలో మెదిలే రూపం సుప్రసిద్ధ శాస్త్రవేత్త, సంప్రదాయ విత్తన హక్కుల పరిరక్షణ ఉద్యమకారిణి డాక్టర్ వందనా శివ.. మూడు దశాబ్దాలుగా మన దేశంలో వివిధ దేశీ ఆహార పంటలకు సంబంధించి కనీసం 6 వేల సంప్రదాయ వంగడాలను సేకరించి, కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రముఖ సంస్థ ఇది.. ‘నవధాన్య’ జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయానికి, లోతైన శాస్త్రీయ పరిశోధనలకు పట్టుగొమ్మ.. భారతీయ పాత పంటల జీవవైవిధ్య వైభవానికి తలమానికంగా విరాజిల్లుతున్న ‘నవధాన్య’, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు సమీపంలో, హిమాలయాల చెంతన సముద్ర తలానికి 500 మీటర్ల ఎత్తున కొలువై ఉంది.. ఇటీవల ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు డెహ్రాడూన్‌లోని ‘నవధాన్య’ క్షేత్రంలో పంటల వైవిధ్యాన్ని, విత్తన భాండాగారాన్ని దర్శించారు. నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ భట్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. నవధాన్యాలు.. అంటే తొమ్మిది రకాల విత్తనాలు. నవధాన్యాలకు మన సంప్రదాయంలో విశిష్ట ప్రాధాన్యం ఉన్న సంగతి మనకు తెలిసిందే. జీవవైవిధ్య పరిరక్షణకు, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా డా. వందనా శివ ‘నవధాన్య’ను 1987లో డెహ్రాడూన్‌లో నెలకొల్పారు. 1991లో ఇది ట్రస్టుగా మారింది. వేలాది ఏళ్లుగా మన భూముల్లో విరాజిల్లుతున్న సంప్రదాయ విత్తన వంగడాలను ప్రాణప్రదంగా పరిరక్షించుకోవడం.. విత్తన జ్ఞానాన్ని పదిలపరచుకోవడం.. అంతిమంగా మన విత్తనాలతో కూడిన ఆహార స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడం.. జీవవైవిధ్య సేంద్రియ సేద్యాన్ని చిన్న రైతులకు అందించడం, వారికి సముచితమైన ఆదాయాన్ని అందించే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయటం.. స్థూలంగా ఇవీ నవధాన్య లక్ష్యాలు. నవధాన్య ప్రధాన కేంద్రం డెహ్రాడూన్ అయినప్పటికీ దేశంలో మరో రెండు చోట్ల ఉప కేంద్రాలున్నాయి. నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ భట్ ఇలా అన్నారు.. ‘ఇప్పటికి మొత్తం 6 వేల దేశీ పంటల విత్తనాలను పరిరక్షించాం. 22 రాష్ట్రాల్లో 127 సామాజిక విత్తన నిధులను ఏర్పాటు చేశాం. వేప, బాస్మతి వరి, గోధుమలపై విదేశీ కంపెనీలు మేధోపరమైన హక్కులు పొందే ప్రయత్నాలను న్యాయపోరాటం ద్వారా విజయవంతంగా తిప్పికొట్టాం. ఇప్పటికి సుమారు 10 లక్షల మంది చిన్న రైతులు, విత్తన సంరక్షకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల సిబ్బందికి, దేశ విదేశీ కార్యకర్తలు, శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చాం. 20 లక్షల ఎకరాలను సేంద్రియ వ్యవసాయంలోకి మళ్లించాం. ఈ రైతుల సాగు ఖర్చును 30%కు తగ్గించి, దిగుబడులు 3 రెట్లు పెంచాం. అంతేకాదు, 40 వేల మంది చిన్న రైతులను కూడగట్టాం. దేశంలోకెల్లా మొదటిగా ఇందుకోసం ‘ఫెయిర్ ట్రేడ్ నెట్వర్క్’ను నెలకొల్పాం. వారి సేంద్రియ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలోనే విక్రయిస్తూ, వారికి గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా చేశాం. మోహన్ సింగ్ అనే ఓ రైతు ఎకరంలో అనేక పంటలు కలిపి సాగు చేసి 2013లో రూ. 80,300 ఆదాయం పొందారు...’ అని అన్నారు. డెహ్రాడూన్‌లోని నవధాన్య సేంద్రియ వ్యవసాయ క్షేత్రం వయసు 30 ఏళ్లు. 45 ఎకరాల విస్తీర్ణం. చిన్న, చిన్న కమతాలలో ఎన్నో పంటలను కలిపి, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. వరిలో తప్ప ఇతర పంటలన్నీ మిశ్రమ పంటలే. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు.. అన్నిటినీ కలిపే సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా అపురూపమైన ఈ వంగడాలను సాగు చేస్తూ.. విత్తనాలు సేకరించి భద్రపరుస్తున్నారు. రైతులకు ఇస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులను ఢిల్లీ తదితర చోట్ల విక్రయిస్తున్నారు. అమూల్యమైన ఈ దేశీ వంగడాల విత్తనాలను సంప్రదాయ పద్ధతుల్లో ఇక్కడి విత్తన నిధిలో భద్రపరిచారు. 2017లో ఈ క్షేత్రంలో 1,722 వంగడాలున్నాయి. ఇందులో వరి 730, బాసుమతి 41, గోధుమ 212, కూరగాయలు 158, రాజ్మా 130, పప్పుధాన్యాలు 97, నూనెగింజ రకాలు 54, ఆవ 22, కొర్ర 21, మొక్కజొన్న 20, అమరంత్ 3, ఓట్స్ 19, రాగి 30, పచ్చిరొట్ట పంటలు 17, సుగంధ ద్రవ్యాలు 58, ఔషధ మొక్కలు 47.. రకాల పంటలను సాగు చేసి, ఆ విత్తనాలను విత్తన నిధిలో ఉంచారు. ఏక దళ, ద్విదళ పంటలను కలిపి సాగు చేయటం, దేశీ విత్తనాలను భద్రపరచటంతోపాటు.. సేంద్రియ సేద్యం వల్ల దిగుబడులు ఎలా ఉన్నాయి? భూసారం పెరుగుతోందా తగ్గుతోందా? రసాయనిక ఎరువులు వేసే భూముల్లో భూసారం ఎలా ఉంది? వంటి ఆసక్తికరమైన అంశాలపై శాస్త్రీయ పద్ధతిలో తులనాత్మక అధ్యయనాలు చేయటం ‘నవధాన్య’ ప్రత్యేకత. ఇందుకోసం డెహ్రాడూన్ నవధాన్య క్షేత్రంలో 2000లోనే సాయిల్ ఎకాలజీ ల్యాబ్‌ను నెలకొల్పి ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతున్నారు. 2014–15లో 5 రాష్ట్రాల్లో డాక్టర్ వందనా శివ ఆధ్వర్యంలో చేసిన ఒక అధ్యయనంలో రసాయనిక వ్యవసాయంలో కన్నా సేంద్రియ వ్యవసాయంలో దిగుబడులు వివిధ పంటల్లో 0.85% నుంచి 106.25% వరకు పెరిగాయని తేలింది. రసాయనిక సేద్యంలో ఒకే పంట సాగు వల్ల భూముల్లో సేంద్రియ పదార్థం నిర్దిష్ట కాలంలో 14% తగ్గిపోగా, అదేకాలంలో సేంద్రియ మిశ్రమ పంటలు సాగు చేయటం వల్ల 29–99% వరకు పెరిగిందని నవధాన్య జరిపిన మరో అధ్యయనంలో నమోదైంది. సేంద్రియ/రసాయనిక వ్యవసాయం వల్ల కలిగే ఫలితాలను గురించి విశ్లేషించినప్పుడు భూసారం, ఉత్పాదకత, ఆదాయం వంటి విషయాల గురించే సాధారణంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. అయితే, నవధాన్య అంతటితో సంతృప్తి చెందలేదు. ఎకరానికి సేంద్రియ/రసాయనిక పద్ధతుల్లో ఎంతెంత పరిమాణంలో వివిధ రకాల పోషక పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయో కూడా సశాస్త్రీయంగా అధ్యయనం చేసి, నివేదిక(హెల్త్ పర్ యాకర్)ను ప్రచురించడం విశేషం. సేంద్రియ పద్ధతిలో మిశ్రమ పంటల సాగు(సేంద్రియ పద్ధతుల్లో పొలం అంతటా ఒకే పంటను సాగు చేయడం కూడా అనర్థమే) వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికే మేలు కలగడమే కాదు.. అధిక పరిమాణంలో పోషక పదార్థాల దిగుబడి, తద్వారా ఆకలిని, పౌష్టికాహార లోపాన్ని పారదోలటం కూడా ఈ వ్యవసాయ పద్ధతితోనే సాధ్యమవుతుందని ఈ అధ్యయనం రుజువు చేసిందని చెప్పొచ్చు. ‘దేశీ వరి వంగడాల్లోనూ ఔషధ గుణాలున్నాయి. అయితే, చిరుధాన్యాలను ప్రధానాహారంగా తినటం ద్వారా పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అధిగమించవచ్చు. చిరుధాన్యాల పైనుంచి మన దృష్టి మళ్లించేందుకే బ్రిటిష్ పాలకులు వీటికి జంతువుల పేర్లతో (ఉదా.. కొర్రలకు ఫాక్స్‌టెయిల్ మిల్లెట్, ఉలవలకు హార్స్‌గ్రామ్..) పేరు పెట్టి ఉంటారు. ఇది కుట్ర పూరితంగానే జరిగింది..’ అని నవధాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భట్ వ్యాఖ్యానించారు. జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తన పరిరక్షణ, చిన్న రైతును ఫోకస్‌లోకి తేవడంలో 30 ఏళ్ల క్రితమే ముందు నడచిన సంస్థగా అత్యంత శ్లాఘనీయమైన కృషి చేస్తున్న ‘నవధాన్య’ దిన దిన ప్రవర్థమానం కావాలని ‘సాక్షి సాగుబడి’ ఆకాంక్షిస్తోంది! సేంద్రియ సేద్యం భూమికి బలం! ఐదు అంతకన్నా ఎక్కువ ఏళ్ల నుంచి సేంద్రియ, రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్న పొలాల్లో భూసారం స్థితిగతులు ఎలా మారాయన్న అంశంపై డెహ్రాడూన్‌లోని నవధాన్య జీవవైవిధ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ గత ఏడాది ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. ఈ రెండు రకాల వ్యవసాయ పద్ధతుల వల్ల ఆయా భూముల్లో సూక్ష్మజీవరాశి, పోషకాల స్థాయిల్లో ఎలాంటి మార్పులొచ్చాయో ఉత్తరాఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రల్లోని వివిధ భూముల్లో శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. సేంద్రియ వ్యవసాయ భూముల సారం పెరిగిందని, రసాయనిక వ్యవసాయ భూముల్లో సారం తగ్గిపోయిందని తేలింది(శివ 2017). ఈ పట్టిక చూస్తే సేంద్రియ వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థం, నత్రజని, పొటాషియం తదితర పోషకాలు పెరిగిన సంగతి, రసాయనిక వ్యవసాయ భూముల్లో తగ్గిపోయిన సంగతి అర్థమవుతుంది. నేలతల్లికి వందనం.! సముద్ర తలం నుంచి 500 మీటర్ల ఎత్తులో నవధాన్య డెహ్రాడూన్ వ్యవసాయ క్షేత్రం ఉంది. జీవవైవిధ్య సేంద్రియ సేద్యం 30 ఏళ్లుగా చేస్తున్న ఆ భూమి జీవజీవాలతో సుసంపన్నంగా విరాజిల్లుతోంది. సేంద్రియ కర్బనం 1.6(తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం 0.5–0.2 మధ్యలో ఉన్నట్లు ఒక అంచనా!), సేంద్రియ పదార్థం 6.5, ఉదజని సూచిక 7గా ఉందని నవధాన్య సాయిల్ ఎకాలజీ ల్యాబ్ నిర్వాహకురాలు భువనేశ్వరి తెలిపారు. 1996లో ఇక్కడ 120 అడుగుల్లో భూగర్భ జలాలు ఉండేవి. 20 ఏళ్లలో నీటి మట్టం 40 అడుగులకు పెరిగాయి. భూమిలో సేంద్రియ కర్బనం, సేంద్రియ పదార్థం పెరుగుతున్న కొద్దీ నీటì తేమను పట్టుకునే శక్తి భూమికి పెరుగుతుంది. తద్వారా నీటి వినియోగం తగ్గిపోతుంది. ఆ విధంగా ఈ క్షేత్రంలో పంటల సాగుకు 20 ఏళ్లలో నీటి వినియోగం 60% తగ్గిందని భట్ వివరించారు. నవధాన్య క్షేత్రం వరి పంట డెహ్రాడూన్ నవధాన్య క్షేత్రంలో వానపాముల విసర్జితాల కనువిందు విత్తన నిధిలో వేలాడదీసిన విత్తన కంకులు డబ్బాల్లో భద్రపరచిన విత్తనాలు డెహ్రాడూన్‌లోని నవధాన్య వ్యవసాయ క్షేత్రం విశిష్టతలను వివరిస్తున్న నవధాన్య ప్రతినిధి భువనేశ్వరి www.navdanya.org -
నవంబర్ 5న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: విరాట్ కోహ్లీ (క్రికెటర్), వందనా శివ (పర్యావరణ కార్యకర్త) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్ర సంఖ్య కావడం వల్ల చక్కటి రూపం, శారీరక సౌష్టవంతో సృజనాత్మకత, కళాత్మక హృదయం, అందరితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి సంపన్న జీవితం గడుపుతారు. ఈ సంవత్సరమంతా ఉత్సాహవ ంతంగా ఉంటుంది. కొత్త వాహనాలు కొంటారు. విలువైన వస్త్రాభరణాలకి ఖర్చు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో పడతారు. సంఘంలో గౌరవం, ఆర్థిక ఉన్నతి, రాజకీయాలలో ఉన్న వారికి పదవీప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులు ఆగిపోయిన చదువును కొనసాగిస్తారు. పోటీపరీక్ష లలో విజయాన్ని, మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. అలంకారాలు, ఇంటీరియర్ డెకరేషన్‌కు ప్రాధాన్యత ఇస్తారు.పుట్టిన తేదీ 5. ఇది బుధ సంఖ్య కావడం వల్ల మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, కలిగి ఉంటారు. కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం లేదా కొత్త కోర్సులు చే యడం జరుగుతుంది. నెమ్మదిగా నడుస్తున్న ప్రాజెక్టులను వేగవంతం చేయడం లేదా లాభాల బాటలో పడేటట్లు చేస్తారు. ఉద్యోగులు వ్యాపారాన్ని లేదా కొత్తప్రాజెక్టుని ఆరంభిస్తారు. మీడియా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3,5,6; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, పర్పుల్, రెడ్, ఆరంజ్, ఎల్లో; లక్కీడేస్: సోమ, బుధ, గురు, శుక్ర, ఆదివారాలు; సూచనలు: అహంకారాన్ని, ఆవేశపూరిత నిర్ణయాలను విడనాడడం, పేదవిద్యార్థులకు కావలసిన టూల్‌కిట్స్ కొనిపెట్టడం, లక్ష్మీ అష్టోత్తరాన్ని, విష్ణుసహస్రనామాలను పారాయణ చేయడం. పేదకన్యల వివాహానికి తగిన సాయం చేయడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఆర్టికల్ 3జేపై కుట్రను అడ్డుకోవాలి
బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి ఆహార భద్రత చట్టం అవసరం ప్రొఫెసర్ వందనాశివ డిమాండ్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం: విత్తనంపై రైతులకు హక్కును కల్పించే ఆర్టికల్ 3జేను మార్చేందుకు కొన్ని బహుళజాతి కంపెనీలు కుట్ర పన్నుతున్నాయని శాస్త్ర సాంకేతిక పర్యావరణ విజ్ఞానం జాతీయ కేంద్రం డెరైక్టర్ ప్రొఫెసర్ వందనా శివ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతుల విత్తన హక్కుల రక్షణ వేదిక, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ‘విత్తన సార్వభౌమత్వం, భారత స్వాతంత్య్రం-రాజ్యం, ప్రజా సంఘాల పాత్ర’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ వందనాశివ మాట్లాడుతూ ఆర్టికల్ 3జేను మార్చకుండా రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మాన్షంటో కంపెనీ ప్రపంచంలో వ్యవసాయాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందని విమర్శించారు. పత్తి విత్తనాలు, మొక్క జొన్నపై మాన్షంటో కంపెనీకి సంపూర్ణ హక్కు ఉందని, అయితే అవి ఆహార పంటలు కాదన్నారు. బీహార్‌లో 56 ఎకరాలకు మొక్కజొన్న విత్తనాలను సరఫరా చేస్తే పూర్తిగా నష్టం వచ్చిందని, ఐతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించింది తప్ప కంపెనీ కాదని విమర్శించారు. కొన్ని నేలల్లో ఉపయోగకరమైన సూక్ష్మజీవులున్నాయని, వాటిని జన్యుపరమైన పంటలే నాశనం చేశాయన్నారు. జర్మనీలో బీటీ మొక్క జొన్నలు వేస్తే వాటిని తిన్న ఆవులు రోగాల భారిన పడ్డాయని, అక్కడ ఆవులను పిండితే పాలకు బదులు రక్తం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మన దేశంలో వేసిన పార్లమెంటరీ కమిటీ కూడా జన్యు మార్పిడి పంటలను వ్యతిరేకించిందన్నారు. ఆహార భద్రత పేరుతో చట్టం రావాలని ఆమె కోరారు. బహుళజాతి కంపెనీలకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. వ్యవసాయ శాస్త్ర వేత్త ప్రొఫెసర్ కె.ఆర్.చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ అరిబండి ప్రసాద రావు, రెలంగాణ రాష్ర్ట రైతు సంఘం కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు పి.జంగారెడ్డి, అఖిల భారత రైతు కూలి సంఘం నాయకులు వి.కోటేశ్వర్రావు, వి.ప్రభాకర్, కె.రంగయ్య, కెజి.రాంచందర్ పాల్గొన్నారు.