Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఈ మహోత్సవానికి దేశవిదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో చూసినా పొడవైన ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది.కుంభమేళా(Kumbh Mela)కు వచ్చిన భక్తులు రాష్ట్రంలోని అయోధ్య, వారణాసి, మధుర తదితర ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో ఈ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ఆలయాల్లో కాలుమోపేందుకు కూడా స్థలం కనిపించని విధంగా ఉంది. ఆదివారం(ఫిబ్రవరి 9) సెలవు దినం కావడంతో లెక్కకుమించినంతమంది భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. కుంభమేళాకు వచ్చినవారిలో చాలామంది అయోధ్యను సందర్శిస్తున్నారు. దీంతో అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ ట్రస్ట్ పలు ఏర్పాట్లు చేసింది.భక్తుల రద్దీ కారణంగా అయోధ్యలో విపరీతమైన ట్రాఫిక్ జామ్(Traffic jam) ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ విభాగం వాహనాలను నియంత్రించేందుకు పలు ప్రయత్నాలు చేసింది. ఈ నేపధ్యంలో పలు సమస్యలు తలెత్తాయి. ఇదేవిధంగా యూపీలోని సుల్తాన్పూర్లో కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక్కడి నుంచి భారీసంఖ్యలో జనం కుంభమేళాకు తరలివెళుతుండటంతో నేషనల్ హైవే వాహనాలతో నిండిపోయింది. ట్రాఫిక్ ఏమాత్రం ముందుకు కదలకపోవడంతో పలుచోట్ల ప్రయాణికులు ఆందోళనకు దిగారు.మధురలోని బృందావనం(Vrindavan in Mathura) కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం నాడు మధురకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించినవారంతా నేరుగా మధురకు చేరుకుని, శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో మధురలో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. ఇదే తరహాలో వారణాసిలోనూ భక్తుల కోలాహలం కనిపించింది. కాశీలోని అన్ని గల్లీలు భక్తులతో నిండిపోయాయి. ఇక్కడి అన్ని ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇది కూడా చదవండి: భలే కుర్రాడు.. ఆన్సర్ షీట్లో ఆ ఒక్క ముక్క రాసి..