గణనాథుని రథోత్సవ వైభవం
కాణిపాకం : కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం స్వామివారికి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి మూలవిరాట్‌కు సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. మూల విగ్రహన్ని సుగంధ పరి మళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ఉదయం సర్వాలంకార భూషితులైన సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అన్వేటి మండపంలో ఉం చి విశేష సమర్పణ చేశారు.
ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య ఆలయం నుంచి ఉరేగింపుగా తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై అధిష్టింపచేశారు. కాకర్లవారిపల్లికి చెందిన ఎతిరాజులునాయుడు కుమార్తె మీనాకుమారి, కాణిపాకానికి చెందిన పూర్ణచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి కుమారులు హరిప్రసాద్ రెడ్డి ఉభయదారులుగా వ్యవహరిం చారు. ఉభయదారుల ఉభయం వచ్చిన అనంత రం స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మధ్యాహ్నం 3గంటలకు రథోత్సవా న్ని ప్రారంభించారు. అశ్వాలు, వృషభాలు సర్వసైన్యాధిపతులు ముందు వెళుతుండగా స్వామివారు రథంపై కాణిపాకం వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు రథంపై బొరుగులు, మిరియాలు, చిల్లరనాణేలు చల్లి మొక్కు లు తీర్చుకున్నారు. రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకొంది. ఈఓ పూర్ణచంద్రరావు ఆలయ ఏఈఓలు ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఉభయదారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలు, కీలు గుర్రాలు, జానపద నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.