వరికోల్‌కు 400 డబుల్ బెడ్రూం ఇళ్లు
హన్మకొండ : జిల్లాపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక ప్రేమ చూపించారు. అదనంగా 400 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారు. పరకాల మండలం వరికోల్ గ్రామంలో పేదలకు 400 ఇళ్లను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గ్రామానికి చెందిన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ ఇళ్లు మంజూరు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో పేదలకు డబుల్ బెడ్రూం పథకం విశేష ఆదరణ పొందింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం పేదల నుంచి లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 400 వంతున డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించింది. దశల వారీగా ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.
వరికోల్ గ్రామాన్ని ప్రత్యేకంగా పరిగణించి ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కేసీఆర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు కారణమైన వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న ఓటర్లంతా టీఆర్ఎస్కు మద్దతు తెలపాలని నిర్ణయించారు. పోలింగ్ సందర్భంగా వంద శాతం ఓట్లు టీఆర్ఎస్కే వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ గ్రామానికి 400 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి.