జ్ఞానమే ఉపనిషత్సారం
వారుణీవిద్యనే బ్రహ్మవిద్య అని కూడా అంటారు. ఇది హృదయాకాశంలో నెలకొని ఉంటుంది. ఇన్ని తపస్సులతో బ్రహ్మాన్వేషం చేసి బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు ఆ ఆనందాన్ని పొందుతాడు. అతడికి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. మంచి సంతానం, గో సంపద, బ్రహ్మవర్ఛస్సు, గొప్పకీర్తి లభిస్తాయి. ఆనందమే బ్రహ్మం అని తెలిసింది కదా అని అన్నాన్ని నిందించకూడదు. అన్నం నుంచే అన్వేషణ మొదలౌతుంది. అన్నంతోనే ప్రాణం నిలుస్తుంది. ప్రాణం శరీరంలోనే ఉంటుంది కనుక శరీరానికి అన్నం కావాలి. అన్నాన్ని చులకనగా చూడకూడదు. నీరే అన్నం. అన్నాన్ని కడుపులోని అగ్ని స్వీకరిస్తుంది. నీటిలో అగ్ని, అగ్నిలో నీరు ఉంటాయి. అన్నం అన్నంలోనే ఉంటుందని తెలుసుకున్నవాడికి అన్నం, సంతానం, పశుసంపద, బ్రహ్మవర్ఛస్సు, కీర్తి అన్నీ వచ్చేస్తాయి.
అన్నం బహుకుర్వీత. ఆహారాన్ని బాగా పండించండి. ఈ భూమి అంతా అన్నమే. ఈ అన్నాన్ని ఆహారం భుజిస్తుంది. ఆకాశం భూమిలో ఉంది. భూమి ఆకాశంలో ఉంది. అన్నం అన్నంలో ఉంది. అన్నంకోసం వచ్చినవారిని పెట్టకుండా పంపకండి. ఇది మానవులందరి వ్రతం. అందరికీ అన్నం పెట్టడానికి ఆహారాన్ని బాగా ఉత్పత్తి చేయండి. దానికోసం ఎంతైనా కష్టపడండి. ఎవరు ఎప్పుడు వచ్చినా ఆహారం ఇవ్వగలిగి ఉండండి. ఎక్కువ ఆహారాన్ని పండించడానికి ఎక్కువగా, తక్కువగా పండించినవాడికి తక్కువగా అన్నం దొరుకుతుంది. బాగా పండించి అన్నదానం చేయండి.
ఇది తెలుసుకున్నవాడికి అన్నానికి, సంపదకు లోటు ఉండదు. అతని వాక్కులో క్షేమంగా, ప్రాణాపానాల్లో యోగక్షేమాలుగా, చేతుల్లో పనిగా, కాళ్లల్లో నడకగా, విసర్జకావయవంగా పరమాత్మ ఉంటాడు. వర్షంలో తృప్తిగా, విద్యుత్తులో శక్తిగా, పశువుల్లో కీర్తిగా, నక్షత్రాల్లో వెలుగుగా, జననేంద్రియాల్లో ఉత్పత్తికి అవసరమైన ఆనందంగా, ఆకాశంలో సర్వం తానుగా పరమాత్మ ఉంటాడు. ఇది తెలుసుకున్నవాడు ఆ వెలుగును ఉపాసించి తనలోని పరమాత్మను దర్శించగలుగుతాడు. అన్నిటికీ అతీతుడు అవుతాడు. అన్నాన్ని నేనే; స్వీకర్తనూ నేనే. ఈ సత్యాన్ని తెలుసుకున్నదీ నేనే. ఈ విశ్వభువనమంతా వ్యాపించి ఉన్నదీ నేనే. కాంతిమయ జ్యోతిని నేనే అనే విజ్ఞానంతో ఆనందమయుడు అవుతాడు. ఇదే భృగువల్లిలో తైత్తిరీయోపనిషత్తు సందేశం.
ఐతరేయం: వేదాలలో మొదటిదైన ఋగ్వేద ఉపనిషత్తులలో మొదటిది ఐతరేయం. ఓం వాఙ్మే మనసి ప్రతిష్ఠితా.. (వాక్కు నా మనసుల్లో ప్రతిష్ఠితం) అనేది శాంతిమంత్రం. ఈ ఉపనిషత్తు పరమాత్మ సృష్టిని ప్రారంభించడం ఎలా జరిగిందో వర్ణిస్తుంది. ప్రాణుల అవయవాలు, మానవ సృష్టి, ఆకలి దప్పులు, ఆహార సృష్టి, ఆహారం వెంట మానవుడు పరుగెత్తడం, అపానవాయువు ద్వారా ఆహారాన్ని పట్టుకోవడం, మానవులకు తోడుగా ఉండటానికి పరమాత్మ మానవుడి నడినెత్తిని చీల్చుకొని, కన్ను, హృదయం, కంఠస్థానాల్లో నివాసం ఏర్పరచుకోవడం, అతణ్ణి ఇంద్రుడుగా పిలవడం మొదటి అధ్యాయం. వీర్యోత్పత్తి, స్త్రీ గర్భంలో శిశువుగా మారటం, సంతానోత్పత్తి, గర్భకోశంలో జరిగే మార్పులు, నిరాకార పరమాత్మ సాకారంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా మారిన వైనం అంతా రెండో అధ్యాయంలో చెప్పిన ఐతరేయ ఉపనిషత్తు సుప్రసిద్ధం.
ఛాందోగ్యోపనిషత్తు: ఎనిమిది ప్రపాఠకాలతో నూట ఏభై ఆరు ఖండాలుగా ఉన్న ఈ ఉపనిషత్తు ‘ఓంకారం, ఉద్గీథోపాసన, దానివిధానం, దానితో ముక్తిని వివరిస్తుంది. మానవదేహంలోని అవయవాలు, ప్రాణాలు, పంచభూతాలు అన్నీ ఓంకారమయమే. ప్రాణులన్నీ తమకు తెలియకుండానే ప్రాణాయామం, ఉద్గీథోపాసన చేస్తున్నాయి. పంచవిధ సామగానం, సప్తవిధ సామగానం, అగ్నిలో ఉద్భవించే రధంతర సామ, హింకార ఉద్గీథ సమ్మేళనం. వైరూప, వైరాజ, శక్వరీ, వేవంతీ, యజ్ఞయజ్ఞీయ, రాజస సామగానాలు, పశుసంపదకోసం, యజ్ఞంకోసం చేయవలసిన సామగానాలు, సూర్యకిరణాల్లో ఉండే మధునాడులు, సూర్యగమన విశేషాలు, పరబ్రహ్మస్వరూపం, విశ్వానికున్న దిక్కులు (జుహూ, సహమాన, రాజ్ఞీ, సుభూత) ఇవి మనకు తూర్పు, దక్షిణ, పడమర ఉత్తరాలయ్యాయి.
యజ్ఞపురుష స్వరూపం మొదలైన ఎన్నో విషయాలను అందించే ఈ మహోపనిషత్తులో చాలా కథలు ఉన్నాయి. చాలామంది రుషులు, గురుశిష్యుల సంభాషణలు, సంవాదాలు ఉన్నాయి. సత్యకామ జాబాలి కథ పరమాద్భుతం. ఉపకోసలుని యజ్ఞవిద్య, శ్వేతకేతు ప్రవాహణ సంవాదం, పంచాగ్ని విద్య, గౌతముడు, ఉపమన్యువు, ఋషుల కుమారుల ఆత్మాన్వేషణ, అశ్వపతి మహారాజు ప్రవచనం, నారద సనత్కుమార సంవాదం, బ్రహ్మ ప్రజాపతికి, ప్రజాపతి మనువుకు చెప్పిన ఆత్మజ్ఞానం అన్నీ సంభాషణలుగా దీనిలో చూడవచ్చు.
ఈ భూమి అంతా అన్నమే. అన్నం నుంచే అన్వేషణ మొదలవుతుంది. అన్నంతోనే ప్రాణం నిలుస్తుంది. ప్రాణం శరీరంలోనే ఉంటుంది కనుక శరీరానికి అన్నం కావాలి. అన్నాన్ని చులకనగా చూడకూడదు. అన్నాన్ని కడుపులోని అగ్ని స్వీకరిస్తుంది. నీటిలో అగ్ని, అగ్నిలో నీరు ఉంటాయి.
బృహదారణ్యకోపనిషత్తు: ఇది అయిదు అధ్యాయాల్లో నలభై ఆరు బ్రాహ్మణాలుగా విస్తరించింది. ఇది శుక్ల యజుర్వేదానికి చెందినది. శతపథ బ్రాహ్మణంలోని చివరి ఆరు అధ్యాయాలే ఈ ఉపనిషత్తు. ఇందులో ఆరణ్యకం, ఉపనిషత్తు కలిసే ఉంటాయి. సృష్టి, పరబ్రహ్మ తత్వం, మరెన్నో విషయాలు, సంవాదాలు, సంభాషణల రూపంలో ఎన్నో లౌకిక, వేదాంత విషయాలు, ప్రకాంతి పరిశీలన, పరిశోధన రూపంలో తెలుస్తాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన పాపపుణ్యాల విభాగం, దానివల్ల మానవదేహంలో జరిగిన మార్పులు, మరణానంతర సమాచారం, యాజ్ఞవల్క్య మహర్షి చెప్పిన అనేక విషయాలు తప్పక చదివి తీరాలి. ఎందరో ఋషుల పేర్లు దీనిలో కనిపిస్తాయి. యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి ఉపదేశించిన మోక్షవిజ్ఞానం, దమం, దానం, దయాగుణాల ఆవశ్యకత, ప్రాణోపాసన, గాయత్రీమంత్ర విశిష్టత, జ్ఞానేంద్రియాల మధ్య ఘర్షణ, ప్రాణం తీర్పు చెప్పటం, దాంపత్యంలో భార్యాభర్తల ఇష్టానిష్టాలు, సంతానోత్పత్తి, జననం, నామకరణం మొదలైనవి ఎలా చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? మొదలైన సూచనలన్నీ దీనిలో ఉన్నాయి.
- డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ (ఈ శీర్షిక ఇంతటితో ముగిసింది)