'శ్రీ పంచమి'కి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ రోజే అక్షరాభ్యాసాలు ఎందుకు?
ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండుగలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో శ్రీపంచమి ఒకటి. మాఘ శుద్ధ పంచమినాడు ఈ పండుగను జరుపుకుంటారు. దీనిని సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా అంటారు. ఇది రుతు సంబంధమైన పర్వం. వసంత రుతువుకు స్వాగతం పలికే పండుగగా శాస్త్రాలలో పేర్కొనబడింది. వసంత రుతువు రాకను భారతదేశమంతటా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. "మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది కనుక ఈ మాఘ శుద్ధ పంచమిని ‘వసంత పంచమి’గా వ్యవహరిస్తారు. అయితే ఈ పంచమినే రకరకాల పేర్లతో పిలుస్తారు. ఎందుకని? ఈ తిథికి ఎందుకంత ప్రాముఖ్యత?
రుతు సంబంధమైన పండుగ కావడంతో, దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పర్వదినాన్ని 'శ్రీపంచమి', 'మదన పంచమి', 'సరస్వతీ జయంతి' అనే పేర్లతోనూ పిలుస్తారు. మకర సంక్రాంతి తరవాత వసంత రుతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. చెట్లు చిగురించడం, పూలు పూయడం వంటి శుభ సంకేతాలు ఇదే రుతువులో ఆరంభమవుతాయి. వసంతుడికి ఆహ్వానం పలుకుతూ ప్రకృతి కాంత శోభాయమానంగా విరాజిల్లుతుంది. జ్ఞానానికి అధిదేవత సరస్వతీ దేవి. ఆమె జ్ఞాన స్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైనవాటిని చదువుల తల్లి సరస్వతీదేవి అంశలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెబుతారు
మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి. వసంతం అందరికీ ఎనలేని ఆనందం కలిగిస్తుంది. హరి పూజ, నూతన వస్త్రధారణను విధులుగా భావిస్తారు. రంగులు చల్లుకుంటారు. కొత్త ధాన్యం వచ్చే రోజులు కాబట్టి, బియ్యంతో పాయసం వండి నైవేద్యం పెడతారు. ఈ వసంత పంచమిని రాజస్థాన్లో విశేషంగా ఆచరిస్తారు. వంగ దేశంలో 'శ్రీ పంచమి' పేరుతో నిర్వర్తిస్తారు. సరస్వతి జన్మించిన రోజుగా భావించి, ఆ దేవిని భక్తి ప్రపత్తులతో కొలుస్తారు. గ్రంథాలను ఆ ప్రతిమ దగ్గర ఉంచి, పూజించి, సాయంకాలం వూరేగింపుగా వెళ్లి జలాశయంలో నిమజ్జనం చేస్తారు.
రోమనులు సైతం పూజించేవారు..
ప్రాచీన కాలంలో రోమనులు సైతం ఈ ఉత్సవం జరిపేవారని చరిత్ర చెబుతోంది. ‘బ్రహ్మ వైవర్త పురాణం’ వసంత పంచమినాడే సరస్వతిని పూజించాలంటుంది. రతీదేవికి, కామదేవుడికి, వసంతుడికి పూజలు చేస్తారు. ముగ్గురూ ఒక్కరోజునే పూజలందుకుంటారు. వసంతోత్సవాల్ని వేర్వేరు పేర్లతో, పలు విధాలుగా ఆచరిస్తుంటారు. ఇది శీతకాలానికి, వేసవి కాలానికి సంధికాలం కావడంతో ప్రజలకు ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొత్త పంటలు వచ్చే కాలం ఇది. పైగా పశువులకు గ్రాసం పుష్కలంగా లభించేది కూడా ఈ కాంలోనే.
ఇక వసంత పంచమినాడే సరస్వతీ జయంతి కావడంతో, ఈ పర్వదినం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అక్షరానికి ఆమె అధిదేవత. ప్రణవ స్వరూపిణి, జ్ఞానానంద శక్తి, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాయిని ఆమె. శ్రీవాణి కృప లేకుంటే, లోకానికి మనుగడే లేదు. వాగ్దేవి ఉపాసన వల్ల వాల్మీకి రామాయణ రచన చేశాడంటారు. శారద దీక్ష స్వీకరించి, వ్యాసుడు వేదవిభజన చేయగలిగాడంటారు. ఆదిశేషువు, బృహస్పతి, ఆదిశంకరులు, యాజ్ఞవల్క్యుడు వంటి ఎందరో శారదానుగ్రహం కారణంగా జ్ఞాన సంపన్నులయ్యారు.
నాటి వ్యాసపురే నేటి బాసరగా..
వ్యాసుడు గోదావరీ తీరాన సైకతమూర్తి రూపంలో వాణిని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. ఆ క్షేత్రమే వ్యాసపురిగా, బాసరగా ప్రసిద్ధి చెందింది. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. వసంత రుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధాశక్తి, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. అంత మహిమాన్వితమైన ఈ రోజునే చిన్నారులకు అక్షరాభ్యసం చేయిస్తే చక్కగా చదువుకుని వృద్ధిలోకి వస్తారని భక్తుల నమ్మకం.
వేదాలు సరస్వతీ మాత నుంచే వెలువడ్డాయని ‘గాయత్రీ హృదయం’ గ్రంథం అభివర్ణించింది. సరస్వతీనది అంతర్ముఖీనమై గంగ యమునలతో కలిసి ‘త్రివేణి’ గా విరాజిల్లింది. దేశ విదేశాల్లో గీర్వాణి ఆరాధనలందుకుంటోంది. సరస్వతీదేవి వద్ద ఆయుధాలుండవు. అలాగే గ్రీకులు, రోమనులు ఆమెను జ్ఞానదేవతగా పూజించేవారు. వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణిస్తారు. జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలత్వాదుల్ని అనుగ్రహిస్తుందంటారు. సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. అమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు.
బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీ దేవిని అహింసకు అధినాయికగా పేర్కొంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రితవరదాయినిగా దర్శనమిస్తుంది. సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థం. శుద్ధ సత్వగుణ శోభిత సరస్వతి, శ్వేత వస్త్రాలంకృతగా హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి జ్ఞాన క్రతువు నిర్వహిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంతరుతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త బ్రహ్మకు శారదే శక్తిదాయిని. అందువల్లే ఈ వసంత పంచమిని విద్యారంభ దినంగా పరిగణించారు మన పెద్దలు.
(చదవండి: భవ్య రామమందిరంలోని బాలరాముడి కళ్లను వేటితో చెక్కారో తెలుసా!)