
సాక్షి, బాసర: చదువుల తల్లి సరస్వతి నిలయమైన నిర్మల్ జిల్లా బాసర క్షేత్రంలో అమ్మవారి జన్మదిన వేడుకలకు సర్వంసిద్ధం చేశారు. మంగళవారం అమ్మవారి జన్మదినం కావడంతో భక్తజనం పోటెత్తనున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే వసంత పంచమి (శ్రీపంచమి) వేడుకలకు ఏపీతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని తమ చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు చేసేందుకు జనం సిద్ధమవుతున్నారు. అక్షర శ్రీకార మండపాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు కూర్చోవడానికి అనువుగా ఆలయ పరిసరాల్లో శామియానాలు ఏర్పాటు చేశారు.
ఆలయంలో నేటిపూజలు
వేకువజాము నుంచి మంగళవాయిద్యాల సేవ, సుప్రభాతం, మహాభిషేకం, అలంకరణ, నివేదన, మంగళహారతి, మంత్రపుష్పం జరుగు తాయి. ఉదయం 8.30 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, 9 గంటలకు చండీ హవానం ప్రారంభం, వేద పఠనం, పూర్ణాహుతి, రాత్రి 7.30 గంటలకు పల్లకీసేవ, మహా హారతి, మంత్రపుష్పం ఉంటాయి. అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.