పండగలా సీఎం పర్యటన
విజయనగరం గంటస్తంభం:రాష్ట ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 24వ తేదీన జగనన్న వసతిదీవెన పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అధికారులకు ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి అధికారులతో గురువారం సమీక్షించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజ రవుతారని, ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విజయనగరం జిల్లా ప్రత్యేకతను చాటుకునేలా, ముఖ్యమంత్రి అభినందనలు అందుకునేలా అందరూ సమష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు. భారీ ఎత్తున జన సమీకరణ చేయనున్నట్లు చెప్పారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తరువాత తొలిసారిగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో, పర్యటనకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయను న్నట్లు తెలిపారు. జన సమీకరణ బాధ్యత అంతా ఎంఎల్ఏలు, పార్టీ నాయకులే చూసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి సభకు హాజరయ్యే ప్రజలకు భోజన, రవాణా సదుపాయాలను పార్టీ నాయకులే చూసుకుంటారని తెలిపారు. విద్యార్థులకు ఎంతో మేలు చేసే జగనన్న వసతిదీవెన పథకాన్ని మన జిల్లాలో ప్రారంభిస్తుండటం మనకందరికీ గర్వకారణమని ఆమె పేర్కొన్నారు.
ప్రతిష్టాత్మకంగా సీఎం పర్యటన
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి సారిగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా, పండగ వాతావరణంలో జరిగేలా చూడాలని చెప్పారు. స్వాతంత్య్రానంతరం విద్య కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వమూ చేయలేదని, ఇంతటి ఘనమైన కార్యక్రమాన్ని అమలుచేస్తున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలన్నారు. ముఖ్యమంత్రిని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం వస్తారని, వారికి ఎలాంటిఅసౌకర్యాన్ని కలగకుండా చూడాలని సూచించారు. అధికారులంతా వారికి కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ మట్లాడుతూ జగనన్న వసతి దీవెన పథకం కింద జిల్లాలో 57,837 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 24వ తేదీ ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జిల్లాలో ఉంటారని తెలిపారు. ముందుగా అయోధ్య మైదానంలో జగనన్న వసతి దీవెన పథకాన్ని, అనంతరం పోలీస్ బ్యారెక్స్ వద్ద నిర్మించిన దిశ పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తారని తెలిపారు.
అయోధ్యా మైదానంలో ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలైన అమ్మఒడి , వైఎస్సార్ కంటి వెలుగు, నాడు–నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న వసతి దీవెన పథకాలపై స్టాళ్ళను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వేదికపై 22 మంది ముఖ్యులు ఉంటారని, అందుకు సంబంధించిన ప్రోటోకాల్ జాబితాను తయారు చేసి ఆమోదం పొందాలని ఆర్డీఓ హేమలతకు సూచించారు. సీటింగ్ ఏర్పాట్లను చూడాలని డీఆర్డీఏ పీడీకి, డబల్ బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ ఎస్ఈకి సూచించారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన విధులను బాధ్యతతో నిర్వర్తించాలని, ఈ కార్యక్రమం అయ్యేవరకు ఎలాంటి సెలవులు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. సెలవు దినాల్లో రోజుల్లో కూడా అధికారులంతా జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండాలని చెప్పారు.
అంతకుముందు మంత్రి, ఇతర నాయకులు, అధికారులు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన సమన్వయకర్త తలశిల రఘురాం, పార్లమెంట్ సభ్యుడు బెల్లాన చంద్ర శేఖర్, శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చిన అప్పల నాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, డీసీసీబీ ఛైర్పర్సన్ మరిశర్ల తులసి, డీసీఎంఎస్ చైర్మన్ పెదబాబు, సంయుక్త కలెక్టర్ జి.సి.కిశోర్ కుమార్, సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్, జేసీ–2 ఆర్.కుర్మనాథ్, జిల్లా రెవిన్యూ అధికారి జె.వెంకటరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.