‘రెయిన్‌ట్రీ’లో అధికారులకు నివాసం | Raintree officers will have resident | Sakshi
Sakshi News home page

‘రెయిన్‌ట్రీ’లో అధికారులకు నివాసం

Published Fri, Sep 25 2015 3:33 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM

Raintree officers will have resident

అక్కడే ఉన్న విల్లాల్లో మంత్రుల ఆవాసం..
చదరపు అడుగుకు రూ.11 అద్దె చెల్లించాలని నిర్ణయం

 
 సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లాలో నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న ఐజేఎం రెయిన్‌ట్రీ పార్క్ విల్లాలు, అపార్ట్‌మెంట్స్‌లోని ఫ్లాట్లలో మంత్రులతోపాటు అధికారులకు వసతి సౌకర్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 26 విల్లాల్లో మంత్రులు, 245 ఫ్లాట్‌లలో శాఖాధిపతులు నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు నవంబర్ ఒకటి నాటికి కేటాయింపులు పూర్తి చేయాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు.
 
అద్దె రూపంలో విల్లాలకు, ఫ్లాట్‌లకు ఏడాదికి రూ.5.50 కోట్లు చెల్లిస్తారు. గురువారం ఏపీ సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి యనమల మంత్రులు, అధికారులు, ఉద్యోగులకు వసతి కల్పనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బీ, సీ విభాగాలకు చెందిన విల్లాలను మంత్రుల నివాసాలకు కేటాయిస్తారు. ఒక్కో విల్లాకు నెలకు రూ.30 వేల అద్దె చెల్లిస్తారు. శాఖాధిపతులకు రెండు, మూడు పడక గదులున్న ఫ్లాట్స్‌లో వసతి కల్పించనున్నారు. ఫ్లాట్ల యజమానుల సం ఘం ప్రతినిధులతో చదరపు అడుగుకు రూ.11 వంతున రెండేళ్లపాటు అద్దెకు తీసుకునేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడలోని మేథా టవర్స్‌లో ఏర్పాటు చేస్తారు.
 
 అయితే, అది ప్రత్యేక ఆర్థికమండలిగా ఉంది. దాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, సచివాలయంగా ఉపయోగించుకోవాలంటే డీ నోటిఫై చేయాల్సి ఉంది. ఈ ఫ్లాట్స్, విల్లాలకు అవసరమైన మరమ్మతులను వాటి యజమానులు వెంటనే చేసేలా చూడాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు సమావేశానంతరం మంత్రి యనమల విలేకరులతో చెప్పారు. మంత్రులు, అధికారులకు యథావిధిగా హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తామన్నారు. విజయవాడలో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన వసతిని చూసుకోవాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సూచించామన్నారు. ప్రముఖులు వచ్చినపుడు బస చేసేందుకు అనువుగా గుంటూరు, విజయవాడల్లో రెండు అతిథిగృహాలను నిర్మిస్తామని, వాటి నిర్మాణం పూర్తయ్యేలోగా ఉపయోగించుకునేందుకు వీలుగా పర్యాటక అతిథిగృహాలను రూ.2 కోట్లతో మరమ్మతు చేయిస్తామన్నారు.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉద్యోగులు నూతన రాజధానికి తరలివెళతారని యనమల చెప్పారు. స్థానికతపై తాము కేంద్రానికి రాసిన లేఖకు ఇంకా సమాధానం రాలేదన్నారు. అమరావతి నగర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా సింగపూర్ ప్రధానిని ఆహ్వానించగా ఆయన పరిశీలిస్తానని చెప్పారన్నారు. తాము సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలోనే ప్రధాని మోదీ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని సమాచారం ఇచ్చారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement