VBIT students
-
వీబీఐటీ కేసు: వల వేసి.. సవాల్ విసిరి.. పోలీసులకు చిక్కాడు
సాక్షి, మేడ్చల్-మల్కాజిగిరి: ఘట్కేసర్ మండలం అవుషాపూర్ వీబీఐటీ(విజ్ఞానభారతి ఇంజినీరింగ్) కాలేజ్ అమ్మాయిలపై వేధింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు(?) ప్రదీప్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేశారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఈ హ్యాకర్‌ను.. పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం విశేషం. ప్రదీప్‌తో పాటు ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన మరో ఇద్దరిని సైతం శుక్రవారం ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏపీ విజయవాడకు చెందిన ప్రదీప్.. వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. వాట్సాప్ డీపీలతో పాటు ఏకంగా ఫోన్ డాటా మొత్తాన్ని హ్యాక్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. సేకరించిన డాటాను డార్క్‌నెట్‌లో పెట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఫేక్ ఫొటోల ద్వారా వాళ్లపై వేధింపులకు పాల్పడాలని యత్నించాడట ప్రదీప్. అయితే.. వేధింపులను భరించలేక యువతులు ఈ విషయాన్ని డిసెంబర్ 31వ తేదీకి ముందే కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ యాజమాన్యం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ దశలో ధర్నాకు దిగగా.. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్థినులకు మద్ధతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యువతి వల్లే ఇదంతా! ఈ మొత్తం వ్యవహారం వెనుక వీబీఐటీలోనే చదివే ఒక అమ్మాయి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయిని ట్రాప్ చేసిన ప్రదీప్.. ఆమెతో చాలాకాలం ఛాటింగ్ చేశాడు. ఇద్దరూ బాగా దగ్గరయ్యాక.. ఆమె ద్వారా యువతి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో చేరాడు. ఆపై మిగిలిన అమ్మాయిల నెంబర్లు సంపాదించాడు కూడా. ఇక ప్రదీప్‌కు ఘనితో పాటు మరో స్నేహితుడు తోడయ్యారు. ఈ ముగ్గురూ వాట్సాప్ గ్రూపుల్లోని తరచూ ఏదో ఒక నెంబర్లకు ఫోన్లు చేశారు. అవి అమ్మాయిల పర్సనల్ నెంబర్లే అని నిర్ధారించుకునేదాకా.. పదే పదే ఫోన్ చేశారు. ఆపై పరిచయం పెంచుకుని స్నేహం ప్రారంభించారు. వాళ్ల వాట్సాప్ డీపీలుగా ఉన్న ఫోటోలను సేకరించారు. అదే సమయంలో ‘‘ఎంటర్ ది డ్రాగన్, కింగ్ ఈజ్ బ్యాక్’’ ల పేరుతో వాట్సప్ గ్రూప్‌లను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్‌లో వీబీఐటీ స్టూడెంట్స్‌ను సైతం యాడ్ చేశారు. ఇక అపరిచిత లింకులను ఆ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి.. అవి క్లిక్ చేసిన అమ్మాయిల ఫోన్లోని డాటాను హ్యాకింగ్ చేశారు ప్రదీప్ అండ్ కో. సుమారు 43 మంది డాటాను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు సవాల్ మరోవైపు ఏడు నెంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్ మెయిల్ దిగాడు. ఇక ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టిన సమయంలోనూ ప్రదీప్ పోలీసులకు, బాధిత యువతులకు చుక్కలు చూపించాడు. దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. అలాగే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నెట్లో ఆ ఫొటోలు పెడతానని అమ్మాయిలను బెదిరించిన సైబర్ ఛీటర్ ప్రదీప్.. అన్నంత పని చేయబోయాడట. అయితే.. సరైన సమయంలో ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మరికొందరి డాటా డార్క్‌నెట్‌లో అప్లోడ్ కాకుండా నిలువరించగలిగారట. ఇక ప్రదీప్‌కు నేరంలో సహకరించిన ఫస్ట్ ఇయర్ యువతిని సస్పెండ్ చేసే యోచనలో కాలేజీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. కాలేజీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. స్టూడెంట్స్‌కు సంక్రాంతి సెలవులు ముందుగానే ప్రకటించింది యాజమాన్యం!. -
ఘట్కేసర్: బీటెక్ స్టూడెంట్స్ మార్ఫింగ్ న్యూడ్ ఫోటోల కలకలం
సాక్షి, హైదరాబాద్: ఘట్కేసర్లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినుల మార్పింగ్ న్యూడ్ ఫొటోల కలకలం చెలరేగింది. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి కొందరు ఆకతాయి.. వాటిని వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేశారు. అంతేకాదు వాటి ఆధారంగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో విద్యార్థినిలు బుధవారం అర్ధరాత్రి కాలేజ్ ముందుకు చేరి ధర్నా చేపట్టారు. ఈ ఉదయం వీళ్లకు విద్యార్థి సంఘాలు కూడా తోడు కావడంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది. ఘట్కేసర్ వీబీఐటీ( విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీ) దగ్గర గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు ఆకతాయిలు ఆ కాలేజీలో చదువుతున్న అమ్మాయిల ఫొటోలను సేకరించి.. వాటిని న్యూడ్ ఫొటోలుగా మార్ఫింగ్ చేశారు. అంతటితో ఆగకుండా వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. వాటిని చూపిస్తూ.. వాట్సాప్ గ్రూపుల్లో చేరి వీడియో కాల్స్ చేయాలని యువతులను బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ పరిణామం వెనుక ఎవరున్నారేది తేల్చే పనిలో ఉన్నారు. అయితే.. ఈ లోపే విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు ఈ పరిణామంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కూతుర్ల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. ఇదిలా ఉండగా.. విద్యార్థినుల ధర్నా చేపట్టిన సమయంలో ఆగంతకుల నుంచి వార్నింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించినట్లు విద్యార్థినులు చెప్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు చెప్తున్నారు. -
2,200 రాకెట్లు.. ఒకేసారి
సీబీఐటీ, వీబీఐటీ విద్యార్థుల వినూత్న ప్రయోగం వైఎస్ఆర్ జిల్లా చాపాడులోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (సీబీఐటీ), విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీబీఐటీ) కళాశాల విద్యార్థులు సంయుక్తంగా ఏక కాలంలో 2,200 ఎయిర్ రాకెట్లను ప్రయోగించారు.‘14 యంత్రాస్’ అనే సంస్థ చెన్నై ఐఐటీ, బెంగళూరు ఐఐఎం సహకారంతో రూ. 25 లక్షల ఖర్చుతో 2,200 మంది విద్యార్థులతో ఎయిర్ రాకెట్లను తయారు చేయించింది. వాటిని సీబీఐటీ, వీబీఐటీ ప్రాంగణ ం వేదికగా ప్రయోగించారు. చైనాలో ఓ విద్యా సంస్థ 2011లో 1,056 మందితో ఇలాంటి ప్రయోగం చేసి గిన్నిస్ రికార్డు సాధించగా, తాజా ప్రయోగం ఆ రికార్డును అధిగమించాయి. రాకెట్లు 100 అడుగుల ఎత్తుకు వెళ్లాయి. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో టెక్నాలజీపై విశ్వాసం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని సీబీఐటీ, వీబీఐటి కరస్పాండెంట్ వి.జయచంద్రారెడ్డి చెప్పారు. గిన్నిస్ రికార్డు వారికి ఈ ప్రయోగ వివరాలు పంపుతామన్నారు. - చాపాడు