సాక్షి, మేడ్చల్-మల్కాజిగిరి: ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ వీబీఐటీ(విజ్ఞానభారతి ఇంజినీరింగ్) కాలేజ్ అమ్మాయిలపై వేధింపు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేధింపులకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు(?) ప్రదీప్‌ను ఎట్టకేలకు పోలీసులు ట్రేస్ చేశారు. దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు సవాల్ విసిరిన ఈ హ్యాకర్‌ను.. పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం విశేషం. ప్రదీప్‌తో పాటు ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన మరో ఇద్దరిని సైతం శుక్రవారం ఘట్‌కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఏపీ విజయవాడకు చెందిన ప్రదీప్.. వీబీఐటీ కాలేజీ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి.. న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఈ క్రమంలో.. వాట్సాప్ డీపీలతో పాటు ఏకంగా ఫోన్ డాటా మొత్తాన్ని హ్యాక్ చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. సేకరించిన డాటాను డార్క్‌నెట్‌లో పెట్టి డబ్బు సంపాదించడంతో పాటు ఫేక్ ఫొటోల ద్వారా వాళ్లపై వేధింపులకు పాల్పడాలని యత్నించాడట ప్రదీప్. అయితే..
వేధింపులను భరించలేక యువతులు ఈ విషయాన్ని డిసెంబర్ 31వ తేదీకి ముందే కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ యాజమాన్యం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ దశలో ధర్నాకు దిగగా.. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్థినులకు మద్ధతుగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
యువతి వల్లే ఇదంతా!
ఈ మొత్తం వ్యవహారం వెనుక వీబీఐటీలోనే చదివే ఒక అమ్మాయి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తు ద్వారా తేల్చారు. ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయిని ట్రాప్ చేసిన ప్రదీప్.. ఆమెతో చాలాకాలం ఛాటింగ్ చేశాడు. ఇద్దరూ బాగా దగ్గరయ్యాక.. ఆమె ద్వారా యువతి ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో చేరాడు. ఆపై మిగిలిన అమ్మాయిల నెంబర్లు సంపాదించాడు కూడా. ఇక ప్రదీప్‌కు ఘనితో పాటు మరో స్నేహితుడు తోడయ్యారు. ఈ ముగ్గురూ వాట్సాప్ గ్రూపుల్లోని తరచూ ఏదో ఒక నెంబర్లకు ఫోన్‌లు చేశారు. అవి అమ్మాయిల పర్సనల్ నెంబర్లే అని నిర్ధారించుకునేదాకా.. పదే పదే ఫోన్ చేశారు. ఆపై పరిచయం పెంచుకుని స్నేహం ప్రారంభించారు. వాళ్ల వాట్సాప్ డీపీలుగా ఉన్న ఫోటోలను సేకరించారు. అదే సమయంలో ‘‘ఎంటర్ ది డ్రాగన్, కింగ్ ఈజ్ బ్యాక్’’ ల పేరుతో వాట్సప్ గ్రూప్‌లను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్‌లో వీబీఐటీ స్టూడెంట్స్‌ను సైతం యాడ్ చేశారు. ఇక అపరిచిత లింకులను ఆ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసి.. అవి క్లిక్ చేసిన అమ్మాయిల ఫోన్‌లోని డాటాను హ్యాకింగ్ చేశారు ప్రదీప్ అండ్ కో. సుమారు 43 మంది డాటాను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులకు సవాల్
మరోవైపు ఏడు నెంబర్ల నుంచి అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోలుగా మార్చేసి బ్లాక్ మెయిల్ దిగాడు. ఇక ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేపట్టిన సమయంలోనూ ప్రదీప్ పోలీసులకు, బాధిత యువతులకు చుక్కలు చూపించాడు. దమ్ముంటే తమను పట్టుకోవాలని పోలీసులకు సవాల్ విసిరాడు. అలాగే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నెట్‌లో ఆ ఫొటోలు పెడతానని అమ్మాయిలను బెదిరించిన సైబర్ ఛీటర్ ప్రదీప్.. అన్నంత పని చేయబోయాడట. అయితే.. సరైన సమయంలో ప్రదీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మరికొందరి డాటా డార్క్‌నెట్‌లో అప్‌లోడ్ కాకుండా నిలువరించగలిగారట. ఇక ప్రదీప్‌కు నేరంలో సహకరించిన ఫస్ట్ ఇయర్ యువతిని సస్పెండ్ చేసే యోచనలో కాలేజీ యాజమాన్యం ఉన్నట్లు సమాచారం. కాలేజీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో.. స్టూడెంట్స్‌కు సంక్రాంతి సెలవులు ముందుగానే ప్రకటించింది యాజమాన్యం!.
Comments
Please login to add a commentAdd a comment