vbr
-
అయ్యో.. గోమాతలారా..
వెలుగోడు: నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిలో మునిగి వంద ఆవులు గల్లంతయ్యాయి. మేతకు వెళ్తున్న ఆవుల మందను అడవి పందులు బెదిరించడంతో రిజర్వాయర్‌లోకి దూకాయి. వెంటనే అప్రమత్తమైన వాటి యజమానులు, మత్స్యకారులు రిజర్వాయర్‌లో చిక్కుకున్న 350 గోమాతలను రక్షించగా, మరో 100 ఆవుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెలుగోడుకు చెందిన శంకర్, సుంకన్న, కురుమన్న, బాలలింగం, వెంకటరమణతో పాటు మరో ఐదుగురికి చెందిన వెయ్యి ఆవులు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పరిధిలోని డీఎల్బీ రెగ్యులేటర్ వద్ద గట్టు వెంట శుక్రవారం ఉదయం మేతకు వెళ్లాయి. అదే సమయంలో ఎదురుపడిన అడవి పందుల గుంపు ఆవుల మందను బెదిరించాయి. దీంతో భయపడిన ఆవులు (దాదాపు 450) వెలుగోడు జలాశయంలోకి పరుగులు తీశాయి. బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి 9 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రవాహానికి ఆవులు కొట్టుకుపోయాయి. దిక్కు తోచని స్థితిలో ఆవుల కాపరులు బిగ్గరగా కేకలు వేయడంతో రిజర్వాయర్ వద్ద ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై పుట్టీల సాయంతో నీటిలో ఉన్న 350 ఆవులను రక్షించారు. గల్లంతయిన ఆవుల కోసం గాలిస్తున్నారు. ఆవులను రక్షించటానికి గ్రామస్తులు జాలరులను రంగంలోకి దింపారు. మర బుట్టలతో జాలరులు ఆవుల కోసం శుక్రవారం సాయంత్రం వరకు గాలించారు. ఘటనా స్థలానికి ఆత్మకూరు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ జగన్మోహన్, తహసీల్దార్ మహమ్మద్ రఫీ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీను, ఆర్ఐ రామాంజనేయులు, వీఆర్వోలు చేరుకొని సహాయక చర్యలను సమీక్షించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరో వంద ఆవుల ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
వీబీఆర్ నుంచి నీటి విడుదల బంద్
వెలుగోడు: జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను నిలుపుదల చేసినట్లు తెలుగు గంగ డీఈ రాఘరామిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రస్తుతం వీబీఆర్‌లో 5.974 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వీబీఆర్ నుంచి వన్ ఆర్, వన్ ఎల్, చెన్నై కాల్వకు అవుట్ ప్లో నిలిపేసినట్లు డీఈ తెలిపారు. కలెక్టర్ అనుమతితోనే మళ్లీ నీటిని విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. -
వీబీఆర్‌కు ముప్పు లేదు
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ డిజైన్ ప్రకారమే నీటిని నిల్వ చేస్తున్నట్లు తెలుగు గంగ ఎస్ఈ చంద్రశేఖర్ తెలిపారు. రిజర్వాయర్‌కు ఎలాంటి ముప్పు లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. శనివారం ఎస్ఈ చంద్రశేఖర్ వీబీఆర్‌ను సందర్శించారు. హెడ్ రెగ్యులేటర్, స్పీల్ వే, వన్ ఆర్, వన్ ఎల్ తూములను పరిశీలించారు. అనంతరం స్థానిక గంగ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వీబీఆర్‌కు నీరు చేరుతోందన్నారు. పాత డిజైన్ ప్రకారమే నీటిని నిల్వ చేస్తున్నామని, ప్రస్తుతం 15.5 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. స్పీల్ వే, హెడ్ రెగ్యులేటర్, కట్ట వెంట సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తున్నారని, డే అండ్ నై పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కట్ట పటిష్టంగా ఉన్నట్లు చెప్పిన ఎస్ఈ.. రోజు మార్చి రోజు నీటి నిల్వలు పెంచుతున్నామన్నారు. ఆయన వెంట ఈఈ పుల్లారావు, డీఈలు విజయానంద్, ప్రతాప్, జేఈలు, సిబ్బంది ఉన్నారు. -
వీబీఆర్‌లో రికార్డు స్థాయి నీటి నిల్వ
– 20 ఏళ్లుగా ఈ స్థాయి నీటి నిల్వకు సాహసించని ఇంజినీర్లు – రిజర్వాయర్ భద్రతపై 24 గంటల పాటు పర్యవేక్షణ కర్నూలు సిటీ: తెలుగుగంగ కాల్వలో అంతర్భాగమైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(వీబీఆర్) చరిత్రలోనే ఎప్పుడు లేనంత స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గత 20 ఏళ్లలో 15.5 టీయంసీల నీటిని నిల్వ చేసేందుకు సాహసం చేయలేదు. గతేడాది ఎదురైన సాగు, తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు తెలుగుగంగ కాల్వ ఇన్చార్జీ పర్యవేక్షక ఇంజినీర్ యస్.చంద్రశేఖర్ రావు, ఈఈ పుల్లారావు, డీఈఈలు నిత్యం పర్యవేక్షిస్తూ రిజర్వాయర్‌లో నీటిని రికార్డు స్థాయిలో నిల్వ చేశారు. ఈ విషయంపై వీరికి సీఎంవో ఆఫీస్, జిల్లా కలెక్టర్ నుంచి కూడ అభినందనలు వచ్చాయి. ఇదీ చరిత్ర.. తెలుగుగంగ కాల్వ కింద 1.145 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరు ఇవ్వడం కోసం ఈ కాల్వకు 7.83 కి.మీ దగ్గర వెలుగోడు రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్ సామర్థ్యం 16.95 టీయంసీలు. 11.64 కి.మీ పొడవు, 28 మీటర్ల ఎత్తు ఉంది. ఈ రిజర్వాయర్ వల్ల వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, శిరివెళ్ళ, రుద్రవరం, చాగలమర్రి మండలాలకు చెందిన 1.14 లక్షల ఎకరాలకు సాగు నీరు అదుతుంది. ఈ రిజర్వాయర్ 1996లో పూర్తికాగా.. 20 ఏళ్లలో పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ చేసేందుకు ఇంజినీర్లు ధైర్యం చేయలేకపోయారు. ఎక్కువ నీటిని నింపితే మట్టికట్ట లీకేజీ అవుతందనే భయందోళన ఉంది. ఈ ఏడాది పూర్తి స్థాయి నీటిని రిజర్వాయర్‌లో నింపేందుకు ఇంజినీర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేవారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో 15.5 టీఎంసీల మేరకు నీటిని నిల్వ చేశారు. ప్రత్యేక పర్యవేక్షణ వెలుగోడు రిజర్వాయర్‌లో భారీగా నీటిని నిల్వ చేయడంతో భద్రతపై 24 గంటలు పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకు రెవెన్యూ అ«ధికారుల సహయం కూడ తీసుకోనున్నట్లు తెలిసింది. ఒక్కో బందంలో ముగ్గురు చొప్పున ఉండాలని ఈఈ పుల్లారావును ఎస్ఈ చంద్రశేఖర్ రావు ఆదేశించారు.