వెలుగోడు రిజర్వాయర్
వీబీఆర్‌లో రికార్డు స్థాయి నీటి నిల్వ
Published Sat, Sep 24 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
– 20 ఏళ్లుగా ఈ స్థాయి నీటి నిల్వకు సాహసించని ఇంజినీర్లు
– రిజర్వాయర్ భద్రతపై 24 గంటల పాటు పర్యవేక్షణ
కర్నూలు సిటీ: తెలుగుగంగ కాల్వలో అంతర్భాగమైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(వీబీఆర్) చరిత్రలోనే ఎప్పుడు లేనంత స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గత 20 ఏళ్లలో 15.5 టీయంసీల నీటిని నిల్వ చేసేందుకు సాహసం చేయలేదు. గతేడాది ఎదురైన సాగు, తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు తెలుగుగంగ కాల్వ ఇన్‌చార్జీ పర్యవేక్షక ఇంజినీర్ యస్.చంద్రశేఖర్ రావు, ఈఈ పుల్లారావు, డీఈఈలు నిత్యం పర్యవేక్షిస్తూ రిజర్వాయర్‌లో నీటిని రికార్డు స్థాయిలో నిల్వ చేశారు. ఈ విషయంపై వీరికి సీఎంవో ఆఫీస్, జిల్లా కలెక్టర్ నుంచి కూడ అభినందనలు వచ్చాయి.
ఇదీ చరిత్ర..
తెలుగుగంగ కాల్వ కింద 1.145 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరు ఇవ్వడం కోసం ఈ కాల్వకు 7.83 కి.మీ దగ్గర వెలుగోడు రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్ సామర్థ్యం 16.95 టీయంసీలు. 11.64 కి.మీ పొడవు, 28 మీటర్ల ఎత్తు ఉంది. ఈ రిజర్వాయర్ వల్ల వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, శిరివెళ్ళ, రుద్రవరం, చాగలమర్రి మండలాలకు చెందిన 1.14 లక్షల ఎకరాలకు సాగు నీరు అదుతుంది. ఈ రిజర్వాయర్ 1996లో పూర్తికాగా.. 20 ఏళ్లలో పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ చేసేందుకు ఇంజినీర్లు ధైర్యం చేయలేకపోయారు. ఎక్కువ నీటిని నింపితే మట్టికట్ట లీకేజీ అవుతందనే భయందోళన ఉంది. ఈ ఏడాది పూర్తి స్థాయి నీటిని రిజర్వాయర్‌లో నింపేందుకు ఇంజినీర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేవారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో 15.5 టీఎంసీల మేరకు నీటిని నిల్వ చేశారు.
ప్రత్యేక పర్యవేక్షణ
వెలుగోడు రిజర్వాయర్‌లో భారీగా నీటిని నిల్వ చేయడంతో భద్రతపై 24 గంటలు పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకు రెవెన్యూ అ«ధికారుల సహయం కూడ తీసుకోనున్నట్లు తెలిసింది. ఒక్కో బందంలో ముగ్గురు చొప్పున ఉండాలని ఈఈ పుల్లారావును ఎస్‌ఈ చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
Advertisement
Advertisement