teluguganga
-
ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం
సాగునీటి ప్రాజెక్టుల వద్ద నిద్రించైనా పెండింగ్ పనులను పూర్తి చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు 2015 మే 12న బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థను పరిశీలించిన సమయంలో రైతాంగానికి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్లీ పెండింగ్ ప్రాజెక్టుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌రెగ్యులేటర్ ప్రారంభాన్ని ఏటేటా వాయిదా వేçస్తూ.. పెండింగ్‌లో ఉన్న 15 శాతం పనులను పూర్తి చేయించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. జూపాడుబంగ్లా(కర్నూలు): రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, తమిళనాడులోని చెన్నై ప్రాంతాలకు తాగు, సాగునీటికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గుండెకాయ లాంటిది. శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపునకు ఉద్దేశించిన నూతన హెడ్‌రెగ్యులేటర్ పెండింగ్ పనులను పూర్తి చేసి..ప్రారంభోత్సవం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పెండింగ్‌లో ఉన్నది 15 శాతం పనులే అయినప్పటికీ వాటిని కూడా పూర్తి చేయలేకపోతోంది. 2015 మార్చి 5న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరును పరిశీలించిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంద రోజుల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేయించటంతో పాటు 2015 జూన్ నుంచి నూతన హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయిస్తానని ప్రకటించారు. సీఎం, మంత్రి ఇరువురూ ప్రాజెక్టులను సందర్శించి మూడేళ్లకు పైగా అవుతున్నా పనులు మాత్రం పూర్తి చేయించిన దాఖలాల్లేవు. పెండింగ్ పనులపై శ్రద్ధేదీ? రూ.201.347 కోట్ల అంచనా వ్యయంతో 2006 డిసెంబరులో నూతన హెడ్‌రెగ్యులేటర్ పనులు ప్రారంభమయ్యాయి. 2010 నాటికి దాదాపు 85 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేయించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. పనుల పెండింగ్ కారణంగా పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో ఏటా టీఎంసీల కొద్దీ నీళ్లు దిగువకు వెళ్లిపోతున్నాయి. 16.5 కి.మీ మేర ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (ఎస్ఆర్ఎంసీ)ను బానకచర్ల వద్ద విస్తరించాల్సి ఉంది. అలాగే కాలువలో పూడిక తొలగించాలి. 0 నుంచి 9 కి.మీ వరకు కాలువ ఎడమగట్టును పటిష్టంచేసి.. స్టాండర్డు బ్యాంకు నిర్మించాల్సి ఉంది. కాలువ కుడిగట్టు వెంట బీటీ రహదారిని, నాలుగు ప్రాంతాల్లో వంతెనలను, అధికారుల నివాసగృహాలు, కంట్రోల్‌రూంను నిర్మించాలి. ఈ పనులన్నీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యాయి. పూర్తికాని ఎస్ఆర్బీసీ విస్తరణ పనులు పోతిరెడ్డిపాడుకు దిగువన ఉన్న తెలుగుగంగ, కేసీఎస్కేప్ కాలువలు 11వేల క్యూసెక్కుల నీటివిడుదలకు అనుకూలంగా ఉన్నా.. శ్రీశైలం కుడి ఉప కాలువ (ఎస్ఆర్బీసీ)ను మాత్రం 22వేల క్యూసెక్కులకు అనుగుణంగా విస్తరించలేదు. విస్తరణ పనులు నేటికీ కొన..సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ కాలువకు 4 –5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే గట్లు తెగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఎస్ఆర్బీసీని విస్తరించేదాకా 22వేల క్యూసెక్కుల నీటిని సరఫరాచేసే అవకాశం లేదు. నిర్వహణ లోపంతో గేట్ల మొరాయింపు నీటిసరఫరా నిలిచిన వెంటనే అధికారులు హెడ్‌రెగ్యులేటరు గేట్లకు మరమ్మతులు చేపట్టి.. నీటివిడుదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. అయితే.. ఇవేవీ పట్టించుకోకపోవటంతో పోతిరెడ్డిపాడు పాత, కొత్త హెడ్‌రెగ్యులేటర్ల గేట్లు తుప్పుపట్టి ఎత్తితే దించలేం, దించితే ఎత్తలేం అన్నట్లుగా మారాయి. కొత్త హెడ్‌రెగ్యులేటరుకు ఉన్న పదిగేట్లలో ఆరు గేట్లకు రబ్బర్‌షీల్స్ ఊడిపోయాయి. వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహించకముందే డ్యాంలోకి నీళ్లు రావటంతో పనులు నిలిచిపోయాయి. మొండికేసిన కాంట్రాక్టర్లు 0 నుంచి 9 కిలోమీటర్ల మేర స్టాండర్డు బ్యాంకును నిర్మించేదిలేదని కాంట్రాక్టర్లు అధికారులకు తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు చేరితే బ్యాక్‌వాటర్ కారణంగా ఎస్ఆర్ఎంసీ ఎడమగట్టుకు అభద్రత నెలకొనే ప్రమాదం ఉంది. 2009 వరదల సమయంలో బలహీనంగా ఉన్న ఎడమగట్టు తెగి.. దిగువన ఉన్న నంద్యాల పట్టణంతో పాటు మరికొన్ని ప్రాంతాలు మునకకు గురయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న పోతిరెడ్డిపాడు పనులను పూర్తి చేయించటంతో పాటు నూతన హెడ్‌రెగ్యులేటరు ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. కొంత సమయం పడుతుంది పోతిరెడ్డిపాడు నీటినియంత్రణ వ్యవస్థ ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. గాలేరు నగరి గేట్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. అలాగే ఎర్రగూడూరు వద్ద ఎస్ఆర్ఎంసీ పనులు పూర్తికావాలి. వీటితోపాటు కంట్రోల్‌రూం, బీటీరోడ్డు నిర్మాణం, స్టాఫ్‌రూం, స్టాండర్డ్బ్యాంక్ నిర్మాణ పనులు త్వరలో చేపడతాం. – మనోహర్‌రాజు, ఈఈ, పోతిరెడ్డిపాడు -
నీటి యుద్ధాలు
- రిజర్వాయర్ నీటి కోసం రైతుల మధ్య గొడవలు రుద్రవరం: తెలుగుగంగ ప్రధాన కాల్వ నీటిని నిలిపి వేయడంతో తుండ్లవాగు రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటి కోసం పలు గ్రామాల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. రుద్రవరం సమీపంలోని తుండ్లవాగు రిజర్వాయర్ వెనుక వైపు 21, 22 బ్లాక్ చానల్ నుంచి నీరు ప్రవహిస్తోంది. 21వ బ్లాక్ చానల్ పరిధిలో ఆర్ నాగులవరం, తువ్వపల్లె, రెడ్డిపల్లె, నక్కలదిన్నె, కొత్తపల్లె, మందలూరు, చందలూరు తదితర గ్రామాలకు సాగు నీరు అందుతుంది. 22వ బ్లాక్ చానల్స్ పరిధిలో రుద్రవరం టి లింగందిన్నె, తువ్వపల్లె, ఆర్ నాగులవరం, ముత్తలూరు తదితర గ్రామాల భూములకు సాగునీరు అందుతుంది. తెలుగుగంగ ప్రధాన కాల్వకు 10 రోజులుగా నీరు నిలిపి వేశారు. రుద్రవరం సమీపంలో తుండ్లవాగు రిజర్వాయర్ అరకొరగా నిలిచి ఉన్న నీటి కోసం 21వ బ్లాక్ పరిధిలోని నక్కలదిన్నె, మందలూరు, చందలూరు, రుద్రవరం గ్రామాల రైతులు గొడవలు పడుతూనే ఉన్నారు. వారం రోజుల క్రితం నక్కలదిన్నె గ్రామస్తులు రిజర్వాయర్ నీటిని తరలించేందుకు ప్రయత్నంచగా రుద్రవరం గ్రామస్తులు అడ్డుకున్నారు. మంగళవారం మందలూరు, చందలూరు గ్రామస్తులు బ్లాక్ చానల్ కింద నీటిని విడుదల చేయాలని రుద్రవరం రైతులతో గొడవకు దిగారు. ఎలాగైనా నీటిని తీసుకెళ్లాలని మూడు గ్రామాల రైతులు అధికారులు, ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్తున్నా రుద్రవరం గ్రామ రైతులు పట్టువదలడం లేదు. రిజర్వాయర్ ప్రాంతంలో కొంత కాలంగా బ్లాక్ వాటర్‌ను వినియోగించుకొని పంటలు సాగు చేసుకుంటున్నామని కొత్తగా నీటిని విడుదల చేయడం వల్ల ఏటా నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి తెలుగుగంగ ప్రధాన కాల్వకు నీటిని విడుదల చేయించుకొని స్టాక్ చేసుకోగా ఇప్పుడు వచ్చి నీరు కావాలంటే ఎలా అని రుద్రవరం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కాగా బ్లాక్ చానల్ గేటు ఎత్తేందుకు ప్రయత్నించగా రుద్రవరం గ్రామస్తులు అడ్డుకుంటున్నారని మంగళవారం చందలూరు గ్రామస్తులు పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఎస్ఐ హనుమంతయ్య ఉన్నతాధికారుల సూచనలతో ఇరువర్గాల రైతులకు నచ్చజెప్పి కొంత మేర నీటిని విడుదల చేయించారు. -
కలకలం రేపిన పొట్టు బస్తాలు
బండిఆత్మకూరు: ఓంకార క్షేత్రం సమీపంలోని తెలుగుగంగ ప్రధాన కాల్వలో సుమారు పొట్టుతో కూడిన 50 బస్తాలు గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లడంతో కలకలం రేగింది. ఈ బస్తాలో ఉన్న పొట్టు ఒక రకమైన వాసన వస్తుండటంతో ఎందుకు ఉపయోగిస్తారోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. విషయం తెలిసిన వెంటనే సింగవరం, సోమయాజులపల్లె గ్రామానికి చెందిన ప్రజలు అక్కడికి వెళ్లి వాటిని పరిశీలించారు. ఆ విధంగా సంచుల్లో ఉన్న పొట్టును మసాలా తయారీలో కల్తీ చేయడానికి తీసుకెళ్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. -
‘బ్రహ్మంసాగర్’లో యువకుడి మృతదేహం
బ్రహ్మంగారిమఠం: తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ ఎడమ కాలువలో మైదుకూరు - పోరుమామిళ్ల రహదారిలోని లింగాలదిన్నెపల్లె బ్రిడ్జి దగ్గర శుక్రవారం గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని ఆ గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయాన్ని వారు పో లీసులకు తెలిపారు. ఎస్ఐ రంగస్వామి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గ్రామస్తుల సహకారంతో కాలువలో నుంచి యువకుడి మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుని వద్ద కొంత నగదు, సెల్‌ఫోన్, బైక్ తాళాలు ఉన్నాయి. అతను ధరించిన చొక్కాను పరిశీలించగా.. పామూరుకు చెందిన వెంగమాంబ టైలర్ పేరుతో లేబుల్ ఉంది. మృతదేహాన్ని పోలీసులు బి.మఠం పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. మరో మృతదేహం.. బ్రహ్మంసాగర్ ఎడమ కాలువలోనే శుక్రవారం సాయంత్రం లింగాలదిన్నెపల్లె గ్రామస్తులు మరో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. అతనికి 45 ఏళ్లు ఉండవచ్చు. నీటి ప్రవాహంలో కొట్టుకునిపోతుండగా చూసినట్లు గ్రామస్తులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించే లోపే కొట్టుకుపోయినట్లు వారు పేర్కొన్నారు. -
పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల
పోతిరెడ్డిపాడు(జూపాడుబంగ్లా): పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి 6,500క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి మంగళవారం తెలిపారు. విడుదల చేసిన నీటిలో తెలుగుగంగ కాల్వకు 3,800 క్యూసెక్కులు, ఎస్సార్బీసీ కాల్వకు 1,700, కేసీ ఎస్కేప్ కాల్వకు 1,000 క్యూసెక్కుల చొప్పున పంపుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు వద్ద 878.48 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. -
వీబీఆర్‌లో రికార్డు స్థాయి నీటి నిల్వ
– 20 ఏళ్లుగా ఈ స్థాయి నీటి నిల్వకు సాహసించని ఇంజినీర్లు – రిజర్వాయర్ భద్రతపై 24 గంటల పాటు పర్యవేక్షణ కర్నూలు సిటీ: తెలుగుగంగ కాల్వలో అంతర్భాగమైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(వీబీఆర్) చరిత్రలోనే ఎప్పుడు లేనంత స్థాయిలో నీటిని నిల్వ చేశారు. గత 20 ఏళ్లలో 15.5 టీయంసీల నీటిని నిల్వ చేసేందుకు సాహసం చేయలేదు. గతేడాది ఎదురైన సాగు, తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు తెలుగుగంగ కాల్వ ఇన్చార్జీ పర్యవేక్షక ఇంజినీర్ యస్.చంద్రశేఖర్ రావు, ఈఈ పుల్లారావు, డీఈఈలు నిత్యం పర్యవేక్షిస్తూ రిజర్వాయర్‌లో నీటిని రికార్డు స్థాయిలో నిల్వ చేశారు. ఈ విషయంపై వీరికి సీఎంవో ఆఫీస్, జిల్లా కలెక్టర్ నుంచి కూడ అభినందనలు వచ్చాయి. ఇదీ చరిత్ర.. తెలుగుగంగ కాల్వ కింద 1.145 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టుకు నీరు ఇవ్వడం కోసం ఈ కాల్వకు 7.83 కి.మీ దగ్గర వెలుగోడు రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్ సామర్థ్యం 16.95 టీయంసీలు. 11.64 కి.మీ పొడవు, 28 మీటర్ల ఎత్తు ఉంది. ఈ రిజర్వాయర్ వల్ల వెలుగోడు, బండి ఆత్మకూరు, మహానంది, శిరివెళ్ళ, రుద్రవరం, చాగలమర్రి మండలాలకు చెందిన 1.14 లక్షల ఎకరాలకు సాగు నీరు అదుతుంది. ఈ రిజర్వాయర్ 1996లో పూర్తికాగా.. 20 ఏళ్లలో పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ చేసేందుకు ఇంజినీర్లు ధైర్యం చేయలేకపోయారు. ఎక్కువ నీటిని నింపితే మట్టికట్ట లీకేజీ అవుతందనే భయందోళన ఉంది. ఈ ఏడాది పూర్తి స్థాయి నీటిని రిజర్వాయర్‌లో నింపేందుకు ఇంజినీర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేవారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో 15.5 టీఎంసీల మేరకు నీటిని నిల్వ చేశారు. ప్రత్యేక పర్యవేక్షణ వెలుగోడు రిజర్వాయర్‌లో భారీగా నీటిని నిల్వ చేయడంతో భద్రతపై 24 గంటలు పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకు రెవెన్యూ అ«ధికారుల సహయం కూడ తీసుకోనున్నట్లు తెలిసింది. ఒక్కో బందంలో ముగ్గురు చొప్పున ఉండాలని ఈఈ పుల్లారావును ఎస్ఈ చంద్రశేఖర్ రావు ఆదేశించారు. -
20 బ్లాక్ చానల్‌కు గండి
–నీట మునిగిన పంటలు రుద్రవరం : మండల కేంద్రం సమీపంలోని తెలుగుగంగ 20 బ్లాక్ చానల్ కట్ట మంగళవారం తెల్లవారుజామున కోతకు గురై గండిపడింది. కాల్వ నీటికి తోడు వర్షంతో నిండిన రంగారెడ్డి చెరువు అలుగు నీరు తోడు కావడంతో గ్రామ సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి. 20 ఎకరాలకు పైగా వరినాట్లు నీటిలో మునిగి పోయాయి. ఎకరానికి రూ.10 వేలు పెట్టబడి పెట్టామని, మరో రెండు రోజులు నీరు నిల్వ ఉంటే నాట్లు కుల్లిపోతాయని రైతులు ప్రహ్లాదుడు, నరసింహ, ఉస్సేనీ, జాకీర్లతోపాటు పలువురు వాపోయారు. -
ఎర్రచందనం డంప్ స్వాధీనం
రుద్రవరం: రుద్రవరం అటవీ ప్రాంతంలోని తెలుగుగంగ ప్రధాన కాల్వ పైభాగాన అక్రమ రవాణాకు సిద్ధం చేసిన 63 ఎర్రచందనం దుంగలు.. తొమ్మిది సైకిళ్లను గురువారం రాత్రి రుద్రవరం ఎస్ఐ హనుమంతయ్య స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.కోటికి పైమాటేనని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. అజ్ఞాత వ్యక్తుల సమాచారం మేరకు భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎస్ఐతో పాటు సిబ్బంది గురువారం అడవిలో విస్తత తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎర్రచందనం డంప్‌తో పాటు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగల సరఫరా వెనుక బలమైన ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో స్మగ్లర్లు ఆహారం తయారీకి వినియోగించిన వంట పాత్రలు, కూరగాయాలు, బియ్యం పప్పుదిసుసులను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు దుంగల తూకానికి వినియోగించే వేయింగ్ మిషన్ కూడా ఉన్నట్లు సమాచారం. అటవీ ప్రాంతంలో వర్షాల కారణంగా వాహనాలు దుంగలను నిల్వ చేసిన ప్రదేశానికి వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా 10 నుంచి 15 రోజులుగా డంప్‌ను అక్కడే ఉంచినట్లుగా భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలను సైకిళ్ల సహాయంతో దిగుమతి చేసుకొని రుద్రవరం అటవీ ప్రాంతంలోని ఉల్లెడ మల్లేశ్వర స్వామి ఆలయం మీదుగా ఎంపిక చేసిన ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు సమాచారం. దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ భూపాల్ రెడ్డి, పోలీసులు శాంతిరెడ్డి, మస్తాన్, రమేష్ పాల్గొన్నారు. ఇదిలాఉండగా ఎస్ఐ హనుమంతయ్య విలేకరులతో మాట్లాడుతూ దుంగలను స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమేనని.. అయితే ఇవి ఎర్రచందనమా కాదా అనే విషయం ఫారెస్టు అధికారుల తనిఖీ అనంతరం వెల్లడిస్తామన్నారు.