పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌రెగ్యులేటర్
సాగునీటి ప్రాజెక్టుల వద్ద నిద్రించైనా పెండింగ్ పనులను పూర్తి చేయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు 2015 మే 12న బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థను పరిశీలించిన సమయంలో రైతాంగానికి హామీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్లీ పెండింగ్ ప్రాజెక్టుల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. పోతిరెడ్డిపాడు నూతన హెడ్‌రెగ్యులేటర్ ప్రారంభాన్ని ఏటేటా వాయిదా వేçస్తూ.. పెండింగ్‌లో ఉన్న 15 శాతం పనులను పూర్తి చేయించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది.
జూపాడుబంగ్లా(కర్నూలు): రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, తమిళనాడులోని చెన్నై ప్రాంతాలకు తాగు, సాగునీటికి
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గుండెకాయ లాంటిది. శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపునకు ఉద్దేశించిన నూతన హెడ్‌రెగ్యులేటర్ పెండింగ్ పనులను పూర్తి చేసి..ప్రారంభోత్సవం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పెండింగ్‌లో ఉన్నది 15 శాతం పనులే అయినప్పటికీ వాటిని కూడా పూర్తి చేయలేకపోతోంది. 2015 మార్చి 5న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరును పరిశీలించిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వంద రోజుల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేయించటంతో పాటు 2015 జూన్ నుంచి నూతన హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయిస్తానని ప్రకటించారు. సీఎం, మంత్రి ఇరువురూ ప్రాజెక్టులను సందర్శించి మూడేళ్లకు పైగా అవుతున్నా పనులు మాత్రం పూర్తి చేయించిన దాఖలాల్లేవు.
పెండింగ్ పనులపై శ్రద్ధేదీ?
రూ.201.347 కోట్ల అంచనా వ్యయంతో 2006 డిసెంబరులో నూతన హెడ్‌రెగ్యులేటర్ పనులు ప్రారంభమయ్యాయి. 2010 నాటికి దాదాపు 85 శాతం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేయించడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైంది. పనుల పెండింగ్ కారణంగా పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోలేని దుస్థితి నెలకొంది. దీంతో ఏటా టీఎంసీల కొద్దీ నీళ్లు దిగువకు వెళ్లిపోతున్నాయి. 16.5 కి.మీ మేర ఉన్న శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (ఎస్‌ఆర్‌ఎంసీ)ను బానకచర్ల వద్ద విస్తరించాల్సి ఉంది. అలాగే కాలువలో పూడిక తొలగించాలి. 0 నుంచి 9 కి.మీ వరకు కాలువ ఎడమగట్టును పటిష్టంచేసి.. స్టాండర్డు బ్యాంకు నిర్మించాల్సి ఉంది. కాలువ కుడిగట్టు వెంట బీటీ రహదారిని, నాలుగు ప్రాంతాల్లో వంతెనలను, అధికారుల నివాసగృహాలు, కంట్రోల్‌రూంను నిర్మించాలి. ఈ పనులన్నీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యాయి.
పూర్తికాని ఎస్‌ఆర్‌బీసీ విస్తరణ పనులు
పోతిరెడ్డిపాడుకు దిగువన ఉన్న తెలుగుగంగ, కేసీఎస్కేప్ కాలువలు 11వేల క్యూసెక్కుల నీటివిడుదలకు అనుకూలంగా ఉన్నా.. శ్రీశైలం కుడి ఉప కాలువ (ఎస్‌ఆర్‌బీసీ)ను మాత్రం 22వేల క్యూసెక్కులకు అనుగుణంగా విస్తరించలేదు. విస్తరణ పనులు నేటికీ కొన..సాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈ కాలువకు 4 –5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే గట్లు తెగిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఎస్‌ఆర్‌బీసీని విస్తరించేదాకా 22వేల క్యూసెక్కుల నీటిని సరఫరాచేసే అవకాశం లేదు.
నిర్వహణ లోపంతో గేట్ల మొరాయింపు
నీటిసరఫరా నిలిచిన వెంటనే అధికారులు హెడ్‌రెగ్యులేటరు గేట్లకు మరమ్మతులు చేపట్టి.. నీటివిడుదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. అయితే.. ఇవేవీ పట్టించుకోకపోవటంతో పోతిరెడ్డిపాడు పాత, కొత్త హెడ్‌రెగ్యులేటర్ల గేట్లు తుప్పుపట్టి ఎత్తితే దించలేం, దించితే ఎత్తలేం అన్నట్లుగా మారాయి. కొత్త హెడ్‌రెగ్యులేటరుకు ఉన్న పదిగేట్లలో ఆరు గేట్లకు రబ్బర్‌షీల్స్ ఊడిపోయాయి. వాటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహించకముందే డ్యాంలోకి నీళ్లు రావటంతో పనులు నిలిచిపోయాయి.
మొండికేసిన కాంట్రాక్టర్లు
0 నుంచి 9 కిలోమీటర్ల మేర స్టాండర్డు బ్యాంకును నిర్మించేదిలేదని కాంట్రాక్టర్లు అధికారులకు తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు చేరితే బ్యాక్‌వాటర్ కారణంగా ఎస్‌ఆర్‌ఎంసీ ఎడమగట్టుకు అభద్రత నెలకొనే ప్రమాదం ఉంది. 2009 వరదల సమయంలో బలహీనంగా ఉన్న ఎడమగట్టు తెగి.. దిగువన ఉన్న నంద్యాల పట్టణంతో పాటు మరికొన్ని ప్రాంతాలు మునకకు గురయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న పోతిరెడ్డిపాడు పనులను పూర్తి చేయించటంతో పాటు నూతన హెడ్‌రెగ్యులేటరు ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
కొంత సమయం పడుతుంది
పోతిరెడ్డిపాడు నీటినియంత్రణ వ్యవస్థ ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది. గాలేరు నగరి గేట్ల నిర్మాణం పూర్తికావాల్సి ఉంది. అలాగే ఎర్రగూడూరు వద్ద ఎస్‌ఆర్‌ఎంసీ పనులు పూర్తికావాలి. వీటితోపాటు కంట్రోల్‌రూం, బీటీరోడ్డు నిర్మాణం, స్టాఫ్‌రూం, స్టాండర్డ్‌బ్యాంక్ నిర్మాణ పనులు త్వరలో చేపడతాం.
– మనోహర్‌రాజు, ఈఈ, పోతిరెడ్డిపాడు
Comments
Please login to add a commentAdd a comment