దొంగ బాబాను నమ్మి ఐఐటీ-ఎం విద్యార్థిని..
చెన్నై: ప్రతిష్టాత్మక ఐఐటీ-ఎంలో చదవాల్సిన ఓ విద్యార్థిని ఆధ్మాత్మిక పరధ్యానంలో పడి ఓ దొంగ బాబ వలలో చిక్కుకోబోయింది. తాను సాధువుగా మారేందుకు హిమాలయాలకు వెళ్లిపోతున్నానంటూ లేఖలు రాసి హాస్టల్ గదిలో వదిలి వెళ్లింది. చివరకు తల్లిదండ్రులు, ఉత్తరాఖండ్ పోలీసులు కఠినంగా శ్రమించడంతో ఆ దొంగబాబా వద్ద ఆమెను గుర్తించి తిరిగి ఇంటికి తీసుకొచ్చారు.
చెన్నైలోని ఐఐటీ-ఎం క్యాంపస్లో చదువుతున్న వేదాంతం ఎల్ ప్రత్యూష అనే అమ్మాయి గత నెల 17న తాను ఉంటున్న హాస్టల్ గదిలో రెండు ఆంగ్లంలో మూడు తెలుగులో లేఖలు రాసి తాను సాధువుగా మారిపోతున్నానని వివరిస్తూ అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా వెళ్లి పోయింది. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో ఆమె తండ్రి పురుషోత్తమాన్ చెన్నైలోని కొట్టుర్పూరం అనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరాఖండ్ కు వెళ్లి అక్కడ పోలీసుల సహాయం తీసుకున్నాడు.
వారు ఆమె చివరిసారిగా మాట్లాడిన ఫోన్ కాల్ డేటా ప్రకారం ఆరోజు ఐదు సార్లు భాస్కర్ అనే వ్యక్తితో మాట్లాడింది. ఈ భాస్కర్ అనే వ్యక్తి దొంగ బాబా శివ గుప్తా అనే ఫేక్ ఆధ్మాత్మిక గురువుకు సంబంధించినవాడు. అతడు ఆమెకు పలుమాటలు చెప్పి తమ గురువు గారు మోక్ష మార్గాన్ని చెబుతారని నమ్మించి ఆమెను ఆశ్రమంలోకి తీసుకెళ్లాడు.
ఈ నేపథ్యంలో చివరి కాల్ ప్రకారం ఆమె మాట్లాడిన ప్రాంతాన్ని గుర్తించి ఆ చుట్టు పక్కల ప్రతి ఇంటి గడపకు వెళ్లి వెతకగా చివరకు ఆమె బాబా ఆశ్రమంలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బ్రాడిపేట్లోని తమ నివాసంలో సురక్షితంగా ఉందని తెలుపుతూ ఆమె తండ్రి చెన్నైలో కేసును వాపసు తీసుకున్నాడు. ఆ ఆశ్రమంలో ఎంతోమంది అమ్మాయిలు, మహిళలు ఉన్నట్లు వారంతా మాయమాటల నమ్మి ఆ బాబా వద్ద చిక్కుకున్నట్లు ఆయన తెలిపారు.