vedio conference
-
నేర విచారణకు వీడియో కాన్ఫరెన్స్
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి కర్నూలు : నేర విచారణకు వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి తెలిపారు. శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ఆకే రవికృష్ణ అధ్యక్షతన నేర సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. నేర విచారణ నిమిత్తం ఇతర జిల్లాల నుంచి నిందితులు కర్నూలు జిల్లా కోర్టుకు రాకుండా.. ఆయా జిల్లాల జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిస్తామన్నారు. ఈ మేరకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉండకుండా ఎప్పటికప్పుడు తగ్గించాలన్నారు. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. నేర దర్యాప్తులో క్షేత్రస్థాయి అధికారులు నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి పోలీసు సర్కిళ్ల పరిధిలో ఎవరికి వారుగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆకే రవికృష్ణ.. పోలీసు అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ ప్రమాదాలను నివారించాలన్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌ను ఉద్ధృతం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వాహన చోదకులు కార్లలో వెళ్లేటప్పుడు సీటు బెల్టు, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్ వినియోగంచేలా అవగాహన కల్పించాలన్నారు. జాతీయ రహదారుల టోల్గేట్ల వద్ద వేకువజామున ప్రమాదాలు జరగకుండా వాటి పరిధిలోని పోలీసులు.. డ్రైవర్లకు టీ అందించి రోడ్డు భద్రత నియమాలు పాటించేలా తెలియజేయాలన్నారు. రాత్రి గస్తీ నిర్వహించే పోలీసులు రేడియం జాకెట్లు తప్పనిసరిగా ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి పై అధికారులకు సమాచారం అందించాలన్నారు. పోలీసు పరిధిలోని హాస్పిటల్స్ యాజమాన్యాలతో సన్నిహితంగా ఉండి ప్రమాద బాధితులకు వైద్యచికిత్సలు అందేలా చూడాలన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారుల పక్కనున్న డాబాల్లో మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ షేక్షావలీ, ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు బాబుప్రసాద్, రమణమూర్తి, కొల్లి శ్రీనివాసులు, వెంకటాద్రి, హరినాథరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, బాబా ఫకృద్దీన్, రామచంద్ర, డీపీఓ ఏఓ అబ్దుల్ సలాంతో పాటు న్యాయ శాఖ అధికారులు, జైళ్ల శాఖ అధికారులు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం
కర్నూలు(హాస్పిటల్): పక్కా ప్రణాళికతో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. మండల అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టర్.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 29న అన్ని పీహెచ్‌సీలు, హెల్త్ సెంటర్లలో, పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్ బూత్‌లలో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఈ నెల 30, 31, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో ఇంటింటికి తిరిగి కేంద్రాలకు రాని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడ్, డీఎంహెచ్‌వో డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి, డ్వామా పీడీ పుల్లారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రనాథ్, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాసాధికార సర్వేను నేటితో ముగించండి
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వేను ఎట్టి పరిస్థితుల్లోను నేటితో(30వ తేదీ) ముగించాలని రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునీత తెలిపారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ మాట్లాడుతూ.. ప్రజా సాధికార సర్వేలోకి రాని వారు ఏఏ కారణాలతో దూరంగా ఉన్నారో రాతపూర్వకంగా తెలపాలన్నారు. ఎన్యూమరేటర్ల నుంచి తహశీల్దార్లు, తహసీల్దార్ల నుంచి జిల్లా కలెక్టర్లు సర్వే పరిధిలోకి రాని వారి పూర్తి సమాచారం సేకరించాలన్నారు. సర్టిఫికెట్లు తీసుకోవడంతో సర్వే ముగిసినట్లు అవుతుందన్నారు. సర్వే విభాగానికి సంబంధించి ఎఫ్‌ఎంబీల డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందులో తగిన నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణాలకు నిధులు విడుదల చేశామని.. వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కర్నూలు నుంచి జేసీ హరికిరణ్ మాట్లాడుతూ... భూసేకరణకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ అథారిటీని ఏర్పాటు చేయాలని, అప్పుడే రైతులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సీసీఎల్ఏ స్పందిస్తూ అప్పిలేట్ అథారిటీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సర్వే ఏడీ చిన్నయ్య, సెక్షన్ సూపరింటెండెంట్లు ఈరన్న, భాగ్యలక్ష్మి, రామాంజనమ్మ, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. -
పండగరోజే కొత్తజిల్లాల ప్రారంభం
గద్వాల : దసరా పండగరోజే నూతన జిల్లాలను ప్రారంభించాలని అందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. కొత్త జిల్లాల ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గద్వాల ఆర్డీఓ కార్యాలయం నుంచి కలెక్టర్ టీకే శ్రీదేవి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కొత్త జిల్లాలకు సంబంధించి ఈనెల 11వ తేదీ ఉదయమే నోటిఫికేషన్ వెలువడుతుందని వెల్లడించారు. ఉదయం 10.30గంటల నుంచి కొత్త జిల్లాలు, వాటి విధులను ప్రారంభించాల్సి ఉంటుందని ఆదేశించారు. జిల్లాల ప్రారంభోత్సవ నేపథ్యంగా జాతీయ పతాకావిష్కరణ, గార్డ్ ఆఫ్ హానర్, జాతీయ గీతాలాపన వంటివి ఉంటాయని సీఎస్ తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో సూచించిన మేరకు లబ్ది అందించే పథకాల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో నూతన జిల్లాల ప్రారంభోత్సవ బాధ్యతలను మంత్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను వివరించారు. -
మొక్కలకు జియోట్యాగింగ్ తప్పనిసరి
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ఇప్పటివరకు నాటిన మొక్కలకు జియోట్యాగింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలని హరితహారం కార్యక్రమం చీఫ్ కన్సర్వేటర్ పి.కె.ఝా అధికారులకు సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి టెక్నికల్ అధికారులతో కలిసి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో నాటిన మొక్కలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాలన్నారు. వివరాల నమోదుపై టెక్నికల్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. హరితహారంపై రూపొందించిన మొబైల్ యాప్ వినియోగంపై పలు సూచనలు చేశారు. ఇప్పటివరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో 1.93కోట్ల మొక్కలు నాటినట్టు డీఎఫ్ఓ రామమూర్తి తెలిపారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొకలను నాటాలని పికె.ఝా అన్నారు. దీనికి జిల్లా ఎకై ్సజ్, కార్మిక శాఖ, విద్యాశాఖ, డ్వామా అధికారులు హాజరయ్యారు. -
రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలయ్యేలా చూడాలి
ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి సాక్షి, హైదరాబాద్ : జిల్లాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని, దీన్ని జిల్లాస్థాయిలో నోడల్ అధికారిగా అమలుచేసే బాధ్యత ఎస్సీశాఖ జిల్లా అధికారిదేనని ఎస్సీ అభివృద్ధిశాఖ డెరైక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జేడీలు ఆర్. వేణుగోపాలరావు, ఉమాదేవి, డిప్యూటీ డెరైక్టర్లు, సహాయ సంక్షేమ, అసిస్టెంట్ అకౌంట్స్, సీజీజీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లను కలుసుకుని, వివిధ శాఖలతో సమావేశాలు ఏర్పాటుచేసి బ్యాక్లాగ్ పోస్టులు గుర్తించాలని, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ పాటిం చేలా చూడాలన్నారు. రాష్ట్రంలో సఫాయి కర్మచారీల పునరావాసంపై జిల్లా మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, అత్యాచారాలు, దాడులకు గురైన సందర్భాల్లో ఎస్సీ, ఎస్టీ బాధితులకు పరిహారాన్ని ఇవ్వడానికి ట్రెజరీ పరిమితులను ఎత్తేసి, గ్రీన్ ఛానెల్లో ఉంచినట్లు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాధితులకు జిల్లా కలెక్టర్ ద్వారా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు. అన్ని హాస్టళ్లలో బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా చూడాలని కోరారు.