నేర విచారణకు వీడియో కాన్ఫరెన్స్
నేర విచారణకు వీడియో కాన్ఫరెన్స్
Published Sat, May 6 2017 10:29 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM
– జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి
కర్నూలు : నేర విచారణకు వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి తెలిపారు. శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ఆకే రవికృష్ణ అధ్యక్షతన నేర సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. నేర విచారణ నిమిత్తం ఇతర జిల్లాల నుంచి నిందితులు కర్నూలు జిల్లా కోర్టుకు రాకుండా.. ఆయా జిల్లాల జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపిస్తామన్నారు. ఈ మేరకు పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉండకుండా ఎప్పటికప్పుడు తగ్గించాలన్నారు. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. నేర దర్యాప్తులో క్షేత్రస్థాయి అధికారులు నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ
రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి పోలీసు సర్కిళ్ల పరిధిలో ఎవరికి వారుగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆకే రవికృష్ణ.. పోలీసు అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ ప్రమాదాలను నివారించాలన్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌ను ఉద్ధృతం చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వాహన చోదకులు కార్లలో వెళ్లేటప్పుడు సీటు బెల్టు, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు హెల్మెట్ వినియోగంచేలా అవగాహన కల్పించాలన్నారు. జాతీయ రహదారుల టోల్‌గేట్ల వద్ద వేకువజామున ప్రమాదాలు జరగకుండా వాటి పరిధిలోని పోలీసులు.. డ్రైవర్లకు టీ అందించి రోడ్డు భద్రత నియమాలు పాటించేలా తెలియజేయాలన్నారు.
రాత్రి గస్తీ నిర్వహించే పోలీసులు రేడియం జాకెట్లు తప్పనిసరిగా ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి పై అధికారులకు సమాచారం అందించాలన్నారు. పోలీసు పరిధిలోని హాస్పిటల్స్ యాజమాన్యాలతో సన్నిహితంగా ఉండి ప్రమాద బాధితులకు వైద్యచికిత్సలు అందేలా చూడాలన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారుల పక్కనున్న డాబాల్లో మద్యం విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ షేక్‌షావలీ, ఓఎస్‌డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు బాబుప్రసాద్, రమణమూర్తి, కొల్లి శ్రీనివాసులు, వెంకటాద్రి, హరినాథరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, బాబా ఫకృద్దీన్, రామచంద్ర, డీపీఓ ఏఓ అబ్దుల్ సలాంతో పాటు న్యాయ శాఖ అధికారులు, జైళ్ల శాఖ అధికారులు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement