భలే పెళ్లి దొంగలు
వివాహం పేరిట దోపిడీ
ముగ్గురు మహిళల అరెస్ట్
సేలం: పెళ్లి పేరులో మోసం చేస్తున్న ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మదురై జిల్లా ఉసిలంపట్టి సమీపంలోని బుద్ధిపురం గ్రామానికి చెందిన మహిళ పెరుమాయి (58). చిన్న కుమారుడు మురుగన్‌కు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తోంది. ఈ క్రమంలో పొల్లాచ్చికి చెందిన విజయ పరిచయమైంది. తన వద్ద చాలా సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో బ్రోకర్ కమిషన్‌గా రూ.1.30 లక్షలు పెరుమాయి విజయకు ఇచ్చింది. తర్వాత తిరుపూర్‌కు చెందిన ఒక మహిళతో మురుగన్‌కు సంబంధాన్ని కుదిర్చింది.
వివాహమైన మరుసటి రోజు వధువు, ఆమె బంధువులు డబ్బులు, నగలు దోచుకుని పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనవల్ల తప్పు జరిగిందని విజయ పెరుమాయికి మరో సంబంధం చూసింది. అరుప్పుకోటకు చెందిన అరుణాదేవి (39)ని మురుగన్‌కు వివాహం చేద్దామని పెరుమాయికి విజయ తెలిపింది. పెరుమాయికి అనుమానం రావడంతో విజయతో వచ్చిన అరుణాదేవి, తూత్తుకుడి వ.ఉ.సి నగర్‌కు చెందిన కస్తూరి (52)లను ఇరుగుపొరుగు వారి సహకారంతో పట్టుకుని కట్టేసి ఉసిలంపట్టి పోలీసులకు అప్పగించింది.
మోసానికి పాల్పడిన పొల్లాచ్చికి చెందిన విజయ, తూత్తుకుడికి చెందిన కాళీశ్వరి, అరుపుక్కోట్టకు చెందిన అరుణాదేవి, అదేవిధంగా పొల్లాచ్చి, తిరుపూర్ ప్రాంతాలకు చెందిన శీనివాసన్, జయభారతి, సుజితా, మురళీధరన్ అనే ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అనంతరం విజయ, కాళీశ్వరి, అరుణాదేవి అనే ముగ్గురిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. వివాహం కోసం అమ్మాయిని వెతుకుతున్న వారిపై దృష్టి సారించి వివాహం చేసి, రాత్రికి రాత్రే దొరికినంత డబ్బు, నగలు దోచుకుని వెళ్లే ముఠా అని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment