పండగరోజే కొత్తజిల్లాల ప్రారంభం
Published Sun, Oct 9 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
గద్వాల : దసరా పండగరోజే నూతన జిల్లాలను ప్రారంభించాలని అందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. కొత్త జిల్లాల ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గద్వాల ఆర్డీఓ కార్యాలయం నుంచి కలెక్టర్ టీకే శ్రీదేవి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కొత్త జిల్లాలకు సంబంధించి ఈనెల 11వ తేదీ ఉదయమే నోటిఫికేషన్ వెలువడుతుందని వెల్లడించారు.
ఉదయం 10.30గంటల నుంచి కొత్త జిల్లాలు, వాటి విధులను ప్రారంభించాల్సి ఉంటుందని ఆదేశించారు. జిల్లాల ప్రారంభోత్సవ నేపథ్యంగా జాతీయ పతాకావిష్కరణ, గార్డ్ ఆఫ్ హానర్, జాతీయ గీతాలాపన వంటివి ఉంటాయని సీఎస్ తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో సూచించిన మేరకు లబ్ది అందించే పథకాల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో నూతన జిల్లాల ప్రారంభోత్సవ బాధ్యతలను మంత్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి జిల్లాలో కొత్తగా ఏర్పడిన నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను వివరించారు.
Advertisement