వర్మ మోసం చేశాడు
సాక్షి, చెన్నై : ‘నా భర్త గురించి మీకు ఏమి తెలుసు...ఇష్టం వచ్చినట్టు కథలను అల్లు కుంటూ పోతున్నారు...నాలుగేళ్లు ఆయనతో అడవుల్లో జీవించా. ఆయన ఏమిటో నా ఒక్కదానికే తెలుసు. త్వరలో వాస్తవాలన్నీ బయట పెడతా. సినిమా రూపంలో తెర వెనుక జీవితం గుట్టు విప్పుతా’ అని చందనపు దొంగ వీరప్పన్ సతీమని ముత్తులక్ష్మి వీరావేశంతో వ్యాఖ్యలు చేశారు. రాంగోపాల్ వర్మ ‘విల్లాది విల్లన్ వీరప్పన్’ చిత్రాన్ని ఎవ్వరూ దయ చేసి చూడ వద్దు అని, ఆ కథ పూర్తిగా వీరప్పన్ జీవితానికి సంబంధం లేని కథగా పేర్కొన్నారు.
ప్రఖ్యాత దర్శకుడు రాంగోపాల్ వర్మ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కించిన వీరప్పన్ జీవిత ఇతివృత్తాంత కథ తమిళంలో విల్లాది విల్లన్ వీరప్పన్‌గా శుక్రవారం తెరకెక్కింది. అయితే, ఈ చిత్రం విడుదలను వ్యతిరేకిస్తూ వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మి మీడియా ముందుకు వచ్చారు. ఆ చిత్రాన్ని ఎవ్వరూ చూడవద్దు అని, అందులోని కథ వీరప్పన్ జీవితానికి పూర్తి భిన్నంగా ఉందని ధ్వజమెత్తారు. వీరప్పన్ జీవిత ఇతి వృత్తాంతం ఆధారంగా హిందీలో సినిమా తీసుకున్నట్టు తనతో రాంగోపాల్ వర్మ చెప్పారని, అందుకు తగ్గ సంతకం కూడా చేయించుకున్నారని గుర్తు చేశారు. హిందీలో అని చెప్పి ఇప్పుడు అన్ని భాషల్లో విడుదల చేసే పనిలో పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరప్పన్ గురించి అస్సలు ఆయనకు ఏమి తెలుసు అని ప్రశ్నించారు.
వీరప్పన్ వ్యక్తిగత జీవితం గురించి తనకు తప్పా మరెవ్వరికీ తెలియదని, ఆయన అజ్ఞాతంలో ఉన్నా, ఏ తప్పు చేయలేదని వ్యాఖ్యానించారు. తన భర్తకు పోలీసులకు మధ్య సమరం అన్నది ప్రధాన అంశం అని, ఆయన్ను పట్టుకునే క్రమంలో ఎంత మంది మహిళలపై పోలీసులు అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడ్డారో తెలుసా అని ప్రశ్నించారు. అయితే, వీరప్పన్ తన జీవితంలో ఎవరి మీద ఎలాంటి అత్యాచారాలకు పాల్పడ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
మీకు ఏమి తెలుసు: వీరప్పన్ 36 ఏళ్ల అజ్ఞాత జీవితం గురించి, అందుకు దారి తీసిన పరిణామాలు, పరిస్థితుల గురించి ఏ ఒక్కరికి ఇంత వరకు తెలియదని స్పష్టం చేశారు. నాలుగు సంవత్సరాలు ఆయనతో జీవించానని, ఆయన ఏమిటో పూర్తిగా తనకు మాత్రమే తెలుసునని పేర్కొన్నారు. తమిళ ప్రజలకు త్వరలో వీరప్పన్ గురించి వాస్తవాలు తెలుస్తాయని, అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. తమిళంలో సినిమా రూపంలో వాస్తవాలను తెరకెక్కించేందుకు ఏ ఒక్కరూ ధైర్యం చేయడం లేదు అని, ఇందుకు కారణం రాజకీయ, పోలీసుల జోక్యం వీరప్పన్ కథతో ముడిపడి ఉండడమేనని పేర్కొన్నారు.
ఈ వాస్తవాలను సినిమా రూపంలో బయట పెడతానని, వీరప్పన్ జీవితం తెర వెనుక ఉన్న గుట్టు ప్రపంచానికి చాటే విధంగా ముందుకు సాగుతున్నానని వ్యాఖ్యానించారు. అయితే, తనకు ఆంగ్లం రాదు అని, అందుకే రాంగోపాల్ వర్మ మోసం చేశాడని ఈసందర్భంగా ఆరోపించారు. కన్నడ వెర్షెన్ చిత్రాన్ని వ్యతిరేకిస్తూ కర్నాటక కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, అయితే, అది తిరస్కరణకు గురి అయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎలా చంపాడో: లాస్ట్ ఎన్‌కౌంటర్‌పేరుతో ఐపీఎస్ అధికారి విజయకుమార్ పుస్తకం రచిస్తున్నారంటా, అందులో తన భర్తను ఎలా చంపాడో వివరించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. వీరప్పన్‌ను పట్టుకునేందుకు విజయకుమార్ శ్రమించిందేమీ లేదు అని, విజయకుమార్‌కు ముందుగా ఎందరో డీఎస్పీలు, ఎస్పీలు, డీజీపీ వంటి అధికారులు తీవ్రంగా శ్రమించారని గుర్తు చేశారు.
అయితే, 2004లో నాటకీయంగా తన భర్తను విజయకుమార్ హతమార్చి ఎన్కౌంటర్ చేసినట్టు కట్టు కథను అల్లారని ఆరోపించారు. ముందుగా విష ప్రయోగం చేసి, తర్వాతే హతమార్చారని ఈ విషయాన్ని తన లాస్ట్ ఎన్కౌంటర్లో విజయకుమార్ స్పష్టం చేస్తారా? అని ప్రశ్నించారు. లేదా, తన భర్తతో ఎదురెదురుగా ఢీకొట్టి చంపాడా..? శ్రీలంకకు పారిపోతుండగా చంపాడని రాస్తారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తన భర్తను మర్యాద లేకుండా వాడు, వీడు అని వ్యాఖ్యానిస్తున్నారని, రాస్తున్నారని, ఆయన ప్రాణాలతో ఉండి ఉంటే, ఇలా రాయ గలరా..? అని ప్రశ్నించడం గమనార్హం.