వీరప్పన్ చిత్రం విడుదలపై అభ్యంతరం
బెంగళూరు : తమ అనుమతిలేనిదే 'కిల్లర్ వీరప్పన్' సినిమా విడుదల చేయరాదని వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... కిల్లర్ వీరప్పన్ సినిమాను హిందీలో తెరకెక్కించడానికి మాత్రమే తన నుంచి దర్శకుడు రామ్గోపాల్వర్మ అనుమతి పొందారని చెప్పారు. అయితే కన్నడ, తమిళ భాషల్లో సినిమా తీయడానికి అనుమతి పొందలేదని ఆమె స్పష్టం చేశారు.
కిల్లర్ వీరప్పన్ సినిమాను హిందీ, తమిళ భాషల్లో మాత్రమే విడుదల చేయాలన్నారు. అదికూడా మొదట తాను కిల్లర్వీరప్పన్ చిత్రం చూసిన తరువాతేనే ఆ సినిమా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కిల్లర్ వీరప్పన్ అనే సినిమా టైటిల్ అభ్యంతరంగా ఉందని ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు వీరప్పన్ను అవహేళనగా చూపించినట్లు తెలుస్తోందన్నారు. ఈ సినిమాలో వీరప్పన్ను చెడుగా చూపించినట్లైతే ఆ ప్రభావం కుటుంబ సభ్యులపై పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కిల్లర్ వీరప్పన్ సినిమాను అడ్డుకోవడానికి కోర్టు అనుమతి పొందామని తెలిపారు.
2006 సంవత్సరంలోనే రూ. 31 లక్షలు ముత్తులక్ష్మికి అందించి కిల్లర్ వీరప్పన్ సినిమా హక్కులు పొందామని అట్టహాస కన్నడ సినిమా డైరెక్టర్ ఎ.ఎమ్.రమేశ్ తెలిపారు. కన్నడ, తమిళ భాషల్లో కిల్లర్ వీరప్పన్ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదల చేసే సమయంలో కేసు పెట్టి ఇలా అడ్డంకులు సృష్టించడం విడ్డూరంగా ఉందని రమేశ్ వాపోయారు.