Vehicle charges
-
స్మార్ట్ పార్కింగ్ స్టార్ట్!
సాక్షి, హైదరాబాద్: మెట్రో స్టేషన్లలో పార్కింగ్ కష్టాలు తీరనున్నాయి. స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో నగరవాసులకు ఊరట లభించింది. మియాపూర్–అమీర్‌పేట్–నాగోల్ (30 కి.మీ.) మార్గంలో 24 మెట్రో స్టేషన్ల వద్ద ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ అధునాతన పార్కింగ్ వ్యవస్థతోపాటు ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ పాయింట్‌ను బేగంపేట్‌లోని మెట్రోస్టేషన్ వద్ద మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగం ద్వారా కాలుష్యానికి చెక్ పెట్టవచ్చన్నారు. ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల వినియోగ పెంపును ప్రోత్సహిస్తోందన్నారు. వాహనాల విద్యుత్ చార్జింగ్‌ను ప్రస్తుతానికి ఉచితంగానే అందిస్తున్నామని, త్వరలో యూనిట్ విద్యుత్ చార్జింగ్కు రూ.6 చొప్పున వసూలు చేసే అవకాశం ఉందన్నారు. ఒక కిలోమీటరు వాహన ప్రయాణానికి రూ.2 ఖర్చు కానుందని, భవిష్యత్‌లో ధర తగ్గనుందన్నారు. వాహనాల చార్జింగ్ ఇలా.. ఫిన్లాండ్కు చెందిన ఫోర్టమ్ సంస్థ పలు మెట్రో స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ బైక్‌లు, కార్లు చార్జింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ సంస్థ బేగంపేట్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, స్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సిగూడ స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ వాహనాలు చార్జింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ సంస్థ సైతం మియాపూర్, బాలానగర్ స్టేషన్లలో చార్జింగ్ సదుపాయం కల్పించింది. ప్రస్తుతం వాహనాల చార్జింగ్ ఉచితం. ఎలక్ట్రికల్ కార్లు లేదా బైక్‌ను 45 నిమిషాల్లో చార్జింగ్ చేసుకోవచ్చు. కిలోమీటరుకు రూ.2 ఖర్చుతో ప్రయాణం సాగించవచ్చు. 36 చార్జింగ్ పాయింట్లు ఇక్కడే.. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ సంస్థల భాగస్వామ్యంతో విద్యుత్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు మెట్రో స్టేషన్ల ఆవరణలో స్థలాన్ని కేటాయిస్తున్నామన్నారు. ఫోర్టం సంస్థ ద్వారా దేశ వ్యాప్తంగా 40 వాహన చార్జింగ్ పాయింట్లు ఉండగా, హైదరాబాద్‌లోనే 36 పాయింట్లు ఉన్నాయన్నారు. పార్క్ హైదరాబాద్ యాప్ ద్వారా ఏ స్టేషన్లో పార్కింగ్ సౌక ర్యం ఉందో, ఎక్కడ ఖాళీ ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం నగరంలోని మెట్రో స్టేషన్ల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ పార్కింగ్ కేంద్రాల్లో 42 వేల బైక్‌లు, 400 కార్లను నిలిపేందు కు వీలుందన్నారు. బైక్‌కు రోజుకు రూ.10, కారు కు రూ.20 వసూలు చేస్తున్నప్పటికీ భవిష్యత్‌లో బైక్‌కు గంటకు రూ.3, కారుకు రూ.8 వసూలు చేయనున్నామన్నారు. అన్ని మెట్రో పార్కింగ్ కేంద్రాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో, నగర పోలీసు యంత్రాంగం కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్క్ హైదరాబాద్ నిర్వాహకులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టోల్గేట్ వద్ద అక్రమ వసూళ్ల పండగ
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో వాహనాల రద్దీని టోల్‌గోట్ సిబ్బంది ఆసరాగా తీసుకుని అక్రమంగా వసుళ్లకు పాల్పడుతున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని టోల్గేట్ వద్ద ఛార్జీలు వసూళ్లు చెయ్యవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా మహబూబ్‌నగర్ జిల్లా రాయకల్ టోల్గేట్ వద్ద సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఛార్జీలు వసూళ్లు చెయ్యవద్దని చెప్పినా సిబ్బంది వసూళ్లు చేస్తున్నారంటూ వాహనదారులు ఆందోళన చేస్తున్నారు. తమకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని టోల్గేట్ సిబ్బంది చెప్తున్నారు. దీంతో టోల్గేట్ సిబ్బందిపై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
వాహనదారులపై పిడుగు
రవాణాశాఖలో భారీగా పెరిగిన ఫీజులు నేటి నుంచి అమల్లోకి.. అనంతపురం సెంట్రల్ : వాహనదారులపై పిడుగు పడింది. రోడ్డు రవాణా శాఖకు వాహనదారులు చెల్లించే పన్నులు, ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచేసింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్, రెన్యూవల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, రోడ్డు ట్యాక్స్ తదితర పన్నుల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి వీలుగా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఊహించని రీతిలో ఫీజులను పెంచేసింది. ఇది వరకూ డ్రైవింగ్ లైసెన్స్‌కు రూ. 600 కాగా.. పెరిగిన ధర ప్రకారం రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష హాజరైన అభ్యర్థి ఫెయిల్ అయితే గతంలో రూ.50 ఉండగా.. ప్రస్తుతం రూ.600లకు పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత రెన్యూవల్ చేసుకోకపోతే ఏడాదికి రూ.వెయ్యి చొప్పున అపరాధ రుసుం వేయనున్నారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్టీ) గడువు ముగిసిన తర్వాత రెన్యూవల్ చేసుకోకపోతే రోజుకు రూ.50 చొప్పున అపరాధ రుసుం వేయనున్నారు. ఇది వరకూ ఈ రెండింటికీ ఎలాంటి అపరాధ రుసుమూ ఉండేది కాదు. మధ్యాహ్నం నుంచి ఆగిన సేవలు : పన్నులు, ఫీజులను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రోడ్డు రవాణాశాఖలో సేవలు ఆగిపోయాయి. పెంచిన రేట్ల విషయంపై ఇంకా క్లారిటీ లేకపోవడంతో సేవలను నిలుపుదల చేశారు. కంప్యూటర్లో పాతరేట్లు కనిపిస్తుండడంతో అధికారులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. దీంతో వివిధ పనుల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన ప్రజలను అధికారులు వెనక్కు పంపారు. వెంటనే అమల్లోకి..: సుందర్‌వద్దీ, ఉపరవాణా కమిషనర్ (డీటీసీ) పన్నులు, ఫీజుల విషయంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన రేట్లు తక్షణం అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. జిల్లాలో మంగళవారం నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయి.