స్మార్ట్‌ పార్కింగ్‌ స్టార్ట్‌! | Smart Parking System In Hyderabad | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ పార్కింగ్‌ స్టార్ట్‌!

Published Tue, May 21 2019 1:12 AM | Last Updated on Tue, May 21 2019 1:12 AM

Smart Parking System In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో స్టేషన్లలో పార్కింగ్‌ కష్టాలు తీరనున్నాయి. స్మార్ట్‌ పార్కింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో నగరవాసులకు ఊరట లభించింది. మియాపూర్‌–అమీర్‌పేట్‌–నాగోల్‌ (30 కి.మీ.) మార్గంలో 24 మెట్రో స్టేషన్ల వద్ద ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ అధునాతన పార్కింగ్‌ వ్యవస్థతోపాటు ఎలక్ట్రికల్‌ వాహనాల చార్జింగ్‌ పాయింట్‌ను బేగంపేట్‌లోని మెట్రోస్టేషన్‌ వద్ద మున్సిపల్‌ పరిపాలన ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ ఆధారిత వాహనాల వినియోగం ద్వారా కాలుష్యానికి చెక్‌ పెట్టవచ్చన్నారు. ప్రభుత్వం కూడా విద్యుత్‌ వాహనాల వినియోగ పెంపును ప్రోత్సహిస్తోందన్నారు. వాహనాల విద్యుత్‌ చార్జింగ్‌ను ప్రస్తుతానికి ఉచితంగానే అందిస్తున్నామని, త్వరలో యూనిట్‌ విద్యుత్‌ చార్జింగ్‌కు రూ.6 చొప్పున వసూలు చేసే అవకాశం ఉందన్నారు. ఒక కిలోమీటరు వాహన ప్రయాణానికి రూ.2 ఖర్చు కానుందని, భవిష్యత్‌లో ధర తగ్గనుందన్నారు.  

వాహనాల చార్జింగ్‌ ఇలా.. 
ఫిన్లాండ్‌కు చెందిన ఫోర్టమ్‌ సంస్థ పలు మెట్రో స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్‌ బైక్‌లు, కార్లు చార్జింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ సంస్థ బేగంపేట్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, స్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సిగూడ స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్‌ వాహనాలు చార్జింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ సంస్థ సైతం మియాపూర్, బాలానగర్‌ స్టేషన్లలో చార్జింగ్‌ సదుపాయం కల్పించింది. ప్రస్తుతం వాహనాల చార్జింగ్‌ ఉచితం. ఎలక్ట్రికల్‌ కార్లు లేదా బైక్‌ను 45 నిమిషాల్లో చార్జింగ్‌ చేసుకోవచ్చు. కిలోమీటరుకు రూ.2 ఖర్చుతో ప్రయాణం సాగించవచ్చు.  

36 చార్జింగ్‌ పాయింట్లు ఇక్కడే..
మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ సంస్థల భాగస్వామ్యంతో విద్యుత్‌ చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు మెట్రో స్టేషన్ల ఆవరణలో స్థలాన్ని కేటాయిస్తున్నామన్నారు. ఫోర్టం సంస్థ ద్వారా దేశ వ్యాప్తంగా 40 వాహన చార్జింగ్‌ పాయింట్లు ఉండగా, హైదరాబాద్‌లోనే 36 పాయింట్లు ఉన్నాయన్నారు. పార్క్‌ హైదరాబాద్‌ యాప్‌ ద్వారా ఏ స్టేషన్లో పార్కింగ్‌ సౌక ర్యం ఉందో, ఎక్కడ ఖాళీ ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం నగరంలోని మెట్రో స్టేషన్ల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్‌ పార్కింగ్‌ కేంద్రాల్లో 42 వేల బైక్‌లు, 400 కార్లను నిలిపేందు కు వీలుందన్నారు. బైక్‌కు రోజుకు రూ.10, కారు కు రూ.20 వసూలు చేస్తున్నప్పటికీ భవిష్యత్‌లో బైక్‌కు గంటకు రూ.3, కారుకు రూ.8 వసూలు చేయనున్నామన్నారు. అన్ని మెట్రో పార్కింగ్‌ కేంద్రాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో, నగర పోలీసు యంత్రాంగం కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్క్‌ హైదరాబాద్‌ నిర్వాహకులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement