smart parking system
-
స్మార్ట్ పార్కింగ్ స్టార్ట్!
సాక్షి, హైదరాబాద్: మెట్రో స్టేషన్లలో పార్కింగ్ కష్టాలు తీరనున్నాయి. స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో నగరవాసులకు ఊరట లభించింది. మియాపూర్–అమీర్‌పేట్–నాగోల్ (30 కి.మీ.) మార్గంలో 24 మెట్రో స్టేషన్ల వద్ద ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ అధునాతన పార్కింగ్ వ్యవస్థతోపాటు ఎలక్ట్రికల్ వాహనాల చార్జింగ్ పాయింట్‌ను బేగంపేట్‌లోని మెట్రోస్టేషన్ వద్ద మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగం ద్వారా కాలుష్యానికి చెక్ పెట్టవచ్చన్నారు. ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల వినియోగ పెంపును ప్రోత్సహిస్తోందన్నారు. వాహనాల విద్యుత్ చార్జింగ్‌ను ప్రస్తుతానికి ఉచితంగానే అందిస్తున్నామని, త్వరలో యూనిట్ విద్యుత్ చార్జింగ్కు రూ.6 చొప్పున వసూలు చేసే అవకాశం ఉందన్నారు. ఒక కిలోమీటరు వాహన ప్రయాణానికి రూ.2 ఖర్చు కానుందని, భవిష్యత్‌లో ధర తగ్గనుందన్నారు. వాహనాల చార్జింగ్ ఇలా.. ఫిన్లాండ్కు చెందిన ఫోర్టమ్ సంస్థ పలు మెట్రో స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ బైక్‌లు, కార్లు చార్జింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ సంస్థ బేగంపేట్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్, స్టేడియం, తార్నాక, మెట్టుగూడ, హబ్సిగూడ స్టేషన్ల వద్ద ఎలక్ట్రికల్ వాహనాలు చార్జింగ్ చేసుకునే సదుపాయం కల్పించింది. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ సంస్థ సైతం మియాపూర్, బాలానగర్ స్టేషన్లలో చార్జింగ్ సదుపాయం కల్పించింది. ప్రస్తుతం వాహనాల చార్జింగ్ ఉచితం. ఎలక్ట్రికల్ కార్లు లేదా బైక్‌ను 45 నిమిషాల్లో చార్జింగ్ చేసుకోవచ్చు. కిలోమీటరుకు రూ.2 ఖర్చుతో ప్రయాణం సాగించవచ్చు. 36 చార్జింగ్ పాయింట్లు ఇక్కడే.. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ సంస్థల భాగస్వామ్యంతో విద్యుత్ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు మెట్రో స్టేషన్ల ఆవరణలో స్థలాన్ని కేటాయిస్తున్నామన్నారు. ఫోర్టం సంస్థ ద్వారా దేశ వ్యాప్తంగా 40 వాహన చార్జింగ్ పాయింట్లు ఉండగా, హైదరాబాద్‌లోనే 36 పాయింట్లు ఉన్నాయన్నారు. పార్క్ హైదరాబాద్ యాప్ ద్వారా ఏ స్టేషన్లో పార్కింగ్ సౌక ర్యం ఉందో, ఎక్కడ ఖాళీ ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం నగరంలోని మెట్రో స్టేషన్ల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ పార్కింగ్ కేంద్రాల్లో 42 వేల బైక్‌లు, 400 కార్లను నిలిపేందు కు వీలుందన్నారు. బైక్‌కు రోజుకు రూ.10, కారు కు రూ.20 వసూలు చేస్తున్నప్పటికీ భవిష్యత్‌లో బైక్‌కు గంటకు రూ.3, కారుకు రూ.8 వసూలు చేయనున్నామన్నారు. అన్ని మెట్రో పార్కింగ్ కేంద్రాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో, నగర పోలీసు యంత్రాంగం కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించే ఏర్పాట్లు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్క్ హైదరాబాద్ నిర్వాహకులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బండి పార్క్‌చేస్తే బాదుడే
కర్ణాటక, బనశంకరి : హైటెక్ సిటీ బెంగళూరులో స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ అమల్లోకి రానుంది. పాలికే తన ఆదాయ వనరులను పెంచుకునేందుకు వాహనాల పార్కింగ్దారులపై భారం మోపనుంది. స్మార్ట్ పార్కింగ్ విధానం కింద వాహనదారులకు గంటల లెక్కన పార్కింగ్ రుసుం వసూలు చేయనుంది. ఇలా పదేళ్లలో రూ.397 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరుమహానగర పాలికెలో పార్కింగ్ ఓ మాఫియాగా మారిపోయింది. దీనికి అడ్డుకట్ట వేయాలనే దృష్టితో స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ అమలుకు బీబీఎంపీ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. ఈమేరకు టెండర్లు నిర్వహించి ఆమోదించింది. దీంతో నగరంలో త్వరలో 85 రోడ్లులో స్మార్ట్‌పార్కింగ్ విధానం అమల్లోకి రానుంది. పదేళ్లులో రూ.397 కోట్లుఆదాయం లక్ష్యం టెండర్ నిబంధనల మేరకు స్మార్ట్ పార్కింగ్ పొందిన కాంట్రాక్టర్ బీబీఎంపీ కి ఏడాదికి రూ.31.60 కోట్లు చెల్లిస్తారు. రానున్న పదేళ్ల వరకు ఏటా 5 శాతం మేర పెంచి పదేళ్లలో రూ.397.46 కోట్లు చెల్లిస్తారు. 13,600 వాహనాలకు పార్కింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ స్మార్ట్ పార్కింగ్‌ను మూడునెలల్లో అమల్లోకి తీసుకువస్తుంది. బీబీఎంపీ గుర్తించిన 85 రహదారుల్లో 3,600 కార్లు, 10 వేల బైక్‌లకు పార్కింగ్‌కు అవకాశం కల్పిస్తారు. పార్కింగ్ మీటర్లు .. పార్కింగ్ చార్జీలు వసూలు, రసీదు అం దించేందుకు మీటర్లు అమరుస్తారు. పార్కింగ్ స్థలంలోకి ప్రవేశించినప్పుడు పార్కింగ్ మీటర్లనుంచి రసీదు పొందాలి. తిరిగి బయలు దేరినప్పుడు రసీదులో బార్కోడ్ చూపిస్తే ఎంత చార్జీ అయింది చూపిస్తుంది. క్రెడిట్, డెబిట్ కార్డు లేదా స్మార్ట్స్ కార్డ్స్ ద్వారా రుసుం చెల్లించవచ్చు. పార్కింగ్ స్థలంలో సీసీ కెమెరా, మ్యాగ్నటెక్ ఐ ఆర్ సెన్సర్ అమరుస్తారు. వాహనాల పార్కింగ్ రోడ్లను మూడు కేటగిరీలుగా ఏర్పాటు చేస్తారు. ఏ ప్రీమియం, బీ వాణిజ్య, సీ సామాన్య అనే విభాగాలుగా విభజిస్తారు. ఏ కేటగిరిలో 14, బీ కేటగిరిలో 46, సీ కేటగిరిలో 25 రోడ్లు ఉంటాయి. చార్జీలు ఇలా ఉంటాయి ప్రతిగంటకు ప్రీమియం రోడ్లలో ద్విచక్రవాహనాలకు గంటకు రూ.15 , నాలుగు చక్రాల వాహనాలకు రూ.30 వసూలు చేస్తారు.వాణిజ్య రోడ్లలో ద్విచక్రవాహనాలకు రూ10, నాలుగు చక్రాల వాహనాలకు రూ.20, సామాన్య రోడ్లలో బైక్‌కు రూ.5, నాలుగు చక్రాల వాహనాలకు రూ.15 చార్జీలు వసూలు చేస్తారు. -
మెట్రో స్టేషన్లలో స్మార్ట్ పార్కింగ్
సాక్షి, హైదరాబాద్: త్వరలో నగరవాసుల పార్కింగ్ కష్టాలు తీరనున్నాయి. మెట్రో స్టేషన్లలో ‘పార్క్ హైదరాబాద్’పేరుతో అధునాతన స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటుకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ శ్రీకారం చుట్టింది. ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ పార్కింగ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఆధారంగా మియాపూర్–అమీర్‌పేట్–నాగోల్ (30 కి.మీ) మార్గంలోని 24 మెట్రో స్టేషన్ల వద్ద ఈ వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.8 కోట్లతో ‘జృతి సొల్యూషన్స్, ఎగైల్ పార్కింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’సంయుక్త ఆధ్వర్యంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను సైతం 20 ఏళ్లపాటు ఈ రెండు సంస్థలే నిర్వహిస్తాయి. ఇందుకుగాను హెచ్ఎంఆర్ఎల్ సంస్థకు రూ.ఏడు కోట్ల పార్కింగ్ లైసెన్సు ఫీజును ఆయా సంస్థలు చెల్లించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మొబైల్ యాప్‌తో పార్కింగ్ ప్లేస్ బుకింగ్.. ఈ స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థలో మీ వ్యక్తిగత ద్విచక్రవాహనం లేదా కారును పార్కింగ్ చేసుకునేందుకు అవసరమైన స్థలాన్ని మొబైల్ యాప్ ద్వారా నూ బుక్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన సమయంలో ఆయా స్టేషన్ల వద్ద పార్కింగ్ స్థలం అందు బాటులో ఉందా..? లేదా..? అన్న విషయాన్ని సైతం ఈ యాప్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. స్థలం అందుబాటులో ఉంటే మీ వాహనాన్ని జీపీఎస్ సాంకేతికత ఆధారంగా నేరుగా పార్కింగ్ కేంద్రానికి తీసుకెళ్లి పార్క్ చేయవచ్చు. ఇక 24 మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయనున్న పార్కింగ్ ప్రదేశాల్లో ఏకకాలంలో 4,000 ద్విచక్రవాహనాలు, 400 కార్లను పార్కింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. పార్కింగ్ ఫీజును సైతం ఆన్లైన్, మొబైల్ యాప్ ద్వారా చెల్లించే అవకాశం ఉండటం విశేషం. పార్కింగ్ కేంద్రాల్లో ఉచిత వై..ఫై.. వాహనాల పార్కింగ్ షెల్టర్లను అత్యాధునికత ఉట్టిపడేలా ఏర్పాటు చేయడంతోపాటు తీరైన ఆకృతు లు, పైకప్పులతో వీక్షకులను కట్టిపడేసేలా ఏర్పా టు చేయనున్నారు. వాహనాలు వర్షానికి తడవకుం డా.. ఎండకు ఎండకుండా షెల్టర్లను తీర్చిదిద్దను న్నారు. ఈ కేంద్రాల వద్ద కూర్చునే సదుపాయం కల్పించడంతోపాటు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. దశలవారీగా మిగతా మెట్రో స్టేషన్లలో ఏర్పాటు..? ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం మూడు కారిడార్లలో 72 కి.మీ. మార్గంలో మెట్రో ప్రాజెక్టును చేపడుతున్న విషయం విదితమే. మూడు మార్గాల్లో మొత్తం 65 మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతగా 24 స్టేషన్ల వద్ద స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రానున్నారు. మిగతా స్టేషన్ల వద్ద దశలవారీగా ఈ వసతి కల్పిస్తామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. కాగా ఈ ఏడాది ఆగస్టులో ఎల్బీనగర్–అమీర్‌పేట్ (16 కి.మీ.), అక్టోబరు నెలలో అమీర్‌పేట్–హైటెక్ సిటీ (11 కి.మీ.) రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనానికి రూ.3 కారుకైతే రూ.8 స్మార్ట్ పార్కింగ్ విధానంలో మీ ద్విచక్ర వాహనాన్ని మెట్రో స్టేషన్ వద్ద పార్క్ చేస్తే గంటకు రూ.మూడు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే కారుకైతే గంటకు రూ.ఎనిమిది చార్జీ వసూలు చేస్తారు. అన్ని పార్కింగ్ చెల్లింపుల లావాదేవీలను డిజిటైజేషన్ చేయనున్నారు. పార్కింగ్ ఉల్లంఘనలను సైతం సీసీటీవీలో రికార్డు చేయనున్నారు. ఈ కెమెరాలను పోలీసు కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంట్రల్‌కు అనుసంధానిస్తారు. పార్కింగ్ కేంద్రాల వద్ద వాహనాల భద్రతకుకు ప్రైవేటు సెక్యూరిటీతోపాటు ట్రాఫిక్ పోలీసులు రక్షణ కల్పించనున్నారు. -
బెంగళూరులో ఇక స్మార్ట్ పార్కింగ్
సాక్షి, బెంగళూరు: మెట్రో పాలిటన్ నగరాల్లో నేడు పార్కింగ్ సమస్య పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెల్సిందే. ఎక్కడ మోటారు బైక్‌ను ఆపాలో, ఎక్కడ కారు పార్కింగ్ చేయాలో తెలియక నగర జీవి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు బహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) త్వరలో స్మార్ట్ పార్కింగ్ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీని కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా అభివద్ధి చేసింది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు పార్కింగ్ సమస్య తీరినట్లే. యాప్ ద్వారా ఎక్కడ పార్కింగ్ స్థలం ఉందో, అందులో ఎన్ని ఖాళీ స్లాట్లు ఉన్నాయో ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా అడ్వాన్స్‌గా కూడా పార్కింగ్ స్థలాన్ని బుక్ చేసుకోవచ్చు. స్మార్ట్ పార్కింగ్ విధానం కింద నగరంలో 85 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఎక్కడికక్కడ ఎలక్ట్రానిక్ సెన్సర్లను ఏర్పాటు చేస్తున్నారు. కార్లపై నిఘా ఉంచేందుకు సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. సెన్సర్ల ద్వారా ఏ కారు ఎన్నిగంటలకు వచ్చిందో, ఎన్నిగంటలకు వెళుతుందో గుర్తించవచ్చు. ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా పార్కింగ్ చార్జీలు చెల్లించవచ్చు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు జరపొచ్చు. టూ వీలర్ బైకులకు, కార్లకు వేర్వేరు చార్జీలు వసూలు చేస్తారు. నగరంలో పార్కింగ్ స్థలాలను ఏ, బీ, సీ అంటూ మూడు కేటగిరీలుగా విభజిస్తున్నారు. కేటగిరీని బట్టి పార్కింగ్ చార్జీలు మారుతుంటాయి. తొలుత మూడువేల కార్లు, ఆరువేల మోటారు బైకులకు పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేస్తున్నారు. మనం వెళ్లే ప్రాంతాన్నిబట్టి అక్కడి పార్కింగ్ స్థలాన్ని, అందులోని ఖాళీ స్లాట్లను యాప్ ద్వారా ముందుగా గుర్తించవచ్చు. అవసరమైతే అడ్వాన్స్‌గా బుకింగ్ చేసుకోవచ్చు.