- రవాణాశాఖలో భారీగా పెరిగిన ఫీజులు
- నేటి నుంచి అమల్లోకి..
అనంతపురం సెంట్రల్ : వాహనదారులపై పిడుగు పడింది. రోడ్డు రవాణా శాఖకు వాహనదారులు చెల్లించే పన్నులు, ఫీజులను ప్రభుత్వం భారీగా పెంచేసింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్, రెన్యూవల్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, రోడ్డు ట్యాక్స్ తదితర పన్నుల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తోంది. ఈ ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి వీలుగా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఊహించని రీతిలో ఫీజులను పెంచేసింది. ఇది వరకూ డ్రైవింగ్ లైసెన్స్‌కు రూ. 600 కాగా.. పెరిగిన ధర ప్రకారం రూ.1200 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష హాజరైన అభ్యర్థి ఫెయిల్ అయితే గతంలో రూ.50 ఉండగా.. ప్రస్తుతం రూ.600లకు పెంచారు. డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత రెన్యూవల్ చేసుకోకపోతే ఏడాదికి రూ.వెయ్యి చొప్పున అపరాధ రుసుం వేయనున్నారు. వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (ఎఫ్‌టీ) గడువు ముగిసిన తర్వాత రెన్యూవల్ చేసుకోకపోతే రోజుకు రూ.50 చొప్పున అపరాధ రుసుం వేయనున్నారు. ఇది వరకూ ఈ రెండింటికీ ఎలాంటి అపరాధ రుసుమూ ఉండేది కాదు.
మధ్యాహ్నం నుంచి ఆగిన సేవలు : పన్నులు, ఫీజులను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రోడ్డు రవాణాశాఖలో సేవలు ఆగిపోయాయి. పెంచిన రేట్ల విషయంపై ఇంకా క్లారిటీ లేకపోవడంతో సేవలను నిలుపుదల చేశారు. కంప్యూటర్‌లో పాతరేట్లు కనిపిస్తుండడంతో అధికారులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. దీంతో వివిధ పనుల కోసం ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన ప్రజలను అధికారులు వెనక్కు పంపారు.
వెంటనే అమల్లోకి..: సుందర్‌వద్దీ, ఉపరవాణా కమిషనర్ (డీటీసీ)
పన్నులు, ఫీజుల విషయంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన రేట్లు తక్షణం అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. జిల్లాలో మంగళవారం నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయి.