Vehicle Tracker
-
ట్రాక్‌లో పడేదెప్పుడు? దశాబ్దకాలంగా అమలుకు నోచని వెహికిల్ ట్రాకింగ్
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారుల భద్రత కోసం అన్ని రకాల ప్రజా రవాణా వాహనాలను నిఘా చట్రంలోకి తేవాలన్న ప్రతిపాదన తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాత్రి పూట ఆలస్యంగా క్యాబ్‌లో వెళ్లేందుకు భయపడాల్సి వస్తోందని, ఇలాంటి వాహనాలపై పోలీసులు లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ నిఘా ఉంటే బాగుంటుందని ఇటీవల ఓ ప్రయాణికురాలు ట్వీట్ చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వెహికిల్ ట్రాకింగ్ అంశాన్ని పరిశీలించాలంటూ డీజీపీకి సూచించారు. ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత అన్ని ప్రజా రవాణా వాహనాల్లో జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ మేరకు అప్పట్లో రాష్ట్ర రవాణా శాఖ కూడా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గ్రేటర్లో తిరిగే క్యాబ్‌లు, ఆటోలు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, తదితర అన్ని రకాల వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు అది అమలుకు నోచలేదు. దారుణం జరగినప్పుడే.. ఢిల్లీలో 2012లో చోటుచేసుకున్న నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా మహిళల భద్రతను ప్రశ్నార్ధకం చేసింది. ముఖ్యంగా రాత్రి వేళ ప్రజా రవాణా వాహనాల వినియోగంపై భయాందోళనలను పెంచింది. క్యాబ్‌లు, ఆటోరిక్షాలు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం ఏ మాత్రం క్షేమం కాదనే భావన నెలకొంది. ఆ తర్వాత కొద్దిరోజులకే హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని మాదాపూర్ నుంచి క్యాబ్‌లో ఇంటికి వెళ్లే సమయంలో అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత జరిగిన మరికొన్ని ఘటనలు రాత్రివేళ ప్రయాణించే మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి వాహనంపై నిఘా తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు 2017లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు చట్టాన్ని రూపొందించింది. ప్రజా రవాణా వాహనాలపై నిఘా ఏర్పాటు చేసేందుకు నిర్భయ నిధి కింద కేంద్రం ఇచ్చే నిధులను ఖర్చు చేయవచ్చునని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు నిర్భయ నిధులు వచ్చాయి. కానీ మరోమారు ఈ అంశం అటకెక్కింది. నిఘా వ్యవస్థ ఏర్పాటు కాలేదు. గ్రేటర్లో తిరిగే క్యాబ్‌లలో ఆయా సంస్థలకు చెందిన వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ అవి పోలీసు నిఘా పరిధిలో లేవు. దీంతో ఫిర్యాదులొస్తే తప్ప పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోతోంది. మరోవైపు క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాల్లోని డివైస్‌లను స్విచ్ ఆఫ్ చేస్తే వాటిని ట్రాక్ చేయడం కష్టంగా మారుతోంది. ట్రాకింగ్‌తో పక్కా నిఘా ప్రతి వాహనంలో జీపీఎస్ వెహికిల్ ట్రాకింగ్ డివైస్‌ను ఏర్పాటు చేయడం వల్ల దాని కదలికలపైన కచ్చితమైన నిఘా ఉంటుంది. ట్రాకింగ్ డివైస్ నుంచి ప్రతి 10 సెకన్లకు ఒకసారి వాహనం కదలికలు కమాండ్ కేంద్రానికి అందుతాయి. ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రయాణికులు ఎస్ఓఎస్ బటన్ నొక్కితే కమాండ్ కంట్రోల్లో అలారం మోగుతుంది. వెంటనే పోలీసులు అప్రమత్తం అవుతారు. ప్రస్తుతం వాహనాల్లో అమర్చిన డివైస్‌లను తొలగించేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా పటిష్టంగా ఏర్పాటు చేసే సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, ప.బెంగాల్లో మైనింగ్ వాహనాలకు ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ కొన్ని బస్సులకు ఏర్పాటు చేసింది. రూ.5000 లోపు లభించే ట్రాకింగ్ డివైస్‌లను తప్పనిసరి చేయడం వల్ల మహిళలు, యువతులు, విద్యార్ధినులకు భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందజేయవచ్చు. ఆచరణ సాధ్యమే వెహికిల్ ట్రాకింగ్ వ్యవస్థ ప్రతిపాదన దశలోనే ఉంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి వాహనంలో ఈ డివైస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఆదేశిస్తే ఆచరణసాధ్యమే. – రమేశ్, సంయుక్త రవాణా కమిషనర్, ఐటీ విభాగం తక్కువ ఖర్చుతో భద్రత వెహిల్ ట్రాకింగ్ డివైస్‌లు ఏ మాత్రం భారం కాదు. కేవలం నాలుగైదు వేల రూపాయల ఖర్చుతో మంచి భద్రత కలి్పంచవచ్చు. ఇప్పుడు మరింత కచి్చతమైన ప్రమాణాలతో రూపొందించిన డివైస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి వాటిని వాహనంలో ఏర్పాటు చేస్తే తొలగించడం సాధ్యం కాదు. – ఆర్.ఎల్ రెడ్డి, సాంకేతిక నిపుణులు చదవండి: 'మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్,రాజశేఖర్‌కు బెదిరింపులు' -
అమల్లో ‘లైసెన్స్’
♦ ఉదయాన్నే తనిఖీల జోరు హా రూ. 500 జరిమానా ♦ ఉన్నతాధికారుల ఆదేశంతో వెనక్కి ♦ నాలుగు రోజులు అవకాశం ♦ ఆర్టీఏ కార్యాలయాల వద్ద బారులు వాహన చోదకులు ఒరిజినల్ లైసెన్స్‌ను కల్గి ఉండాలన్న ఉత్తర్వులు బుధవారం అమల్లోకి వచ్చాయి. ఉదయాన్నే పోలీసులు వాహనాల తనిఖీలు జోరెత్తారు. ఒరిజినల్ లైసెన్స్‌లు లేని వారి భరతం పడుతూ రూ.500 వరకు జరిమానా విధించారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశంతో కాసేపటికి వెనక్కు తగ్గారు. ఇక, ఆర్టీఏ కార్యాలయాలు వాహనదారులతో కిటకిటలాడాయి. సాక్షి, చెన్నై : అతి వేగం కారణంగా ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో వాహనదారుల భరతం పట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి వాహన దారుడు తమ వెన్నంటి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కల్గి ఉండాల్సిందేనన్న ఉత్తర్వులకు మద్రాసు హైకోర్టు సైతం మద్దతు ప్రకటించింది. దీంతో బుధవారం నుంచి ఒరిజినల్ లైసెన్స్‌లు తప్పనిసరి అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో రాష్ట్రంలో అనేకచోట్ల పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. సాధారణంగానే వాహనదారులు పట్టుబడితే, ముక్కు పిండి మరీ జరిమానా మోత విధించే పోలీసులు, తాజాగా ఒరిజినల్ అస్త్రంతో ఉదయాన్నే రోడ్డెక్కారు. చెన్నై వంటి నగరాల్లో సిగ్నల్స్ వద్ద హెల్మెట్లు ధరించి ఉన్నా సరే, అనుమానంగా కనిపిస్తే చాలు, ఆ వాహన దారుడి లైసెన్స్‌ను పరిశీలించడం, ఒరిజినల్ లేని పక్షంలో రూ. 500 జరిమానా మోత మోగించే పనిలో పడ్డారు. వేధించవద్దన్న ఉన్నతాధికారులు పదిన్నర, పదకొండు గంటల వరకు అనేకచోట్ల ఈ జరిమానా మోత మోగినా, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో పోలీసులు వెనక్కు తగ్గారు. వాహనదారుల్ని వేధించే చర్యలకు పాల్పడ వద్దని పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు రోజుల పాటు ఎలాంటి తనిఖీలు వద్దని, లైసెన్స్‌లు పొందేందుకు తగ్గ అవకాశాన్ని ఇచ్చే విధంగా వాహనదారులకు కాస్త ఊరట కల్పించారు. ఈ నాలుగు రోజుల పాటు ›ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీకి పోలీసులు నిర్ణయించారు. ఇక, శనివారం వరకు గడువు లభించినట్టు అయింది. ఆదివారం సెలవు దినం కావడంతో, తదుపరి సోమవారం నుంచి పోలీసుల తనిఖీలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఎక్కువే. దీంతో వాహనదారులు లైసెన్స్‌ల కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద క్యూ కట్టే పనిలో పడ్డారు. ఆర్టీఏ వద్ద క్యూ రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు లైసెన్స్‌లు, డూప్లికేట్ ఒరిజినల్స్ కోసం దరఖాస్తుల్ని హోరెత్తిస్తున్నారు. దీంతో ఆర్టీఏ కార్యాలయాల వద్ద క్యూ చాంతాడంతగా పెరిగింది. అలాగే, అక్కడి బ్రోకర్లకు పండుగే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. గత నెలాఖరులో డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ తప్పనిసరి అన్న ఉత్తర్వుల్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు 82 వేల మంది లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు చేసుకుని ఉండడం గమనార్హం. అలాగే, లక్ష మంది రెన్యూవల్‌కు, మూడు వేల మంది వరకు డూప్లికేట్ ఒరిజినల్ లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. జూన్, జూలై నెలల్లో 60 నుంచి 70 వేలలోపు దరఖాస్తులు లైసెన్స్‌లు, రెన్యూవల్స్ కోసం రాగా, ప్రస్తుతం సంఖ్య పెరగడం గమనించాల్సిన విషయం. ఇక, చెన్నైలోని 14 ఆర్టీఏ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వాహనదారులు బారులు తీరడంతో ఆ పరిసరాలు కిటకిటలాడాయి. బ్రోకర్లు తామంటే తాము త్వరితగతిన ఇప్పిస్తామంటూ వాహన చోదకుల ముందు వాలిపోయారు.